Peddireddy: అటవీ శాఖ.. పెద్దిరెడ్డి ఇలాకా!
ABN, Publish Date - Aug 26 , 2024 | 05:00 AM
రాష్ట్రంలో ప్రభుత్వం మారినా అటవీ శాఖ మాత్రం మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇలాకా గానే కొనసాగుతోంది. ఈ శాఖలోని కొందరు కీలక అధికారులు ఇంకా గత వైసీపీ ప్రభుత్వం నాటి తీరునే కొనసాగిస్తున్నారు...
మారేడుమిల్లి అడవుల్లో కోట్లాది రూపాయల అక్రమాలు
ఓ ఐఎ్‌ఫఎస్ అధికారిని కాపాడుతున్న కీలక అధికారులు
రేంజ్ అధికారిని సస్పెండ్ చేసి నెల తిరక్కుండా పోస్టింగ్
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో ప్రభుత్వం మారినా అటవీ శాఖ మాత్రం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) ఇలాకా గానే కొనసాగుతోంది. ఈ శాఖలోని కొందరు కీలక అధికారులు ఇంకా గత వైసీపీ ప్రభుత్వం నాటి తీరునే కొనసాగిస్తున్నారు. అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో వైఎస్ జగన్ సర్కారు పాలనలో చోటుచేసుకున్న అక్రమాలకు బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తూ.. వాటి తీవ్రతను తగ్గించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇక్కడి అడవుల్లో వందలాదిగా టేకు చెట్లను మాయం చేయడంతో పాటు ఎకో టూరిజం పేరిట నిధులు స్వాహా చేయడం వంటి వ్యవహారాల్లో రూ.కోట్ల మేర అక్రమాలు జరిగాయని అటవీశాఖ విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ విభాగాల విచారణలో నిర్ధారణ అయింది. ఈ బాగోతంలో రంపచోడవరం అటవీ డివిజన్‌లోని ఓ ఐఎఫ్ఎస్ అధికారి నుంచి నాటి అటవీశాఖ మంత్రి పేషీ వరకూ వివిధ స్థాయుల్లో ఉన్నతాధికారులు పాత్రధారులు కాగా అప్పటి అటవీ మంత్రి, ఎమ్మెల్సీ అనంతబాబు తదితర జగన్ సన్నిహిత నేతలు సూత్రధారులుగా ఉన్నారు.
వీరందరికీ ఎప్పటికప్పుడు ఎవరి వాటాలు వారికి అందడంతో అటవీ సంపద దర్జాగా చెక్‌పోస్టులు దాటిపోయేది. అడవి దాటిపోయిన కలపను తిరిగి వేరే ప్రాంతంలో దొరికినట్లుగా చూపిన ఓ ఉన్నతాధికారి బృందానికి విచారణాధికారులు అండగా నిలిచారు. రంపచోడవరంలో ఉండే ఈ ఐఎఫ్ఎస్ అధికారికి, ఇక్కడే ఉండే ఓ ఐఏఎస్ అధికారి, మరో ఐపీఎస్ అధికారి కొమ్ముకాశారు. ఇక మారేడుమిల్లిలో ఎకో టూరిజం ప్రాజెక్టు ముసుగులో వీరు తమ అక్రమాలను కొనసాగించారు. గిరిజనులతో నడిచే కమ్యూనిటీ బేస్డ్ ఏకో టూరిజం కార్యక్రమాల్లో కమిటీలు లేకుండా చేసి నిధులను స్వాహా చేశారు. గుడిసె టూరిజం ప్రాజెక్టులో అధికారులే గిరిజన కమిటీని రద్దుచేసి నిబంధనలకు విరుద్ధంగా నిధులు డ్రా చేసేశారు.
ఈ బాగోతాలపై మీడియాలో కథనాలు రావడంతో విచారణలు జరిగి, ఆయా అడవుల్లో అక్రమంగా నరికివేతకుగురై, చెట్లు గల్లంతైన లెక్కలు తేలినా బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు వెనుకంజ వేస్తూ వచ్చారు. మొక్కుబడిగా ఓ రేంజ్ అధికారిని, మరో ఇద్దరిని సస్పెండ్ చేసినా, మళ్లీ నెల రోజులకే ఆ రేంజ్ అధికారికి తిరిగి పోస్టింగ్ ఇచ్చారు. ఈ అక్రమాల్లో ప్రధాన బాధ్యుడిగా ఉన్న ఐఎ్‌ఫఎస్ అధికారిపై చర్యలు తీసుకోవడంలో కాలయాపన చేస్తున్నారు.
Updated Date - Aug 26 , 2024 | 08:33 AM