JC PRABHAKAR REDDY : పక్షం రోజులు టైం ఇస్తున్నా..!
ABN, Publish Date - Jul 25 , 2024 | 12:08 AM
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారులను జిల్లా నుంచి బహిష్కరించాలని తాడిపత్రి మున్సిపల్ చైర్మన, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. తాడిపత్రి నుంచి భారీ కాన్వాయ్‌తో బుధవారం ఆయన అనంతపురానికి వచ్చారు. వందలాదిమంది అనుచరులతో కలిసి నల్లకండువాలు ధరించి.. వనటౌన పోలీసు స్టేషనకు వెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు జేసీ ప్రభాకర్‌రెడ్డిని స్టేషనలోనికి ...
సజ్జల, పేర్ని నానిపై చర్యలు తీసుకోవాలి
పెద్దారెడ్డిని జిల్లా నుంచి బహిష్కరించాలి
మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి
అనుచరగణంతో డీఎస్పీ, ఎస్పీకి ఫిర్యాదు
అనంతపురం అర్బన/తాడిపత్రి, జూలై 24: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారులను జిల్లా నుంచి బహిష్కరించాలని తాడిపత్రి మున్సిపల్ చైర్మన, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. తాడిపత్రి నుంచి భారీ కాన్వాయ్‌తో బుధవారం ఆయన అనంతపురానికి వచ్చారు. వందలాదిమంది అనుచరులతో కలిసి నల్లకండువాలు ధరించి.. వనటౌన పోలీసు స్టేషనకు వెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు జేసీ ప్రభాకర్‌రెడ్డిని స్టేషనలోనికి తీసుకువెళ్లి డీఎస్పీ ప్రతా్‌పతో మాట్లాడించారు. వైసీపీ హయాంలో తనపై బనాయించిన అక్రమ కేసుల గురించి డీఎస్పీకి ఆయన వివరించారు. తనపై
అక్రమ కేసులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి తన అనుచరులతో కలిసి ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. పలు రకాల ఫైల్స్‌ను ఎస్పీ మురళీకృష్ణకు అందజేశారు. తనపై అక్రమ కేసులు బనాయించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పెద్దారెడ్డి అక్రమాలపై విచారణ జరిపి.. చట్టపరంగా చర్యలు తీసుకోవాలన కోరారు. అక్కడి నుంచి లక్ష్మీనగర్‌లోని తన నివాసానికి చేరుకుని.. మీడియాతో మాట్లాడారు.
రాజకీయ కక్షతోనే..
వైసీపీ హయాంలో తమపై ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు బనాయించారని ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. స్ర్కాప్ వాహనాలు కొనుగోలు చేశానని సాకు చూపుతూ అప్పటి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల, అప్పటి రవాణా మంత్రి పేర్నినాని, ఐపీఎస్ అధికారి సీతారామాంజినేయులు ఆదేశాలతో అప్పటి అనంత డీటీసీ శివరాంప్రసాద్ తనపైన, తన కుటుంబ సభ్యులపైన అక్రమ కేసులు బనాయించారని అన్నారు. తనపై అక్రమ కేసులు బనాయించిన వారిపై పక్షం రోజుల్లో కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని, లేదంటే ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తానని హెచ్చరించారు.
పెద్దారెడ్డిపై ఫైర్..
కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్ని వ్యాపారాలు చేస్తారని, కొడవళ్లపల్లి అమ్మ వారి సొమ్మును పెద్దారెడ్డి దిగమింగితే అప్పట్లో కేసు నమోదైందని అన్నారు. ఈ డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. కర్ణాటక నుంచి అక్రమంగా డీజిల్‌ను తెప్పించి ఇక్కడ విక్రయించారని అన్నారు. కర్ణాటక మద్యాన్ని కూడా విక్రయించారని అన్నారు. మాజీ ఎమ్మెల్లో ఇంట్లోని మహిళలు అక్రమ మద్యం విక్రయించారని ఆరోపించారు. ఇసుకను అక్రమంగా అమ్ముకున్నారని అన్నారు. సజ్జలదిన్నెలో 7.50 ఎకరాల ఇతరుల భూములను కొట్టేసేందుకు ప్రయత్నిస్తే తాను అడ్డుపడ్డానని అన్నారు. చిన్నపొలమడలో 78 ఎకరాల్లో వెంచర్ వేశారని అన్నారు. ఆర్టీసీ డ్రైవర్‌ను బెదిరించి.. వారి పొలాన్ని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. క్రైస్తవుల స్థలాన్ని కొట్టేసి చెన్నైకి వెళ్లి దొంగ సంతకాలు పెట్టించి, ఆయన భార్యపేరిట రాయించారని, ఆ తర్వాత ఆయన భార్య చెల్లెలి పేరిట మార్చారని ఆరోపించారు. ఆ స్థలంలో కట్టిన కాంప్లెక్స్‌లో మోర్ సూపర్ మార్కెట్ ఉందన్నారు. మున్సిపాలిటీ ఉద్యోగులకు ఇచ్చిన స్థలాన్ని బెదిరించి, బంధువు పేరుతో రాయించుకున్నారని, ఆ తర్వాత ఆయన భార్య పేరిట మార్చుకున్నారని ఆరోపించారు. ఆ స్థలంలో ఇల్లు కట్టించారని అన్నారు. పెద్దారెడ్డి ఇసుక దోపిడీపై హైకోర్టును ఆశ్రయించానని తెలిపారు. కోమటికుంట్లలో 480 ఎకరాలు కోడలు, కుమారుడి పేరిట రాయించారని, సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ఆ పొలాలను బెదిరించి రాయించుకున్నారని ఆరోపించారు. తాడిపత్రిలో ఫ్యాక్టరీలు, లారీల వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు. పెద్దారెడ్డి ఏది చెబితే దాన్ని ప్రసారం చేస్తారా అని ఓ న్యూస్ చానల్, కొన్ని యూట్యూబ్ చానళ్లవారిని జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. తాను సాక్షాధారాలతోనే మాట్లాడుతున్నానని అన్నారు.
Updated Date - Jul 25 , 2024 | 12:08 AM