ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tungabhadra Dam : ఆశలు ఢాం!

ABN, Publish Date - Aug 11 , 2024 | 11:47 PM

ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నీటి ప్రాజెక్టుగా ఉన్న తుంగభద్ర జలాశయం (టీబీ డ్యామ్‌) ప్రమాదంలో పడింది. డ్యామ్‌కి అమర్చిన 19వ క్రస్ట్‌గేట్‌ చైన లింక్‌ తెగిపోయి, శనివారం రాత్రి కొట్టుకుపోయింది. దీంతో డ్యామ్‌లోని నీటిని నదికి వదిలేస్తున్నారు. సుమారు 65 టీఎంసీల మేర నీరు నదికి విడుదల చేయనున్నట్లు టీబీ బోర్డు కార్యదర్శి ఓఆర్‌కే రెడ్డి, ఎస్‌ఈ శ్రీకాంతరెడ్డి తెలిపారు. డ్యామ్‌లో నీటి నిల్వ 40 టీఎంసీలకు తగ్గితేనే కొత్త క్రస్ట్‌గేట్‌ అమర్చడానికి అవకాశం ఉంటుందని బోర్డు ఇంజనీర్లు తెలిపారు. డ్యామ్‌కి మొత్తం ...

Water released through crustgates

ఖాళీ అవుతున్న తుంగభద్ర డ్యామ్‌

65 టీఎంసీల నీరు నదికి వదలనున్న అధికారులు

నీటి నిల్వ 40 టీఎంసీలకు తగ్గితేనే క్రస్ట్‌గేట్‌ అమర్చేందుకు అవకాశం

మూడు, నాలుగురోజుల్లో బిగించనున్నట్లు సమాచారం

క్రస్ట్‌గేట్‌ తయారీ బాధ్యత ప్రముఖ కంపెనీలకు అప్పగింత

బళ్లారి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నీటి ప్రాజెక్టుగా ఉన్న తుంగభద్ర జలాశయం (టీబీ డ్యామ్‌) ప్రమాదంలో పడింది. డ్యామ్‌కి అమర్చిన 19వ క్రస్ట్‌గేట్‌ చైన లింక్‌ తెగిపోయి, శనివారం రాత్రి కొట్టుకుపోయింది. దీంతో డ్యామ్‌లోని నీటిని నదికి వదిలేస్తున్నారు. సుమారు 65 టీఎంసీల మేర నీరు నదికి విడుదల చేయనున్నట్లు టీబీ బోర్డు కార్యదర్శి ఓఆర్‌కే రెడ్డి, ఎస్‌ఈ శ్రీకాంతరెడ్డి తెలిపారు. డ్యామ్‌లో నీటి నిల్వ 40 టీఎంసీలకు తగ్గితేనే కొత్త క్రస్ట్‌గేట్‌ అమర్చడానికి అవకాశం ఉంటుందని బోర్డు ఇంజనీర్లు తెలిపారు. డ్యామ్‌కి మొత్తం 33 క్రస్ట్‌గేట్లు ఉన్నాయి. ఇందులో 19వ గేట్‌కు ఉండే చైనలింక్‌ తెగిపోయింది. దీంతో గేట్‌ జారి కిందకు పడిపోయింది. గేటు డ్యామ్‌లోకి పడిపోయిందా, నదిలోకి కొట్టుకొచ్చిందా అనేది నీటిప్రవాహం తగ్గితేనే తెలుస్తుందని బోర్డు వర్గాలు


పేర్కొంటున్నాయి.

క్రస్ట్‌ గేట్‌ ఎత్తే ప్రయత్నంలో..

గేట్‌ తెగే సమయంలో డ్యామ్‌లో 104.182 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇనఫ్లో 36,739 క్యూసెక్కులు వస్తుండగా.. 54,960 క్యూసెక్కులు నదికి వదులుతున్నారు. డ్యామ్‌ 33 గేట్లను అడుగు మేర ఎత్తి నదికి నీరు వదులుతున్న సమయంలో శనివారం రాత్రి 19వ క్రస్ట్‌గేట్‌ను మరో అడుగు ఎత్తేందుకు అధికారులు ప్రయత్నించారు. ఆ సమయంలో క్రస్ట్‌ గేట్‌కు ఉండే ఒక చైన లింక్‌ కట్‌ అయింది. నీటి ఉధృతికి మరో చైన లింక్‌ కూడా తెగిపోయింది. గేట్‌ కనిపించకుండా నీటిలో కొట్టుకుపోయింది. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. అన్నిగేట్లు ఎత్తి నీరు నదికి వదిలారు. మిగిలిన 32 గేట్లు 2 నుంచి 3 అడుగుల మేర ఎత్తి నదికి 1.10 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. డ్యామ్‌లోని నీటిలో 65 టీఎంసీలుపోనూ నిల్వ 40 టీఎంసీలకు తగ్గితేనే క్రస్ట్‌గేట్‌ అమర్చేందుకు వీలవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఇనఫ్లోతోపాటు డ్యామ్‌లోని నీరు అంతా నదికి వదులుతున్నారు. 65 టీఎంసీల నీరు కిందకు వెళ్లడానికి కనీసం మూడు రోజులు పడుతుందని బోర్డువర్గాలు తెలిపాయి. నదీతీర గ్రామాల వారిని అప్రమత్తం చేస్తున్నారు.

