TDP: కూటమిలో విభేదాల్లేవ్
ABN, Publish Date - Sep 30 , 2024 | 12:20 AM
ధర్మవరం కూటమిలో ఎలాంటి విభేదాలులేవని, మూడు పార్టీల లక్ష్యం నియోజకవర్గ అభివృద్ది అని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి, బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు స్పష్టం చేశారు.
పరిశీలిస్తామని సత్యకుమార్ చెప్పారు: పరిటాల శ్రీరామ్
ధర్మవరం, సెప్టెంబరు 29: ధర్మవరం కూటమిలో ఎలాంటి విభేదాలులేవని, మూడు పార్టీల లక్ష్యం నియోజకవర్గ అభివృద్ది అని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి, బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని, కమిషనర్ నియామకంపై తమకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు. గతంలో ఆయన కమిషనర్‌గా పనిచేసిన సమయంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించి టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టారని, ఇదే అంశాన్ని మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. ఈ విషయాలు ఏవీ తనకు తెలియవని సత్యకుమార్‌కు చెప్పినట్టు వివరించారు. అన్ని అంశాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు చెప్పారన్నారు. ఎన్నికల ముందు తాము ఎలా కలిసి ఉన్నామో ఇప్పుడు అలాగే కలిసి ఉన్నామని స్పష్టం చేశారు. ధర్మవరాన్ని అభివృద్ది చేయడమే తమ ముందున్న లక్ష్యం అన్నారు. మొదట ఆరునెలలు చిన్నచిన్న సంఘటనలు ఉంటాయని, అధికారులు, నాయకులంతా సమన్వయం చేసుకోవడానికి సమయం పడుతుందన్నారు. గతంలో జరిగిన భూకబ్జాలు, అక్రమాలు గురించి సత్యకుమార్‌కు చెప్పామని, వాటిన్నింటిపై చర్యలు ఉంటాయన్నారు. చిలకం మధుసూదనరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ నియామకం ఉద్దేశ్యపూర్వకంగా జరిగిందికాదని, దీనిని అడ్డుపెట్టుకుని తమ మధ్య విభేదాలు ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారన్నారు. కమిషనర్ గతంలో తమ వాళ్లను ఇబ్బంది పెట్టారని, కార్యకర్తలు, నాయకులకు ఆయన రావడం ఇష్టం లేదన్నారు. సందిరెడ్డి శ్రీనివాసులు మాట్లాడుతూ కూటమి పార్టీల మధ్య విభేదాలు, అపోహలు వస్తే చూసి సంతోషించే వారు చాలా మంది ఉన్నారని అన్నారు. తాము వారికి అలాంటి అవకాశం ఇవ్వబోమన్నారు. కచ్చితంగా పునరాలోచించి కమిషనర్ అంశంపై తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్య, నాయకులు పరిశే సుధాకర్, పురుషోత్తంగౌడ్, మహేశచౌదరి, ఫణికుమార్, సంధారాఘవ, ప్రసాద్‌నాయుడు, నాగూర్‌హుస్సేన, మాధవరెడ్డి, ఆది, పురుషోత్తం పాల్గొన్నారు.
Updated Date - Sep 30 , 2024 | 12:20 AM