YCP: ఇంకా స్వామిభక్తి..!
ABN, Publish Date - Jun 21 , 2024 | 11:59 PM
రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. అధికారులు కూడా మారిపోతున్నారు. కానీ గృహనిర్మాణ శాఖలో మాత్రం కొందరు అధికారులు ఇంకా వైసీపీ సేవలో తరిస్తున్నారు. జగనన్న ఇళ్ల లబ్ధిదారుల విషయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకా్‌షరెడ్డికి చెందిన రాక్రీట్ సంస్థ గుట్టుగా వ్యవహారం నడిపిస్తోంది. లబ్ధిదారులపై ఒత్తిడి చేసి ఉపాధి బిల్లులు వసూలు చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఆదేశాలను ఆ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికీ పాటిస్తున్నారు. ఏమాత్రం ఆలోచన చేయకుండా బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఉద్యోగులను గ్రూపులుగా విభజించి మరీ వసూళ్లకు ఉసిగొల్పుతున్నారని సమాచారం. ...
రాక్రీట్ సేవలో గృహ నిర్మాణశాఖ
బలవంతంగా ఉపాధి బిల్లుల వసూలు
ఇళ్ల నిర్మాణం పూర్తికాకపోయినా బరితెగింపు
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే సేవలో అధికారులు
అనంతపురం సిటీ, జూన 21: రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. అధికారులు కూడా మారిపోతున్నారు. కానీ గృహనిర్మాణ శాఖలో మాత్రం కొందరు అధికారులు ఇంకా వైసీపీ సేవలో తరిస్తున్నారు. జగనన్న ఇళ్ల లబ్ధిదారుల విషయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకా్‌షరెడ్డికి చెందిన రాక్రీట్ సంస్థ గుట్టుగా వ్యవహారం నడిపిస్తోంది. లబ్ధిదారులపై ఒత్తిడి చేసి ఉపాధి బిల్లులు వసూలు చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఆదేశాలను ఆ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికీ పాటిస్తున్నారు. ఏమాత్రం ఆలోచన చేయకుండా బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఉద్యోగులను గ్రూపులుగా విభజించి మరీ వసూళ్లకు ఉసిగొల్పుతున్నారని సమాచారం.
ఇప్పటికీ అటువైపే..
జగనన్న ఇళ్ల నిర్మాణాల విషయంలో వైసీపీ హయాంలో ఎమ్మెల్యే ప్రకా్‌షరెడ్డి ఏదీ చెబితే దానికి గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు తల ఊపారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వారు మారలేదు. రాక్రీట్ సంస్థకు 90 రోజుల పని దినాలకు రావాల్సిన బిల్లులు కోసం తెర వెనుక కథ నడిపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే రచించిన పథకాన్ని ఆ శాఖ ఉన్నతాధికారులు అమలు చేస్తున్నారు. ఆ శాఖ ఉన్నతాధికారితోపాటు ఓ డీఈఈ స్వామిభక్తిని చాటుకుంటున్నారు. ఇద్దరు అధికారులు నగరంతో పాటు శివారు మండలాలకు చెందిన తమ శాఖ సిబ్బందిని గ్రూపులుగా విభజించి, లబ్ధిదారులపై ఒత్తిడి తెస్తున్నారు. బిల్లులకు సంబంధించిన డబ్బులను వసూలు చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. అంతే సంగతులు అన్నట్లు పరిస్థితి తయారయందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కొందరు ఉద్యోగులు ప్రశ్నించడంతో ఉన్నతాధికారులు ఆగ్రహించారని సమాచారం. ఈ వ్యవహారంలో ఓ డీఈఈ ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారని ఆ శాఖ వర్గాల్లో చర్చసాగుతోంది. వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే అండదండలతో విధి నిర్వాహణలో ఆయన రెచ్చిపోయి వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో తన స్థాయి అధికారులపై కూడా కస్సుబుస్సులాడారని తెలుస్తోంది.
లబ్ధిదారుల మండిపాటు
రాక్రీట్ సంస్థ అనంతపురం రూరల్ మండలంలోని కొడిమి, ఆలమూరు, బుక్కరాయసముద్రం మండల పరిధిలోని సిద్దరాంపురంలో 7,671 ఇళ్లను నిర్మిస్తోంది. వీటిలో కేవలం 350 ఇళ్లు పూర్తి చేసింది. మిగిలిన 7,321 ఇళ్లు వివిధ దశలలో ఉన్నాయి. వీటిలో 90 శాతం పునాదులకు పరిమితమయ్యాయి. ఇక్కడే అసలు కథ మొదలైంది. ప్రతి ఇంటికి ఉపాధి కింద (90 రోజుల పని దినాల కింద ) రూ. 30 వేలు అందిస్తున్నారు. అదీ కూడా లబ్ధిదారుడి అకౌంట్‌కు వేసి ఆ తర్వాత రాక్రీట్ సంస్థకు ఇవ్వాల్సి ఉంది. ఇంటి నిర్మాణం పూర్తయితేనే ఈ బిల్లులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ నిర్మాణాలు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికి ప్రతి ఇంటికి రూ.30 వేలు చొప్పున వసూలు చేసేలా రాక్రీట్ సంస్థ పథకం వేసింది. ఇందుకు ఆ శాఖ అధికారులు తల ఊపడం విస్మయం కలిగిస్తోంది. ఇంటి నిర్మాణం పూర్తి కాకపోయినా ఆ శాఖ ఉద్యోగులు లబ్ధిదారుల వద్దకు వెళ్లి అకౌంటులో పడిన రూ.30 వేలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. కొందరు లబ్ధిదారులు చెల్లించగా మరికొందరు వ్యతిరేకించారు. కొందరు వాగ్వాదానికి దిగగా, మరికొందరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని ఉద్యోగులపై మండిపడ్డారు. ఇప్పటికీ ఈ తతంగం సాగుతోందని సమాచారం. ఈ బిల్లులు జిల్లాలో లక్షల్లో.. రాష్ట్ర వ్యాప్తంగా రూ. కోట్లల్లో ఉన్నట్లు ఆ శాఖ వర్గాల ద్వారా తెలిసింది.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jun 21 , 2024 | 11:59 PM