ప్రజాప్రతినిధుల పరిశీలన

కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఏపీలోని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆదివారం టీబీ డ్యామ్‌ను పరిశీలించారు. నీరు వృథాకాకుండా వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రైతులకు నీరు అందేలా చూడాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు.

ప్రముఖ కంపెనీలకుగేట్‌ తయారీ బాధ్యతలు

విజయనగరలోని తుంగభద్ర స్టీల్‌ తయారీ కంపెనీతోపాటు హిందుస్థాన స్టీల్‌ తయారీ కంపెనీ, నారాయణ స్టీల్‌ తయారీ కంపెనీకి క్రస్ట్‌గేట్‌ తయారీ బాధ్యతలు అప్పగించినట్లు బోర్డు కార్యదర్శి ఓఆర్‌కే రెడ్డి తెలిపారు. విజయవాడ, హైదరాబాద్‌లోని అనుభవజ్ఞుల సూచనలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కర్ణాటక, ఆంధ్ర ముఖ్యమంత్రుల ఆరాతుంగభద్ర డ్యామ్‌ క్రస్ట్‌గేట్‌ ఊడిపోవడంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామ య్య, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు.. అధికారులతో వివరాలు ఆరాతీశారు. వెంటనే మరమ్మతులు చేసి నీరు వృథా కాకుండా చూడాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. అధికారులకు సూచించారు.

టీబీ డ్యామ్‌ గేట్‌ పునరుద్ధరిస్తాం

మంత్రి పయ్యావుల కేశవ్‌

అనంతపురం, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): సాధ్యమైనంత త్వరలోనే తుంగభద్ర డ్యామ్‌ గేట్‌ను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. టీబీ డ్యామ్‌ గేట్‌ కొట్టుకుపోయిందన్న సమాచారం నేపథ్యంలో మంత్రి పయ్యావుల కేశవ్‌ ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి స్పందించారు. తుంగభద్ర డ్యామ్‌ గేట్‌ కొట్టుకుపోయిన విషయం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఓ వీడియో ద్వారా వివరించారు. కర్ణాటకలోని హోస్పేట్‌ వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్‌ గేట్‌ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన విషయం ఆదివారం తెల్లవారుజామున తెలిసిందన్నారు. వెంటనే రాష్ట్ర ఉన్నతాధికారులను అప్రమత్తం చేశామన్నారు. ఆ తర్వాత తుంగభద్ర డ్యామ్‌ అధికారులతో చర్చించామన్నారు. డ్యామ్‌ గేట్‌ కొట్టుకుపోవడానికి కారణాలపై ఆరా తీశామన్నారు. డ్యామ్‌ గేట్‌ కొట్టుకుపోవడం ద్వారా పెద్ద ఎత్తున నీరు వృథాగా నదిలోకి పోతోందన్నారు. ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాలకు తుంగభద్ర డ్యామ్‌ గుండెకాయ లాంటిందన్నారు. ఈ డ్యామ్‌ను నమ్ముకొని రెండు ఉమ్మడి జిల్లాల్లో లక్షలాది మంది రైతులు వివిధ పంటలను సాగు చేస్తున్నారని వెల్లడించారు. వీటిని దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత త్వరలోనే డ్యామ్‌ గేట్‌ను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారన్నారు.

