ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati: అమరావతి.. ఆకర్ష!

ABN, Publish Date - Dec 26 , 2024 | 03:51 AM

అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులతో పాటు ఆర్థికాభివృద్ధి సాధన దిశగా తీసుకోవాల్సిన చర్యలపైనా కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.

ప్రైవేటు పెట్టుబడుల కోసం పీజీఎంసీ ఏర్పాటు

కన్సల్టెంట్‌ కోసం టెండర్లు పిలిచిన సీఆర్‌డీఏ

సేవా రంగాన్ని భారీగా పెంచే దిశగా ప్రణాళికలు

విద్య, వైద్యం, పర్యాటక రంగాలకూ ప్రాధాన్యం

విదేశాల్లోనూ ప్రమోషన్‌ కార్యక్రమాల నిర్వహణ

(విజయవాడ-ఆంధ్రజ్యోతి)

అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులతో పాటు ఆర్థికాభివృద్ధి సాధన దిశగా తీసుకోవాల్సిన చర్యలపైనా కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. రాజధానిలో ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణ దిశగా ప్రోగ్రామ్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ (పీజీఎంసీ) కోసం సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. ఈ సంస్థ నేతృత్వంలో రాజధానిలో ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణకు, తద్వారా ఉపాధి అవకాశాలను పరోక్షంగా పెంచడానికి కసరత్తు చేయనుంది. ప్రైవేటు పెట్టుబడిదారులు, సీఆర్‌డీఏ మధ్య పీజీఎంసీ ఒక వారధిలా పనిచేయనుంది. రాష్ర్టాభివృద్ధికి స్థూల విలువ జోడింపు(జీవీఏ)లో ప్రస్తుతం విశాఖపట్నం అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలు ఉన్నాయి. అమరావతి రాజధాని నగరాన్ని కూడా ప్రధానమైన ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఆర్‌డీఏ లక్ష్యంగా పెట్టుకుంది. పొరుగున ఉన్న తెలంగాణకు అత్యధిక ఆదాయ వనరుగా రాజధాని హైదరాబాద్‌ ఉంది. ఏపీలో కూడా రాజధాని నగరం అమరావతి ఆ స్థాయిలో ఆర్ధికాభివృద్ధిని సాధించే దిశగా భవిష్యత్తు ప్రణాళికలకు ఇప్పటినుంచే బీజం వేయాలని భావిస్తోంది. దీనిలో భాగంగా ప్రైవేటు పెట్టుబడుల సమీకరణ పూర్తి బాధ్యతలను ఎంపిక చేసిన కన్సల్టెన్సీకి సీఆర్‌డీఏ అప్పగించనుంది. అమరావతి రాజధాని, అమరావతి రాజధాని ప్రాంత పరిధి(అవుటర్‌)లో రెండు వేర్వేరు కేటగిరీల్లో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి సారించింది. రాజధానిలో సేవల రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. ఐటీ రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు నెలకొల్పడం ద్వారా విద్యా రంగానికీ సమ ప్రాధాన్యం ఇవ్వనుంది. అలాగే పర్యాటకం, వైద్య రంగాలకు కేంద్రంగా రాజధాని ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని యోచిస్తోంది.


పీజీఎంసీ బాధ్యతలు ఇవీ...

అమరావతి భౌగోళిక పరిస్థితులు, అందుబాటులో ఉన్న వనరుల రీత్యా ఏ సేవా రంగాన్ని అభివృద్ధి చేయాలో నిర్ణయించి, దానికి అనుగుణంగా ప్రణాళికల తయారీ.

మార్కెట్లో ఉన్న సంస్థలను భాగస్వామ్యం చేస్తూ రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సహించాలి.

అమరావతిని పర్యాటకంగా తీర్చిదిద్దడానికి ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడానికి ప్రణాళికలు.

విద్య, వైద్య రంగాలకు సంబంధించి రాజధానిలో ఉన్న అవకాశాలను, ప్రయోజనాలను ఆయా రంగాల్లో దిగ్గజాల దృష్టికి తీసుకువెళ్లి ఒప్పించాలి. ప్రభుత్వపరంగా సహాయ, సహకారాలను సీఆర్‌డీఏ దృష్టికి తీసుకురావాలి.

రాజధాని పనుల నేపథ్యంలో బిజినెస్‌ టూర్లు, ఎక్స్‌పోలు నిర్వహిస్తూ ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించాలి.

ప్రముఖ దేశాల రాజధానుల్లో ఆర్థికాభివృద్ధి కోసం పాటిస్తున్న విధానాలను అమరావతిలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చి, అమలు చేయడం.

అమరావతిలో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించటానికి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ ప్రమోషన్‌ కార్యకలాపాలు నిర్వహించాలి.

విదేశీ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో సమావేశాలు నిర్వహించడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలి.


రాజధాని పనులకు మరో పీజీఎంసీ

అమరావతి రాజధానిలో సంక్రాంతి నుంచి ప్రారంభం కానున్న పనులను పరుగులు పెట్టించేందుకు, పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించడానికి మరో పీజీఎంసీ కోసం సీఆర్‌డీఏ తాజాగా టెండర్లు పిలిచింది. వివిధ పనుల కోసం నియమించిన ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కమిటీ (పీఎంసీ)లను సమన్వయం చేసుకుంటూ నిర్ణీత గడువులోగా నిర్మాణాలు పూర్తయ్యేలా ఈ సంస్థ బాధ్యత వహించాలి. రాజధానిలో పనులు చకచకా పూర్తయ్యేందుకు ఎప్పటికప్పుడు ఆయా కాంట్రాక్టు సంస్థలకు ప్రణాళికలు అందించడం, కాంట్రాక్టర్లతో భేటీ అయి సమస్యలను గుర్తించడం వంటివి నిర్వహించనుంది. అమరావతిలో చేపట్టే పనులకు సంబంధించి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిర్దేశించే లక్ష్యాలను కూడా నిర్ణీత సమయంలో ముందుకు తీసుకువెళ్లే బాధ్యత కూడా ఈ పీజీఎంసీదే.

Updated Date - Dec 26 , 2024 | 03:51 AM