HARRASMENT: మహిళా సర్పంచకు అత్తింటి వేధింపులు
ABN, Publish Date - Dec 07 , 2024 | 12:25 AM
మహిళా సర్పంచకే అత్తింటి వేధింపులు తప్పలేదు. భర్త మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెను అత్తమామలు, వారి పిల్లలు వేధించసాగారు. ఇంట్లోకి రావద్దంటూ బయటకు పంపారు.
ఇంట్లోకి రానివ్వని అత్తమామలు
తాళం వేసి ఇబ్బందులు
ఇద్దరు బిడ్డలతో సర్పంచ నిరసన
లేపాక్షి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): మహిళా సర్పంచకే అత్తింటి వేధింపులు తప్పలేదు. భర్త మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెను అత్తమామలు, వారి పిల్లలు వేధించసాగారు. ఇంట్లోకి రావద్దంటూ బయటకు పంపారు. ఇంటికి తాళం వేయడంతో ఇద్దరు కుమార్తెలతో కలిసి మహిళా సర్పంచ నిరసనకు దిగారు. మండలంలోని శిరివరం గ్రామ పంచాయతీ మహిళా సర్పంచ నేత్రావతి దుస్థితి ఇది. ఆమె భర్త శ్రీనివాసులు గతేడాది మార్చిలో అనారోగ్యంతో మృతిచెందారు. అప్పటి నుంచి ఉమ్మడిగా ఉన్న కుటుంబంలో అత్తమామలు చెన్నమ్మ, జయన్నతోపాటు వారి కుమారుల నుంచి సర్పంచ నేత్రావతికి వేధింపులు మొదలయ్యాయి. వేరుగా ఉండాలని గొడవకు దిగుతున్నారని బాధితురాలు వాపోయారు. ఐదు నెలల క్రితం ఇదే గ్రామంలో ఇంటిని అద్దెకు తీసుకుని, బిడ్డలతో కలిసి వేరుగా ఉంటున్నారు. అద్దె ఇంట్లో సౌకర్యాలు సరిగా లేకపోవడంతో భర్త ఇంట్లోనే వంట వండుకుని, స్నానాలు చేసేవారు. ఇటీవల ఇంట్లోకి రాకూడదంటూ అత్తమామలు, వారి కుమారులు గొడవ చేశారు. ఇంటికి తాళం వేసుకున్నారు. దీంతో సర్పంచ ఈనెల 5వ తేదీన ఆ ఇంటి ముందు నిరసన చేపట్టారు. ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన వాటా తనకు ఇవ్వాలంటూ నేత్రావతి.. గ్రామంలో పెద్దమనుషుల వద్ద పంచాయితీ పెట్టినా న్యాయం చేకూరలేదు. దీంతో ఆమెను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ప్రైవేటు పాఠశాలలో చదివుతున్న కుమార్తెలు స్ఫూర్తి (8వ తరగతి), స్పంనద (6వ తరగతి)ని స్థోమతలేక స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంటున్నారు.
ఫిర్యాదు అందలేదు: నరేంద్ర, ఎస్‌ఐ, లేపాక్షి
శిరివరం గ్రామ సర్పంచ నేత్రావతికి వేధింపులపై ఫిర్యాదు అందలేదు. సోషల్ మీడియా ప్రచారం మేరకు గ్రామంలో విచారిస్తున్నాం. బాధితురాలికి న్యాయం చేస్తాం.
Updated Date - Dec 07 , 2024 | 12:25 AM