కొత్త డ్యామ్‌లలో ప్రత్యేక డిజైన

తుంగభద్ర డ్యామ్‌ పురాతన డ్యామ్‌ కావడంతో అక్కడ స్టాప్‌ లాగ్‌ గేట్‌ అలైనమెంట్‌ డిజైన లేకపోవడం మనకు నష్టం కలిగించే అంశమన్నారు. గేట్లు కొట్టుకుపోయినప్పుడు ప్రత్యామ్నాయంగా ఇంకో గేట్‌ను దించుకొనే అవకాశం కొత్తగా చేపట్టే డ్యామ్‌ల్లో డిజైన చేస్తున్నారని తెలిపారు. అలాంటి అవకాశం తుంగభద్ర డ్యామ్‌లో లేకపోవడంతో నీరు వృథాగా పోతోందన్నారు. టీబీ డ్యామ్‌ గేట్‌ పునరుద్ధరణపై ఇరిగేషన ప్రాజెక్టుల్లో పరిపూర్ణమైన అవగాహన కలిగిన వ్యక్తులు, సుధీర్ఘమైన అనుభవం ఉన్న విశ్రాంత అధికారులు గన్నయ్యనాయుడు తదితరులను సంప్రదించామన్నారు. టీబీ డ్యామ్‌ వద్ద ప్రత్యామ్నాయంగా అత్యవసర గేట్‌ను తయారు చేసుకొని తాత్కాలికంగా నీటిని నిలిపేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. రబ్బర్‌ గేట్‌ను తీసుకువచ్చి వెంటనే అడ్డం పెట్టడం మూలంగా నీటిని నిలువరించే ప్రయత్నాలపైనా దృష్టి సారించామన్నారు. రాయలసీమ వాసిగా డ్యామ్‌ గేట్‌ కొట్టుకుపోయిందనే సమాచారం తనను ఆందోళనకు గురిచేసిందన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని డ్యామ్‌ గేట్‌ను ప్రభుత్వం పునరుద్ధరించే పనిలో ఉందని మంత్రి పయ్యావుల కేశవ్‌ స్పష్టం చేశారు.

సమగ్ర దర్యాప్తు చేపట్టాలి

ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

రాయదుర్గం, ఆగస్టు 11: తుంగభద్ర జలాశయం 19వ క్రస్ట్‌ గేట్‌ చైనలింక్‌ తెగిపోవడంపై లోతుగా సమగ్ర దర్యాప్తు చేయాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. ఆయన హోస్పేట్‌లోని తుంగభద్ర జలాశయాన్ని ఆదివారం సందర్శించారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో కలిసి క్రస్ట్‌గేట్‌ను పరిశీలించారు. దీనిపై బోర్డు ఎస్‌ఈ శ్రీకాంతరెడ్డితో పాటు అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీబీడ్యామ్‌కు జూలై నెలలోనే పూర్తిగా నీరు చేరడంతో రైతుల్లో ఆనందం కలిగిందన్నారు. ఈ ఏడాది తాగు, సాగునీటికి సమస్య ఉండదని అనుకుంటున్న క్రమంలో శనివారం అర్ధరాత్రి తుంగభద్ర డ్యాం 19వ క్రస్ట్‌గేట్‌ చైనలింక్‌ తెగి కొట్టుకుపోవడం బాధాకరమన్నారు. క్రస్ట్‌గేట్‌ చైనలింక్‌ తెగిపోవడం పట్ల మానవ తప్పిదమా లేక ప్రమాదమా అనే విషయంపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. చైనలింక్‌ తెగిపోవడంతో 60 టీఎంసీల నీటిని నష్టపోవాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని కారణంగా ఆయకట్టు రైతులకు భవిష్యతపై తీవ్రమైన ఆందోళన కలుగుతుందన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. సత్వరమే గేటును బిగించడానికి అవసరమైన చర్యలను బోర్డు అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేసేందుకు ఇప్పటికే నిపుణులను రంగంలోకి దించినట్లు స్పష్టం చేశారు.


జలాశయం భద్రతపై పటిష్ట

చర్యలు చేపట్టాలి: సీపీఎం

అనంతపురం కల్చరల్‌, ఆగస్టు 11: తుంగభద్ర డ్యామ్‌ భద్రతపై పటిష్ట చర్యలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్‌, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు ఆదివారం సంయుక్త ప్రకటనలో డిమాండ్‌ చేశారు. తుంగభద్ర డ్యామ్‌ 19వ గేటు కొట్టుకుపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. 96 ఏళ్ల డ్యామ్‌ చరిత్రలో మొట్టమొదటిసారి గేట్‌ కొట్టుకుపోయిందని పేర్కొన్నారు. డ్యామ్‌ భద్రతపై కర్ణాటక, ఆంధ్రప్రదేశ ప్రభుత్వాలు తక్షణమే స్పందించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో వర్షాల్లేక అత్యధిక సాగుభూములు బీడుగా మారుతుంటే డ్యామ్‌లో ఉన్న నీటిని సక్రమంగా ఉపయోగించుకునే పరిస్థితి లేకపోవడానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలన్నారు. వరద కాలువను నిర్మించి డ్యామ్‌ నుంచి వచ్చే అదనపు నీటిని కిందిభాగంలో ఉన్న అనంతపురం జిల్లా అభివృద్ధికి ఉపయోగించాలని కోరారు.

