ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

E-Panta Problems : అన్నీ కష్టాలే

ABN, Publish Date - Aug 13 , 2024 | 12:50 AM

జిల్లాలో ఈ పంట నమోదుకు సర్వర్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. ఈనెల 3 నుంచి ఖరీఫ్‌లో సాగైన పంటల నమోదు ప్రక్రియ మొదలైంది. తొలి రోజు సర్వర్‌ పని చేసినా ఆ మరుసటి రోజు నుంచి సక్రమంగా పనిచేయడం లేదు. ఈ పంట నమోదు ఆధారంగానే రైతులకు పంట నష్టపరిహారం, పంటల బీమా, ఇతర రకాల పథకాలు వర్తింపజేస్తున్నారు.

Staff of Rythu Seva Kendra doing e-crop registration

ఈ-పంట నమోదులో ఇబ్బందులు

సక్రమంగా పనిచేయని సర్వర్‌

అప్‌లోడ్‌ కాని పంట వివరాలు, ఫొటో

రీ సర్వే గ్రామాల్లో పంట నమోదుకు ఇక్కట్లు

తలలు పట్టుకుంటున్న రైతు సేవా కేంద్రం సిబ్బంది

జిల్లాలో ఈ పంట నమోదుకు సర్వర్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. ఈనెల 3 నుంచి ఖరీఫ్‌లో సాగైన పంటల నమోదు ప్రక్రియ మొదలైంది. తొలి రోజు సర్వర్‌ పని చేసినా ఆ మరుసటి రోజు నుంచి సక్రమంగా పనిచేయడం లేదు. ఈ పంట నమోదు ఆధారంగానే రైతులకు పంట నష్టపరిహారం, పంటల బీమా, ఇతర రకాల పథకాలు వర్తింపజేస్తున్నారు. ఇంతటి ముఖ్యమైన ఈ పంట నమోదు ప్రక్రియ సర్వర్‌ సమస్య, పలు సాంకేతిక సమస్యలతో ముందుకు సాగడం లేదు. రైతులు పలు మార్లు తమ పంట పొలంలో ఫొటో దిగేందుకు వెళ్లినా సర్వర్‌ పని చేయక పోవడంతో నిరాశతో వెనుతిరగాల్సివస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తోచని అయోమయంలో రైతు సేవా కేంద్రం సిబ్బంది తలలు పట్టుకుంటు న్నారు. - అనంతపురం అర్బన


సక్రమంగా పనిచేయని సర్వర్‌

ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రకం ఈ పంట నమోదు యాప్‌ను ప్రవేశపెట్టారు. గతంతో పోలిస్తే యాప్‌లో పంట వివరాల నమోదు సులభంగా చేసేలా రూపొందించారు. కొత్త యాప్‌లో యూఐ (యూజర్‌ ఇంటర్‌ ఫేస్‌) బాగుందని సిబ్బంది చెబుతున్నారు. అయితే సర్వర్‌ సమస్యతో ఈ పంట నమోదు ఆశించిన స్థాయిలో జరగడం లేదన్న విమర్శలున్నాయి. ఈ నెలారంభంలో తొలుత 2.4 వర్షన యాప్‌ను ఇచ్చారు. పైలెట్‌ ప్రాజెక్టుతోపాటు క్షేత్ర స్థాయిలో ఈ పంట నమోదుకు వెళ్లిన సమయంలో కొత్త యాప్‌లో పలు రకాల సాంకేతిక సమస్యలు రావడంతో 2.5 వర్షనకు యాప్‌ను అప్‌డేట్‌ చేశారు. వర్షన అప్‌డేట్‌ చేసినా సర్వర్‌ సమస్య పరిష్కారం కాలేదు. గత వారం రోజులుగా ప్రతి రోజూ గంటల తరబడి సర్వర్‌ మొరాయిస్తుండటంతో రైతు సేవా కేంద్రం సిబ్బంది సతమతమవుతున్నారు. పలుమార్లు రైతులను పొలాల వద్దకు తీసుకువెళ్లి పంట వివరాలు, ఫొటోలు అప్‌లోడ్‌ చేసినా ప్రయోజనం దక్కడం లేదు.

