అదానీ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం
ABN, Publish Date - Dec 19 , 2024 | 04:06 AM
అనంతపురం జిల్లా యాడికి మండలం బోయరెడ్డిపల్లి గ్రామం వద్ద ఉన్న అదానీ సిమెంట్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
ఒకరు మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు
కూలర్ మరమ్మతులు చేస్తుండగా కార్మికులపై పడిన వేడి పౌడర్
తాడిపత్రి/యాడికి, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా యాడికి మండలం బోయరెడ్డిపల్లి గ్రామం వద్ద ఉన్న అదానీ సిమెంట్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేడి వేడి పౌడర్ మీద పడటంతో ఒకరు మృతి చెందగా, ఐదుగురు షణ్ముఖానందరెడ్డి, కంబగిరి రాముడు, ధర్మన్ సింగ్, వికాస్, దీపక్ తీవ్రంగా గాయపడ్డారు. సిమెంట్ ఫ్యాక్టరీ లైన్-2లో ఉన్న కోల్‌మిల్లులో 8 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కోల్‌మిల్లు సమీపంలోని కూలర్ చెడిపోయిందని, దానికి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం జరిగిందని కార్మికులు తెలిపారు. మరమ్మతులు చేస్తున్న సమయంలో కోల్ మిల్లులో అమర్చిన ఇటుకలు ఊడిపడ్డాయని, కూలర్‌కు రంధ్రాలు పడి.. అందులో ఉన్న పౌడర్ కార్మికుల మీద పడటంతో తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. కార్మికుల మీద పడిన పౌడర్ సుమారు 400 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగి ఉంటుందని సమాచారం. ఈ ప్రమాదంలో పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు గ్రామానికి చెందిన శివకేశవ(28) అక్కడికక్కడే మృతిచెందారు. యాడికి మండలం నిట్టూరు గ్రామానికి చెందిన షణ్ముఖానందరెడ్డి, చింతలాయపల్లి గ్రామానికి చెందిన కంబగిరిరాముడు, బిహార్‌కు చెందిన ధర్మన్‌సింగ్, దీపక్, వికాస్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను అదానీ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉన్న హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం తాడిపత్రికి తరలించారు. బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం తరలించారు.
Updated Date - Dec 19 , 2024 | 04:06 AM