అందరి చూపు మంగళగిరి వైపే !
ABN, Publish Date - May 04 , 2024 | 04:17 AM
అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం మరోసారి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. గత ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి బరిలో నిలిచారు.
ఓడినచోటే నెగ్గాలని లోకేశ్ పట్టుదల
ఐదేళ్లుగా నియోజకవర్గంలోనే మకాం
సొంత డబ్బుతో సంక్షేమం, అభివృద్ధి
అయినా ఓడిస్తామంటున్న వైసీపీ
ఆళ్లను కాదని మురుగుడు లావణ్యకు సీటు
వెంటాడుతున్న అమరావతి విధ్వంసం
అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం మరోసారి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. గత ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి బరిలో నిలిచారు.
2014, 19ల్లో వరుసగా రెండు సార్లు వైసీపీ తరఫున విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని సీఎం జగన్ ఈసారి పక్కన పెట్టేశారు. లోకేశ్‌కు ప్రత్యర్థిగా వైసీపీ తరఫున చేనేత వర్గానికి చెందిన మురుగుడు లావణ్యకు టికెట్ ఇచ్చారు.
ఈమె మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు.. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె. అయినా లోకేశ్‌వైపే మొగ్గు కనిపిస్తోందని, పోరు ఏకపక్షమేనని వివిధ సర్వేలు చెబుతుండడంతో టీడీపీ వర్గాలు భారీ మెజారిటీ కోసం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు.
కూటమి పక్షాలైన జనసేన, బీజేపీ శ్రేణులు కూడా మద్దతుగా నిలుస్తున్నాయి. ఇండియా కూటమి అభ్యర్థిగా సీపీఎం సీనియర్ నాయకుడు జొన్నా శివశంకరరావు, బీసీవైపీ పార్టీ నుంచి బోడె రామచంద్రయాదవ్, జైభీమ్ భారత్ పార్టీ తరఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 40 మంది పోటీ చేస్తున్నారు.
నాడు కుట్రలు, కుయుక్తులతో..
గత 2019 ఎన్నికలలో లోకేశ్‌ను ఓడించడానికి వైసీపీ ఎన్నో కుట్రలు, కుయుక్తులు పన్నింది. పెద్దఎత్తున దుష్ప్రచారాలు సాగించింది. ఆయన గెలిస్తే కాలువ కట్టలపై ఉన్న నివాసాలను, ఇతర ప్రభుత్వ భూముల్లో ఉన్న ఇళ్లను కూల్చివేయిస్తారని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ప్రజలు నమ్మారు.
కానీ జగన్ వచ్చాక అంతా రివర్స్ అయింది. సీఎం నివాసానికి సమీపంలో పేదలు ఉండరాదంటూ బకింగ్‌హమ్ కాలువ కట్టపై వున్న వందలాది మంది పేదల నివాసాలను కూల్చివేయించారు. ఇప్పటం, కురగల్లు, పెదవడ్లపూడి, రేవేంద్రపాడు సహా అనేకచోట్ల కాలువ, చెరువు కట్టలు, ఇతర ప్రభుత్వ భూముల్లో ఉంటున్న పేదల నివాసాలను ఎమ్మెల్యే ఆళ్ల కూల్చి వేయించారు.
మూడు రాజధానుల పేరిట రాజధాని అమరావతిని జగన్ బొందపెట్టడంతో మంగళగిరి నియోజకవర్గం, చుట్టుపక్కల గ్రామాల్లో భూముల ధరలు అమాంతం పడిపోయాయి. క్రయవిక్రయాలు స్తంభించాయి.
భవన నిర్మాణ కార్యకలాపాలు అటకెక్కాయి. విధ్వంస పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఇంకోవైపు.. ఓడినచోటే గెలిచి తానేంటో నిరూపించుకోవాలని లోకేశ్ పట్టుదలతో పనిచేశారు. ఐదేళ్లుగా నియోజకవర్గమంతా కలియదిరిగారు.