నిర్వహణలోపంతోనే..

సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున

అనంతపురం క్లాక్‌టవర్‌, ఆగస్టు 11: టీబీ డ్యాం బోర్డు అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణలోపంతోనే గేటు ఊడిపోయిందని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున ఓ ప్రకటనలో తెలిపారు. గేటు ఊడిపోవడానికి డ్యాం అధికారులే బాధ్యత వహించాలన్నారు. ఏపీ జలవనరుల శాఖ మంత్రి, ఉన్నతాధికారులు తుంగభద్ర డ్యాంను సందర్శించి, మిగిలిన గేట్ల పటిష్టత, సామర్థ్యాన్ని పరిశీలించాలన్నారు. ఇటీవలి వరదలతో టీబీ డ్యాం పూర్తిస్థాయిలో నీటితో నిండిపోయిందని, 33గేట్లు ఎత్తివేసి నీటిని కిందికి వదిలారన్నారు. 19వ గేటు ఊడిపోవడం దురృష్టకరమన్నారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేసి కరవు జిల్లాకు నీటిని అధికంగా తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

కొట్టుకుపోయిన సంతోషం

బొమ్మనహాళ్‌, ఆగస్టు 11: తుంగభద్ర డ్యాం గేట్‌ కొట్టుకుపోవడంతో నీరంతా వృథా అవుతోంది. దీంతో ఎన్నో ఆశలతో సేద్యపు పనులు ప్రారంభించిన హెచ్చెల్సీ ఆయకట్టు రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈఏడాది త్వరగా డ్యాం నిండింది. సాగుకు ఇబ్బందులు ఉండవని భావిస్తున్న తమకు గేటు కొట్టుకుపోయి నీరంతా పోతుండటం ఆశనిపాతమైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్యాంలో ఉన్న నీరంతా బయటకు వెళితే గాని మరమ్మతులు సాధ్యం కాదని ఇంజనీర్లు చెబుతున్న నేపథ్యంలో మరమ్మతులు పూర్తై మళ్లీ డ్యాం నిండేది ఎప్పుడు? తమ బతుకులు బాగుపడేదెప్పుడని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


త్వరగా మరమ్మతులు చేయాలి

తుంగభద్ర డ్యాం గేట్‌ కొట్టుకుపోవడంతో ఆందోళన కలుగుతోంది. గత ఏడాది వరిపంట నష్టం కలిగింది. అంతే కాకుండా రబీసీజనలో పెట్టిన పత్తి పంట దెబ్బ కొట్టింది. ఈ సారి తుంగభద్ర జలాశయం నుంచి కాలువలకు సాగునీరు ముందుగా రావడంతో వ్యవసాయ పనులు ప్రారంభించా. ఇంతలోనే డ్యాం గేటు కొట్టుకుపోయి నీరు వృథాగా బయటకు పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. అధికారులు త్వరగా మరమ్మతులు చేయించి రైతులను ఆదుకోవాలి.

- ఆంజనేయులు, రైతు, గౌనూరు

దేవుడే కరుణించాలి

తుంగభద్ర జలాశయం నుంచి వచ్చే నీటిపై ఆధారపడి 35 ఎకరాలు వరిపంట సాగు చేస్తున్నా. తుంగభద్ర డ్యాం గేట్‌ కొట్టుకుపోయింది. ఈ విషయం ఆందోళన కలిగిస్తోంది. డ్యాంలో ఉన్న నీరు బయటకు పోతే గాని పనులు చేయలేమని అధికారులు చెప్పడంతో ఇక దేవుడే మమ్మల్ని రక్షించాలి. నా సొంత భూమి 13 ఎకరాల భూమితో పాటు 22 ఎకరాలు కౌలుకు చేసుకుంటున్నా.

- ఈశ్వర, శ్రీధరఘట్ట


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 11 , 2024 | 11:47 PM

Advertising
Advertising
<