Amaravati : పాపం పండుతోంది
ABN, Publish Date - Sep 06 , 2024 | 04:33 AM
అధికారం ఉందని నాడు విర్రవీగిన వైసీపీ నేతల పాపం పండుతోంది. జగన్ నియంత పాలనలో విధ్వంసాలకు పాల్పడిన వారికి సంకెళ్లు పడుతున్నాయి.
నిన్న దాడులు, దందాలు.. నేడు అర దండాలు
నాడు చెలరేగిన వైసీపీ నేతలకు సంకెళ్లు
అమరావతిలో నందిగం సురేశ్ అరాచక పర్వం
నదిలో ఇసుక దందా..రాజధాని రైతులకు వేధింపులు
గ్యాంగులతో దాడులు..ఐదేళ్లూ భీతావహ పరిస్థితులు
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఎట్టకేలకు సురేశ్ అరెస్టు
అప్పిరెడ్డి, తలశిల, అవినాశ్ కోసమూ వేట!
(అమరావతి- ఆంధ్రజ్యోతి)
అధికారం ఉందని నాడు విర్రవీగిన వైసీపీ నేతల పాపం పండుతోంది. జగన్ నియంత పాలనలో విధ్వంసాలకు పాల్పడిన వారికి సంకెళ్లు పడుతున్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు పారిపోయే అవకాశం ఇవ్వకుండా పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తలశిల రఘురాం, దేవినేని అవినాశ్ కోసం వేట కొనసాగుతోంది. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
ఐదేళ్లూ అరాచకమే...
అవినీతి, అరాచకం, విధ్వంసకర పాలనతో నియంతను తలపించింది గడిచిన ఐదేళ్ల జగన్ పాలన. ప్రజల తరపున బాధ్యతగల ప్రతిపక్షంగా టీడీపీ.. నాడు ప్రభుత్వ తప్పులపై ప్రశ్నించడంతో వైసీపీ తన నైజాన్ని చూపించింది. మమ్మల్నే ప్రశ్నిస్తారా..? అంటూ టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడికి దిగింది. గుంటూరు నుంచి లేళ్ల అప్పిరెడ్డి, అమరావతి నుంచి నందిగం సురేశ్, విజయవాడ నుంచి దేవినేని అవినాశ్ అల్లరి మూకల్ని వెంటబెట్టుకెళ్లి ఇనుప రాడ్లు, కర్రలు, ఇతర మారణాయుధాలతో బీభత్సం సృష్టించారు. దొరికిన వారిని దొరికినట్లు చితక బాదుతూ పార్టీ నేతల కోసం వెతుకులాడారు.
ఇంతటి దారుణంపై అప్పట్లో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసేందుకు చుక్కలు చూపించారు. ఆ తర్వాత కేసు గురించి నాటి డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందంటూ సెలవిచ్చారు. ఇదే అవకాశంగా నాడుప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపైకి అప్పటి వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్, ఒకరోజు ముందుగా ప్రకటించి మరీ 60 కార్లతో దాడికి వెళ్లారు. నానా బీభత్సం సృష్టిస్తున్న జోగి అనుచరులను నిలువరించడం పోలీసులకు సాధ్యపడలేదు.
విషయం తెలిసిన వెంటనే టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని అడ్డునిలబడ్డారు. టీడీపీ నాయకులు ఫిర్యాదు చేస్తే తూతూ మంత్రంగా బెయిలబుల్ సెక్షన్లతో కేసు నమోదు చేసిన పోలీసులు, తెలుగు తమ్ముళ్లపై మాత్రం హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు పెట్టి జైలుకు పంపారు. ఆ తర్వాత జోగి రమేశ్‌కు జగన్ ఏకంగా మంత్రి పదవి ఇచ్చి తాను దేన్ని ప్రోత్సహిస్తున్నదీ... కేడర్‌కు, నేతలకు స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఇదే అవకాశంగా వైసీపీ గూండాలు విరుచుకుపడ్డారు.
రాజధానిలో రౌడీ రాజ్
ఒక సాధారణవ్యక్తిగా మొదలై వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టడం వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మాత్రమే సాధ్యం. ప్రకృతి వనరులు యథేచ్ఛగా దోపిడీ చేయడం.. పైరవీలతో పలువురికి టోపీ పెట్టడం.. వంటి వ్యవహారాలతో అందలం ఎక్కేశారు. తాడేపల్లి ప్యాలె్‌సకు ఒక ఆయుధంగా ఉపయోగపడ్డారు. దళిత కార్డు అడ్డు పెట్టుకుని రాజధాని రైతులపై దాడులతో వెలుగులోకి వచ్చిన ఆయన జగన్ మనసు గెలిచి ఎంపీ టికెట్ సాధించారు. ‘నదిలో ఇసుక ఇష్టారాజ్యంగా తోలుకో.. మేం చెప్పిన వారిపై దాడులు చేస్తూ ఉండు’ అంటూ తాడేపల్లి ప్యాలెస్ ఇచ్చిన ఆదేశాల మేరకు పని చేశాడు. అక్కడి పెద్దల ఆదేశాలతోనే టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని చెబుతున్నారు. ఇక.. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు వస్తున్న వార్తలను పోలీసులు ధ్రువీకరించలేదు.
‘సకల శాఖల మంత్రి’కి ఉచ్చు బిగుస్తోందా?
వైసీపీ ప్రభుత్వంలో ‘సకల శాఖల మంత్రి’గా పేరుగాంచిన పులివెందుల రెడ్డిగారికి ఉచ్చు బిగుస్తోందా? దళిత, బీసీ, మహిళా మంత్రులపై పెత్తనాన్ని చెలాయించిన సలహాదారు పాపం పండబోతోందా? అంటే.. అవుననే అంటున్నాయి పరిస్థితులు. టీడీపీ కార్యాలయంపై దాడికి దళిత ఎంపీ.. చంద్రబాబు ఇంటిపై దాడికి బీసీ ఎమ్మెల్యేని రెచ్చగొట్టి పంపిన సూత్రధారి ఆయనేనని తెలుస్తోంది. నందిగం సురేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించే క్రమంలో, ఎందుకు దాడి చేశావని అడగ్గా... ‘‘నాకేంటి అవసరం? తాడేపల్లిలో పెద్దాయన(సకల శాఖల రెడ్డి) చెబితేనే చేశా.. రమ్మని పిలిపించారు. ‘జగన్‌ను విమర్శిస్తుంటే ఎలా ఊరికే ఉంటారు మీరు’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.. అప్పటికే గుంటూరు, విజయవాడ నుంచి ‘మేం బయలుదేరాం.. మీరు సిద్ధంగా ఉన్నారా.?’ అంటూ ఫోన్లు వస్తున్నాయి.. అందరం కలవగానే కుర్రాళ్లు చొరబడ్డారు’ అంటూ టీడీపీ ఆఫీసుపై వైసీపీ మూకలు చేసిన దాడి గురించి సురేశ్ వివరించినట్లు తెలిసింది. ‘చేయించిన ఆయనేమో హాయిగా ఉన్నారు.. ఆనందం పొందిన మా నాయకుడు లండన్‌కు వెళ్లిపోతున్నారు.. ఇంకో ఐదేళ్లపాటు మేం ఇక్కడ జైలు, ఇబ్బందులు ఎదుర్కోవాలి.. ఏంటో ఖర్మ’ అంటూ ఆయన నిర్వేదం వ్యక్తపరిచినట్లు తెలిపింది.
Updated Date - Sep 06 , 2024 | 04:36 AM