Anantapur : ప్రాణాలు తీసిన అజాగ్రత్త
ABN, Publish Date - Nov 24 , 2024 | 04:08 AM
వేకువజామునే అరటి తోటలో పనులకు వెళ్లి.. తిరిగి ఆటోలో ఇళ్లకు బయలుదేరిన వ్యవసాయ కూలీలను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది.
బస్సును గమనించకుండా ఆటో దూకుడు.. 8 మంది కూలీలు దుర్మరణం
మరో ఐదుగురికి తీవ్ర గాయాలు
అరటి తోటలో పనిచేసి ఆటోలో తిరిగి వెళ్తుండగా ఘటన
8అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సీఎం దిగ్ర్భాంతి..5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
గార్లదిన్నె, పుట్లూరు, అనంతపురం టౌన్, అమరావతి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): వేకువజామునే అరటి తోటలో పనులకు వెళ్లి.. తిరిగి ఆటోలో ఇళ్లకు బయలుదేరిన వ్యవసాయ కూలీలను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసిపల్లి సమీపంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామ ఎస్సీ కాలనీవాసులు. గార్లదిన్నె మండలం తిమ్మంపేటలోని ఓ అరటి తోటలో పని కుదరడంతో స్వగ్రామం నుంచి డ్రైవర్ సహా 13 మంది బయలుదేరారు. తోటలో పని ముగించుకుని మధ్యాహ్నం తిరిగి ఇళ్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తిమ్మంపేట నుంచి 44వ నంబరు జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ.. గార్లదిన్నెలోకి ప్రవేశించేందుకు జంక్షన్ వద్ద ఎడమ వైపు రహదారి నుంచి ఆటో కుడివైపునకు వచ్చింది. అదే సమయంలో ధర్మవరం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న బాలపెద్దయ్య(55), చిన్న నాగమ్మ (60) అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను 108లో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, మార్గమధ్యంలో పెద్దక్క(68), రామాంజినమ్మ(35) మరణించారు.
అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయరాముడు(48), చిన్ననాగన్న(55), కొండమ్మ (50), ఈశ్వరయ్య(53) మృతిచెందారు. పెద్దులమ్మ, గంగాధర్, లక్ష్మీదేవి, రామాంజినమ్మ, ఆటో డ్రైవర్ నీలకంఠేశ్వర చికిత్స పొందుతున్నారు. వీరికి ప్రాణాపాయం లేదని అనంతపురం జిల్లా ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారామ్ తెలిపారు. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
లారీ వెనుక వస్తున్న బస్సును గమనించకే...
అనంతపురం-బెంగళూరు జాతీయ రహదారి గార్లదిన్నె సమీపంలో నాలుగు లైన్లుగా ఉంది. అనంతపురం వైపు నుంచి లారీ, ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వైపు వెళ్తుండగా, అదే సమయంలో వ్యవసాయ కూలీల ఆటో గార్లదిన్నె వైపు వెళ్లేందుకు తలగాసిపల్లి జంక్షన్ వద్దకు చేరుకుంది. లారీ వెళ్లిపోగానే, దాని వెనుక వస్తున్న బస్సును గమనించకుండా ఆటో డ్రైవర్ ముందుకు పోనీయడంతో బస్సు డ్రైవర్ తప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ అదుపు కాక ఆటో అంచును ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్నవారు చెల్లాచెదురుగా పడిపోయారు. ప్రమాద స్థలం భీతావహంగా మారింది.
Updated Date - Nov 24 , 2024 | 04:08 AM