కుట్రలు ఛేదించుకుని..!
ABN, Publish Date - Dec 20 , 2024 | 03:43 AM
రాజధాని అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు జగన్ అండ్ కో చేసిన ప్రయత్నాలన్నీ వమ్మయ్యాయి. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా.. ప్రపంచబ్యాంకు రుణం రాకుండా చేసిన కుట్రలన్నిటినీ ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఛేదించింది.
రాజధాని నిర్మాణానికి ప్రపంచబ్యాంకు రూ.6,750 కోట్లు రుణం
అమరావతి, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు జగన్ అండ్ కో చేసిన ప్రయత్నాలన్నీ వమ్మయ్యాయి. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా.. ప్రపంచబ్యాంకు రుణం రాకుండా చేసిన కుట్రలన్నిటినీ ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఛేదించింది. ముమ్మర యత్నాలతో అమరావతి అభివృద్ధికి రుణ మంజూరుకు ఆమోదముద్ర వేయుంచగలిగింది. కొద్ది రోజుల కిందట రూ.6,800 కోట్ల రుణానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ఆమోదించగా.. గురువారం రాత్రి పొద్దుపోయాక ప్రపంచబ్యాంకు బోర్డు అమరావతి అభివృద్ధికి రూ.6,750 కోట్ల అప్పు ఇవ్వడానికి ఆమోదముద్ర వేసింది. వాస్తవానికి 2018లోనే రాజధాని నిర్మాణానికి రుణం మంజూరుకు ప్రపంచబ్యాంకు అంగీకరించింది. కానీ ఆ డబ్బు రాకుండా నాటి ప్రతిపక్ష నేత జగన్ అండ్ కో ఎన్నో కుట్రలు పన్నారు. ఈ వ్యవహారంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేస్తూ ప్రపంచబ్యాంకుకు లేఖలు రాశారు. అమరావతి వరదలకు మునిగిపోతుందని.. రుణమిస్తే నీటిపాలవుతుందంటూ పదే పదే ఈ-మెయిల్స్ పంపారు. రాజధాని గ్రామాలతో సంబంధం లేని రైతులతోనూ ఫిర్యాదులు చేయించారు. బెదిరించి భయపెట్టి భూములు లాక్కున్నారని చెప్పించారు.
రాజధాని భూముల కొనుగోలులో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ జగన్ రోతపత్రికలో విషపు కథనాలు వండి వార్చారు. ఈ పరిణామాలతో ప్రపంచబ్యాంకు వెనక్కి తగ్గింది. తర్వాత కొద్దికాలానికే జగన్ సీఎం అయ్యారు. అమరావతి నిర్మాణానికి తమకు రుణం అక్కర్లేదని ప్రపంచబ్యాంకుకు లేఖ రాశారు. తర్వాత మూడు రాజధానులంటూ మూడుముక్కలాట ఆడారు. గత ఐదేళ్లలో నిర్మాణ పనులు ఆపేసి అమరావతిని సర్వనాశనం చేశారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాక రాజధాని నిర్మాణానికి ఉన్న ఒక్కొక్క ఆటంకాన్ని తొలగిస్తూ వస్తున్నారు. మోదీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌లో రూ. 15 వేల కోట్ల ఆర్థిక సాయం ప్రకటించేలా చేశారు. తర్వాత ప్రపంచబ్యాంకు, ఏడీబీలను సంప్రదించారు. ప్రపంచబ్యాంకు ప్రతినిధులు, కేంద్రప్రభుత్వ అధికారులు వారంరోజులపాటు రాజధానిలోనే మకాం వేసి.. వైసీపీ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని రూఢి చేసుకున్నారు. ఢిల్లీలో కేంద్ర, రాష్ట్ర అధికారులతో పలు దఫాలు చర్చించాక ఎట్టకేలకు గురువారం రాత్రి బ్యాంకు పాలక బోర్డు అప్పు మంజూరుకు ఆమోదముద్ర వేసింది.
Updated Date - Dec 20 , 2024 | 03:43 AM