Yadagiri: యాదగిరికొండపై భక్తుల కోలాహలం
ABN, First Publish Date - 2023-04-29T21:17:49+05:30
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshminarasimhaswamy) పుణ్యక్షేత్రంలో శనివారం భక్తుల కోలాహలం నెలకొంది. స్వామివారి ధర్మదర్శనాలకు 2గంటలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshminarasimhaswamy) పుణ్యక్షేత్రంలో శనివారం భక్తుల కోలాహలం నెలకొంది. స్వామివారి ధర్మదర్శనాలకు 2గంటలు, ప్రత్యేక దర్శనాలకు అరగంట సమయం పట్టిందని భక్తులు (Devotees) తెలిపారు. సుమారు 25వేలకు పైగా భక్తులు ఇష్టదైవాలను దర్శించుకున్నారు. ప్రధానాలయ ముఖమండపంలో సువర్ణ పుష్పార్చన, ప్రాకార మండపంలో వేదాశీర్వచనంతో పాటు పలు ఆర్జిత సేవోత్సవాల్లో భక్తజనులు కుటుంబసమేతంగా పాల్గొని మొక్కు తీర్చుకున్నారు. ఉదయం ఎడతెరిపి లేకుండా సుమారు రెండు గంటల పాటు వర్షం కురవడంతో ఇష్టదైవాల దర్శనాల కోసం వచ్చిన భక్తులు కాస్త ఇబ్బందులకు గురయ్యారు. వర్షంలోనే దేవదేవుడిని దర్శించుకునేందుకు తరలివెళ్లారు. యాదగిరీశుడికి శనివారం నిత్య పూజలు ఆగమ శాస్త్రరీతిలో వైభవంగా నిర్వహించారు. సుప్రభాతంతో ఆరంభమైన నిత్య పూజలు రాత్రి వేళ శయనోత్సవ పర్వాలతో ముగిశాయి. వర్షం కారణంగా ఆలయ మొదటి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్యతిరుకల్యాణోత్సవం నిర్వహించారు. స్వామి వారి ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.23,49,242ల ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు.
కేంద్ర, రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్ ప్రస్థానం దిగ్విజయంగా సాగాలి : మంత్రి ఎర్రబెల్లి
రానున్న ఎన్నికల్లో కేంద్ర, రాష్టాల్లో బీఆర్‌ఎస్ (BRS) ప్రస్థానం దిగ్విజయంగా సాగాలని స్వామిని వేడుకున్నట్టు పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao) తెలిపారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి శనివారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. వారికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రధానాలయంలో పూజలనంతరం ప్రాకార మండపంలో ఆశీర్వచనం నిర్వహించారు. దేవస్థాన అధికారులు వారికి స్వామివారి అభిషేకం లడ్డూ ప్రసాదాలను అందజేశారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ, యాదగిరీశుడు తన ఇలవేల్పు దైవమని, తనకు మంచి జరిగినప్పుడల్లా స్వామిని దర్శించుకుంటానని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదివారం సెక్రటేరియట్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. యాదగిరీశుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానని, నూతన సచివాలయం నుంచి సీఎం కేసీఆర్ మరింత మంచి పాలనను అందించాలని కోరుకున్నట్టు తెలిపారు. ప్రతిపక్షాలు దేవాలయాల పేర్లు చెప్పి, సందర్శించి చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. దర్శనానంతరం బయటకు వచ్చే దారిలో భక్తులను మంత్రి పలకరించారు. ఆలయ పునర్నిర్మాణం ఎలా ఉందని వారితో ముచ్చటించారు.
Updated Date - 2023-04-29T21:24:23+05:30 IST