జలాలపై జాలీగా.. ఆకాశమే హద్దుగా
ABN , Publish Date - Nov 09 , 2024 | 05:45 AM
పర్యాటక రంగానికి ఊపు తెచ్చేందుకు రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా చేపడుతున్న సీప్లేన్ సర్వీ్‌సకు శుక్రవారం నిర్వహించిన సెమీ ట్రయల్ రన్ విజయవంతమైంది.
నీటిపై నుంచి నింగిలోకి ఎగిరిన సీప్లేన్
సెమీ ట్రయల్ రన్ విజయవంతం
నేడు సీఎం చేతుల మీదుగా ట్రయల్ రన్
సీప్లేన్‌లో బెజవాడ నుంచి శ్రీశైలానికి చంద్రబాబు
శ్రీశైలం/విజయవాడ నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): పర్యాటక రంగానికి ఊపు తెచ్చేందుకు రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా చేపడుతున్న సీప్లేన్ సర్వీ్‌సకు శుక్రవారం నిర్వహించిన సెమీ ట్రయల్ రన్ విజయవంతమైంది. విజయవాడ ఇంద్రకీలాద్రి, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాల మధ్య టెంపుల్ టూరిజానికి మరింత ఆకర్షణ, ఆదరణ తీసుకొచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం సీప్లేన్ సేవలకు శ్రీకారం చుట్టనుంది. ‘స్కై మీట్స్ సీ’ పేరుతో విజయవాడ-శ్రీశైలం మధ్య ప్రయోగాత్మకంగా చేపడుతున్న సీప్లేన్ సర్వీసుకు సంబంధించిన డెమో కార్యక్రమాన్ని (ట్రయల్ రన్) ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ప్రారంభిస్తారు. దీనికోసం శుక్రవారం ముందుగానే సెమీ ట్రయల్ రన్ నిర్వహించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి బయల్దేరిన సీ ప్లేన్ రెండున్నర గంటల్లో శ్రీశైలానికి చేరుకుంది. ఎస్డీఆర్‌ఎఫ్, పోలీస్, టూరిజం, ఎయిర్ ఫోర్స్ అధికారుల సమక్షంలో సెమీ ట్రయల్ రన్‌ను నిర్వహించారు. కాగా, శనివారం నిర్వహించే ట్రయల్ రన్ సందర్భంగా సీఎం చంద్రబాబు సీప్లేన్‌లో విజయవాడ నుంచి శ్రీశైలం చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా, జేసీ విష్ణు చరణ్, సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీప్లేన్ ల్యాండయ్యే ప్రదేశం, పాతాళగంగ బోటింగ్ ప్రదేశం నుంచి రోప్‌వేను పరిశీలించారు. 523 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు 10 స్పెషల్ పార్టీలు, నాలుగు గ్రేహౌండ్స్ బృందాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు.