Adimulapu Suresh: డ్రామాలు కట్టిపెట్టి.. కూటమి ప్రభుత్వాన్ని నిలదీయండి
ABN, Publish Date - Nov 18 , 2024 | 03:28 PM
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురించి ఏమి తెలియకుండా అవాకులు, చవాక్కులు మాట్లాడుతున్నారంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగపై మాజీ మంత్రి అదిమూలపు సురేశ్ మండిపడ్డారు. సోమవారం అమరావతిలో అదిమూలపు సురేశ్ మాట్లాడుతూ.. మంద కృష్ణ వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి, నవంబర్ 18: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ మంద కృష్ణ మాదిగపై వైసీపీ నేత, మాజీ మంత్రి అదిమూలం సురేష్ మండిపడ్డారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురించి మంద కృష్ణ మాదిగకు ఏం తెలుసు అని ప్రశ్నించారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఏమి తెలియకుండా.. ఆయనపై మందకృష్ణ మాదిగ అవాకులు, చవాకులు పెలుతున్నారన్నారు.
సోమవారం అమరావతిలో మాజీ మంత్రి అదిమూలం సురేష్ విలేకర్లతో మాట్లాడుతూ.. హోం మంత్రి దళితులకు ఇవ్వాలని.. సామాజిక న్యాయం చేసింది జగన్ మోహన్ రెడ్డి అని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. అనితకు హోం మంత్రి పదవి ఎలా వచ్చిందన్నారు. సామాజిక న్యాయం చేసి చూపింది ఒక్క జగన్ మోహన్ రెడ్డి కాదా? అంటూ మంద కృష్ణ మాదిగను సూటిగా ప్రశ్నించారు. రాజకీయాలు పక్కన పెడదాం.. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై అనవసర విమర్శలు చేస్తే.. చూస్తూ ఊరుకోబోమని మంద కృష్ణమాదిగకు మాజీ మంత్రి అదిమూలపు సురేశ్ హెచ్చరించారు.
ఎవరి చేతిలోనో కీలు బొమ్మ అయ్యారంటూ మంద కృష్ణమాదిగపై విమర్శలు వస్తున్నాయని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. డ్రామాలు అన్ని కట్టిపెట్టి.. కూటమి ప్రభుత్వాన్ని నిలదీయండంటూ మంద కృష్ణమాదిగకు అదిమూలపు సురేష్ ఈ సందర్భంగా హితవు పలికారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు.
మాదిగ జాతి అభ్యున్నతికి ఎవరు ఏమి చేశారో.. ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉన్న సంగతి మర్చి పోతున్నారా? అని మంద కృష్ణ మాదిగను మాజీ మంత్రి సురేష్ ఈ సందర్భంగా నిలదీశారు. కళ్ళు వున్న కబోదిలా మంద కృష్ణ వ్యవహరిస్తే చేసేది ఏమీ లేదంటూ ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
గతంలో సీఎం చంద్రబాబుతో ఎన్నిసార్లు విభేదించారో ఓ సారి గుర్తు చేసుకోవాలంటూ ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగకు ఆయన సూచించారు. ఇక ఎన్డీయే కూటమిలో చంద్రబాబు, మంద కృష్ణ భాగస్వాములు అని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రయోజనాల కోసం జాతి ప్రజా ప్రయోజనాలను తుంగలో ఎందుకు తొక్కుతున్నారంటూ మంద కృష్ణ మాదిగపై మాజీ మంత్రి అదిమూలపు సురేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
For AndhraPradesh News And Telugu News
Updated Date - Nov 18 , 2024 | 03:28 PM