అప్‌లోడ్‌ కాని పంట వివరాలు

రైతు సేవా కేంద్రం సిబ్బంది ఫీల్డ్‌కు వెళ్లే ముందు సర్వే నెంబర్‌ ఆధారంగా జియో కోఆర్డినేట్‌ను డౌనలోడ్‌ చేసుకోవాలి. ముందస్తు షెడ్యూల్‌ను తయారు చేసుకొని ఏఏ తేదీల్లో గ్రామాల్లోని ఏఏ సర్వే నెంబర్లల్లో ఈ పంట నమోదు చేస్తున్నామన్న వివరాలు రైతులకు దండోరా వేసి తెలపాల్సి ఉంది. షెడ్యూ ల్‌ మేరకే క్షేత్ర స్థాయి కి వెళ్లి ఈ పంట నమోదు చేయాలి. ఇందులో భాగంగా రైతు సేవా కేంద్రం సిబ్బంది ఒక గ్రామంలోని కొన్ని సర్వే నెంబర్లను జియో కోఆర్డినేట్‌ ద్వారా డౌనలోడ్‌ చేసుకొని ఈ పంట నమోదుకు వెళుతున్నారు. ఆయా రైతులను వారి పంట పొలాల వద్దకు తీసుకొని వెళ్లి పొలంలో నిలబెట్టి ఫొటో తీస్తున్నారు. ఆ తర్వాత ఈ పంట యాప్‌లో పంట వివరాలు, రైతు ఫొటోను అప్‌లోడ్‌ చేయగా ఫొటో ఎగ్జంషన అని చూపిస్తూ వివరాలు సర్వర్‌కు అప్‌లోడ్‌ కావడం లేదు. దీంతో రైతు సేవా కేంద్రం సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆయా రైతులను తిరిగి పొలాల వద్దకు తీసుకువెళ్లి పలు మార్లు ఫొటో తీసి అప్‌లోడ్‌ చేసినా ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. యాప్‌లో సర్వే నెంబర్ల వారిగా సాగు చేసిన పంట వివరాలు, ఫొటో అప్‌లోడ్‌ అయితేనే ఈ పంట నమోదు పూర్తవుతుంది. అయితే బుక్‌ చేసిన వివరాలు అప్‌లోడ్‌ కాకపోవడంతో ఏం చేయాలో తోచని సందిగ్ధంలో సిబ్బంది కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సమస్యను రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటి దాకా పరిష్కరించలేదన్న విమర్శలున్నాయి.

రీ సర్వే గ్రామాల్లో అయోమయం

జిల్లా వ్యాప్తంగా 198 గ్రామాల్లో భూముల రీ సర్వే జరిగింది. ఆయా గ్రామాల్లో సర్వే నెంబర్లకు బదులుగా సర్వే ల్యాండ్‌ పార్సల్‌(ఎల్‌పీ) నెంబర్లను నమోదు చేశారు. రీ సర్వే సమయంలో పలు రకాల అభ్యంతరాలు తెలిపిన భూములకు వివాదాల్లో ఉన్నట్లుగా చూపుతూ జేఎల్‌పీ నెంబర్లను నమోదు చేసినట్లు సమాచారం. ఆ వివరాలన్నీ స్థానిక వీఆర్వో లాగినలో ఉన్నట్లు తెలిసింది. రీ సర్వే గ్రామాల్లో ఈ పంట నమోదు చేసే సమయంలో స్థానిక వీఆర్వో, సర్వేయర్‌ సహకరించాల్సి ఉంది. అలాంటి ప్రాంతాల్లో వీఆర్వోలు సరిగా స్పందించకపోవడంతో ఈ పంట నమోదు చేయడం ఇబ్బందిగా మారినట్లు సమాచారం.

6వేల హెక్టార్లల్లో ఈ-పంట నమోదు

జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 3.46 లక్షల హెక్టార్లు. ఇందులో వేరుశనగ 1.97 లక్షల హెక్టార్లుగా అంచనా వేశారు. ఇప్పటి దాకా 1.43 లక్షల హెక్టార్లల్లోనే వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో వేరుశనగ 53వేల హెక్టార్లు, కంది 40వేలు, పత్తి 21వేలు, ఆముదం 12వేలు, మొక్కజొన్న 7580, సజ్జ 2149, కొర్ర 2645 హెక్టార్లల్లో సాగయ్యాయి. మిగతా విస్తీర్ణంలో జొన్న, పొద్దుతిరుగుడు, సోయాబీన, పెసలు, మినుములు, తదితర రకాల పంటలు సాగయ్యాయి. యాప్‌లో సర్వర్‌ సమస్యతో ఈ పంట నమోదు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లడం లేదు. ఇప్పటి దాకా కేవలం 6వేల హెక్టార్లల్లో ఈ పంట నమోదు పూర్తయ్యింది. సెప్టెంబరు 15లోగా ఈ పంట నమోదు పూర్తి చేయాలని రాష్ట్ర ఉన్నతాధికారులు ఆదేశించారు. సర్వర్‌ సమస్యతోపాటు యాప్‌లో పంట వివరాలు, ఫొటో అప్‌లోడ్‌ సమస్యను పరిష్కరించకపోతే గడువులోగా ఈ పంట నమోదు పూర్తి కావడం కష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 13 , 2024 | 07:29 AM

Advertising
Advertising
<