ఊరూరా సమస్యలను తెలుసుకుంటూ ప్రజలతో మమేకమవుతూ వచ్చారు. పేదల సమస్యలను పరిష్కరించేందుకు సొంత నిధులు ఖర్చుచేస్తున్నారు. 29 రకాల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. సుమారు 4 వేల మంది నిరుపేద నేతన్నల కుటుంబాలకు ఆధునిక రాట్నాల పంపిణీతోపాటు వీవర్స్‌షెడ్లను ఏర్పాటు చేయించి టాటా తవేరా సంస్థ ద్వారా ఆధునిక మగ్గాలపై శిక్షణ ఇప్పిస్తూ అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించారు. గత ఎన్నికల్లో నియోజకవర్గంలోని కాపులు, రెడ్లు టీడీపీకి వ్యతిరేకంగా ఓటేశారు.
కానీ ఇప్పుడు వారిలోనూ మార్పు కనిపిస్తోంది. లోకేశ్‌పై బలమైన అభ్యర్థిని రంగంలో నిలపాలన్న టెన్షన్‌తో జగన్ రకరకాల ప్రయోగాలు చేశారు. తొలుత ఆళ్లనే కొనసాగించాలనుకున్నా.. చివరకు అభ్యర్థి మార్పుతోనే పార్టీకి లాభమన్న ఆలోచనతో టీడీపీ నుంచి తీసుకొచ్చిన గంజి చిరంజీవిని ఖరారు చేశారు. మళ్లీ నెల రోజులకే మనసు మార్చుకున్నారు.
లోకేశ్‌ను ఎదుర్కొనే సత్తా ఆయనకు లేదని భావించి మురుగుడు లావణ్యకు టికెట్ ఇచ్చారు. ఈ గందరగోళం మధ్య ఆళ్ల రాజీనామా చేసి వెళ్లి... రెండు నెలల్లోనే తిరిగొచ్చారు.
లోకేశ్ బలాలు..
2019లో ఓటమి తాలూకు సానుభూతి.. గత ఐదేళ్లుగా నియోజకవర్గాన్నే అంటిపెట్టుకుని ఉండడం.. చేనేతలు సహా ఆయా వర్గాలకు ఇస్తున్న హామీలపై సానుకూలత.. టీడీపీ గెలుపుతోనే రాజధాని అమరావతి నిలబడుతుందని ప్రజల్లో విశ్వాసం.. పటిష్ఠమైన కేడర్.. అటు జనసేన శ్రేణులూ చిత్తశుద్ధితో పనిచేస్తుండడం.
బలహీనతలు
ప్రచారాన్ని రచ్చబండల వరకే పరిమితం చేయడం.. ఇంటింటి ప్రచారం చేయకపోవడం.
మురుగుడు లావణ్య బలాలు..
పుట్టింటివారు, అత్తింటివారు రాజకీయ కుటుంబాలు కావడం.. ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఈమెపై పెద్దగా లేకపోవడం.. రాజకీయాలకు పూర్తిగా కొత్తకావడం.
బలహీనతలు
అమరావతిని జగన్ ధ్వంసం చేయడం.. వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత... బలమైన నాయకులు
టీడీపీలో చేరడం.
మంగళగిరి
నియోజకవర్గ స్వరూపం..
మొత్తం ఓటర్ల్లు: 2,94,432 పురుషులు: 1,40,660
మహిళలు: 1,51,759 ట్రాన్స్‌జెండర్లు: 13
సామాజిక వర్గాలవారీగా..: మాదిగలు: 40 వేలు, మాలలు: 38 వేలు, పద్మశాలి:37 వేలు, కాపులు: 27 వేలు, రెడ్లు: 23 వేలు,
కమ్మ: 19 వేలు, యాదవ: 18 వేలు, ముస్లింలు: 18 వేలు.
గౌడ: 17 వేలు, నాయీ బ్రాహ్మణులు: 9 వేలు , రజకులు: 9 వేలు.
మండలాలు: తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల
Updated Date - May 04 , 2024 | 04:17 AM