Share News

రంగంలోకి సిట్‌!

ABN , Publish Date - Sep 29 , 2024 | 05:21 AM

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీపై దర్యాప్తు మొదలైంది. కల్తీ నెయ్యి లోగుట్టు లాగేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) రంగంలోకి దిగింది. 2019కి ముందు ఏం జరిగింది? ఆ తర్వాత ఏం మారింది? ఇప్పుడు పరిస్థితి ఏమిటి? నెయ్యి కొనుగోలు సూత్రధారులు, పాత్రధారులు, విధి విధానాలపై సమగ్రంగా కూపీ

రంగంలోకి సిట్‌!

నాటి ఈవోలు, చైర్మన్లకూ నోటీసులు?

కల్తీ నెయ్యిపై దర్యాప్తు ప్రారంభం

అన్ని కోణాల్లో సమగ్రంగా విచారణ

మూడు బృందాలుగా ‘సిట్‌’ అధికారులు

తిరుమల, తిరుపతిలో రెండు టీమ్‌లు

ఏఆర్‌ డెయిరీపై మరో బృందం విచారణ

తిరుపతి/అమరావతి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీపై దర్యాప్తు మొదలైంది. కల్తీ నెయ్యి లోగుట్టు లాగేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) రంగంలోకి దిగింది. 2019కి ముందు ఏం జరిగింది? ఆ తర్వాత ఏం మారింది? ఇప్పుడు పరిస్థితి ఏమిటి? నెయ్యి కొనుగోలు సూత్రధారులు, పాత్రధారులు, విధి విధానాలపై సమగ్రంగా కూపీ లాగాలని సిట్‌ నిర్ణయించుకుంది. అంతేకాదు... ఈ వివరాలన్నీ తెలుసుకునేందుకు అప్పట్లో టీటీడీ ఈవోలు, బోర్డు చైర్మన్లుగా వ్యవహరించిన వారికీ నోటీసులు ఇచ్చి, పిలిపించి ప్రశ్నించాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి నేతృత్వంలో విశాఖ రేంజి డీఐజీ గోపీనాథ్‌ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు, తిరుపతి అడ్మిన్‌ ఏఎస్పీ వెంకటరావు, డీఎస్పీలు సీతారామారావు, శివనారాయణ స్వామి, అన్నమయ్య జిల్లా ఎస్‌బీ సీఐ సత్యనారాయణ, విజయవాడ సీఐ ఉమా మహేశ్వర్‌, చిత్తూరు జిల్లా కల్లూరు సీఐ సూర్యనారాయణ సభ్యులుగా ‘సిట్‌’ ఏర్పడిన సంగతి తెలిసిందే. శనివారం మధ్యాహ్నం విజయవాడ నుంచి వందేభారత్‌ రైలులో సిట్‌ అధికారులు తిరుపతి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా తిరుమలకు వెళ్లి... శ్రీవారిని దర్శించుకున్నారు. ఆపై టీటీడీ కార్యనిర్వహణాధికారితోపాటు ఇతర అధికారులతో సమావేశమయ్యారు. నెయ్యి కొనుగోలుకు సంబంధించిన ప్రాఽథమిక సమాచారం సేకరించారు.


మూడు బృందాలుగా ‘సిట్‌’

తిరుపతిలోని పోలీసు అతిథి గృహంలో సిట్‌ అధికారులు శనివారం రాత్రి పొద్దుపోయేదాకా సమావేశమయ్యారు. దర్యాప్తు విధి విధానాలపై చర్చించారు. ‘సిట్‌’ను మూడు బృందాలుగా విభజించి... వివిధ కోణాల్లో దర్యాప్తు చేయాలని నిర్ణయించుకున్నారు. తిరుమలలో నెయ్యి వినియోగం, 2019కి ముందు లడ్డూల నాణ్యత, 2019-24 మే నెల దాకా ఎలా ఉండింది? ఇప్పుడు పరిస్థితి ఏమిటి? తిరుమల లడ్డూ తయారీకి 2019కు మునుపు ఏయే పదార్థాలను ఎంతెంత పరిమాణంలో వాడేవారు? తర్వాత ఏమైనా మార్పులు జరిగాయా? నెయ్యి సేకరణ టెండర్ల నిబంధనల సడలింపు, ఏఆర్‌ డెయిరీకి ఆర్డర్‌ ఇవ్వడానికి వీలుగా నిబంధనలు సడలించారా... అన్న అంశాలపై ఒక బృందం కూపీ లాగనుంది. రెండో టీమ్‌... అచ్చంగా ఏఆర్‌ డెయిరీపైనే దృష్టి కేంద్రీకరించనుంది. ఆ డెయిరీ నేపథ్యం ఏమిటి? దాని సామర్థ్యం, నెయ్యి కల్తీ ఎక్కడ జరిగింది? దానికి బాధ్యులెవరు? తెరవెనుక సూత్రధారులెవరు? అన్న అంశాలను పరిశీలించనుంది. ఇక మూడో బృందం... తిరుపతిలో టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయం, గోదాములు, ల్యాబ్‌పై ఫోకస్‌ పెట్టనుంది. అందులో భాగంగా గత ఐదేళ్లలో నెయ్యి సరఫరా టెండర్లు ఎవరెవరికి ఇచ్చారు? ఎక్కడెక్కడి నుంచి కొనుగోలు చేశారు? సరఫరా చేసిన సంస్థల నేపఽథ్యం, వివరాలు, టెండర్లు నిర్వహించింది ఎవరు? గత ఐదేళ్లలో నెయ్యి నాణ్యతపై ల్యాబ్‌ నుంచీ వచ్చిన రిపోర్టులు, గత మూడు నెలల్లో వచ్చిన రిపోర్టులను పరిశీలిస్తారు.

ఫైళ్ల పరిశీలన...

నెయ్యి కొనుగోలు టెండర్లు, సరఫరాకు సంబంధించిన ఫైళ్లను సిట్‌ అధికారులు తెప్పించుకుని పరిశీలించారు. రెగ్యులర్‌ నెయ్యి కొనుగోలు టెండర్లలో పాల్గొన్న కంపెనీలు, ఆ తర్వాత రివర్స్‌ టెండర్‌ నిర్వహించిన విధానం, బిడ్‌లు వేసిన కంపెనీలు, టెండర్‌ దక్కించుకున్న కంపెనీలు సమర్పించిన డాక్యుమెంట్లను పరిశీలించారు. తిరుమలకు నెయ్యి లోడ్‌తో వచ్చిన లారీలు, వాటి రిజిస్ట్రేషన్‌ నెంబర్లు, ఇతర కీలక సమాచారం కూడా సేకరించినట్లు తెలిసింది. తమిళనాడులోని దుండిగల్‌లో ఉన్న ఏఆర్‌ ఫుడ్స్‌కు నెయ్యి కాంట్రాక్టు దక్కగా, నెల్లూరులోని శ్రీవైష్ణవి డెయిరీ నుంచి నెయ్యి ట్యాంకర్లు తిరుమలకు ఎందుకొచ్చాయని ఆరా తీస్తే అసలు విషయాలు వెలుగు చూస్తాయని అధికారవర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Sep 29 , 2024 | 05:21 AM