Amaravati : భార్యాభర్తల మధ్య విభేదాలు చిన్నారుల సంరక్షణకు అవరోధం కారాదు
ABN, Publish Date - Jul 19 , 2024 | 05:59 AM
భార్యాభర్తల మధ్య విభేదాలు, గొడవలు చిన్నారుల సంరక్షణకు అవరోధంగా మారడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. చిన్నారులకు తల్లి, తండ్రి ఇద్దరి ప్రేమ.., ఆప్యాయత, సంరక్షణ అవసరమని పేర్కొంది.
తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత పొందడం
చిన్నారుల కనీస మనవహక్కు.. స్పష్టం చేసిన హైకోర్టు
అమరావతి, జూలై18 (ఆంధ్రజ్యోతి): భార్యాభర్తల మధ్య విభేదాలు, గొడవలు చిన్నారుల సంరక్షణకు అవరోధంగా మారడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. చిన్నారులకు తల్లి, తండ్రి ఇద్దరి ప్రేమ.., ఆప్యాయత, సంరక్షణ అవసరమని పేర్కొంది. అది చిన్నారుల కనీస మానవహక్కు అని తేల్చిచెప్పింది. తన ఏడేళ్ల కుమారుడికి తనను సహజ సంరక్షకుడిగా ప్రకటించాలని కోరుతూ కడపజిల్లాకు చెందిన ఓ వ్యక్తి 2020లో అనంతపురం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ సానుకూల ఉత్తర్వులు రాకపోవడంతో 2023లో హైకోర్టును ఆశ్రయించారు. బిడ్డను కలుసుకొనేందుకు అవకాశం ఇవ్వాలని అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. తన భార్య మరో వివాహం చేసుకొని సౌదీలో నివాసం ఉంటోందని, ప్రస్తుతం తన బిడ్డ ఇండియాలో ఆమె తండ్రి వద్ద ఉంటున్నాడని వివరించారు. మహిళ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... పిటిషనర్ మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్నారు.
ఈ నేపఽథ్యంలోనే వారు విడిపోయారన్నారు. చిన్నారిని తన సంరక్షణకు ఇవ్వాలని కోరే హక్కు పిటిషనర్‌కు లేదన్నారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... భార్య, భర్తల మధ్య ఈగోతో మొదలవుతున్న చిన్న చిన్న వివాదాలు పెద్దగొడవలుగా మారి కోర్టు వరకు చేరుతున్నాయని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేసింది.
పిల్లలను తమకే అప్పగించాలని వేస్తున్న వ్యాజ్యాలతో చిన్నారులు బాధితులుగా మారుతున్నారని సర్వోన్నత న్యాయస్థానం గుర్తు చేసిందని పేర్కొంది. తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, సంరక్షణ పొందే కనీస మానవహక్కు చిన్నారులకు ఉందని తేల్చిచెప్పింది.
ఈ నేపథ్యంలో కదిరిలో తాత వద్ద ఉంటున్న బిడ్డను కలుసుకొనేందుకు తండ్రికి వెసులుబాటు ఇస్తున్నట్టు పేర్కొంది. చిన్నారి నివాసం ఉంటున్న దగ్గరకు వెళ్లి వారానికి ఒకసారి రెండుగంటలపాటు కలుసుకొనేందుకు వెసులుబాటు కల్పించింది. ప్రతిరోజు పిల్లవాడితో కొద్ది నిమిషాలు ఫోనులో మాట్లాడేందుకు అనుమతించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ న్యాపతి విజయ్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
Updated Date - Jul 19 , 2024 | 06:00 AM