Guntakal Municipality : చైర్ పర్సన వాకౌట్
ABN, Publish Date - Aug 29 , 2024 | 12:19 AM
మున్సిపాలిటీపై పట్టు సడలుతోందని భావించి.. కౌన్సిల్ సమావేశం నుంచి చైర్‌పర్సన, కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. గుంతకల్లు మున్సిపాలిటీ స్టాండింగ్ కౌన్సిల్ పదవి అంశాన్ని సాధారణ సమావేశం అజెండాలో చేర్చారు. చైర్‌పర్సన ఎన.భవాని అధ్యక్షతన బుధవారం కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. అజెండా చదువుతుండగానే అన్ని సబ్జెక్టులను ఆమోదిస్తున్నామని, 13వ అంశంగా ఉన్న స్టాండింగ్ కౌన్సిల్ నియామకపు ...
మున్సిపల్ సమావేశంలో విడ్డూరం
స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలో వైసీపీ తొండాట
కమిషనర్ వద్ద నిరసన తెలిపిన టీడీపీ
గుంతకల్లు, ఆగస్టు 28: మున్సిపాలిటీపై పట్టు సడలుతోందని భావించి.. కౌన్సిల్ సమావేశం నుంచి చైర్‌పర్సన, కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. గుంతకల్లు మున్సిపాలిటీ స్టాండింగ్ కౌన్సిల్ పదవి అంశాన్ని సాధారణ సమావేశం అజెండాలో చేర్చారు. చైర్‌పర్సన ఎన.భవాని అధ్యక్షతన బుధవారం కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. అజెండా చదువుతుండగానే అన్ని సబ్జెక్టులను ఆమోదిస్తున్నామని, 13వ అంశంగా ఉన్న స్టాండింగ్ కౌన్సిల్ నియామకపు విషయాన్ని చదవాలని వైసీపీ కౌన్సిలర్లు కోరారు. ఈ పదవికి మొత్తం ఏడుగురు న్యాయవాదులు దరఖాస్తు చేశారు. బీఎస్ కృష్ణారెడ్డి పేరును టీడీపీ కౌన్సిలరు కృపాకర్ ప్రతిపాదించారు. వైసీపీ తరఫున గోపాలకృష్ణ పేరును పోటీలో ఉంచినా, మెజారిటీ లేదన్న కారణంగా వైసీపీ కౌన్సిలర్లెవరూ ఆయన పేరును
ప్రతిపాదించలేదు. దీంతో కృష్ణారెడ్డి ఏకగ్రీవమయ్యారు. ఆయన నియామకాన్ని ప్రకటించడానికి చైర్‌పర్సన భవాని మైక్ తీసుకోగానే వైసీపీ కో-ఆప్షన సభ్యులు రాజశేఖర్, ఫ్లయింగ్ మహబూబ్ తమ తరఫు నుంచి గోపాల కృష్ణ పేరును ప్రతిపాదించారు. ఓటు హక్కులేని కో-ఆప్షన సభ్యులకు పేరును ప్రతిపాదించే అర్హత ఉండదని టీడీపీ కౌన్సిలరు పవన కుమార్ గౌడు అభ్యంతరం చెప్పారు. స్టాండింగ్ కౌన్సిల్ నియామకానికి ఓటింగ్ తప్పని పరిస్థితి ఏర్పడింది. అనారోగ్యం కారణంగా కౌన్సిల్ హాల్‌లోకి రాలేక, సంతకం చేసి బయట కూర్చున్న టీడీపీ కౌన్సిలరు నాగరత్నను సమావేశంలోకి తీసుకురావడానికి ఆ పార్టీ నాయకులు వెళ్లారు. అదే సమయంలో చైర్‌పర్సన భవాని కౌన్సిల్ హాల్ నుంచి వెళ్లిపోయారు. ఇదే అదనుగా వైసీపీ కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. సాధారణంగా అధికార పక్షం తీరుకు నిరసన ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేస్తారు. కానీ సభకు అధ్యక్షత వహించిన చైర్ పర్సన వాకౌట్ చేయడం ఏమిటని పలువురు విమర్శించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు గుమ్మనూరు నారాయణ స్వామి, పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్ మున్సిపల్ కార్యాలయం వద్దకు వచ్చి కమిషనర్‌ను కలసి నిరసన తెలిపారు. చైర్ పర్సన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చూస్తూ కూర్చోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెలాఖరులోగా అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తామని కమిషనర్ వెంకట రమణయ్య చెప్పడంతో టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు శాంతించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Aug 29 , 2024 | 12:19 AM