Share News

ROAD : ఎన్నాళ్లుంటుందో?

ABN , Publish Date - Jun 28 , 2024 | 12:18 AM

ఓ వైపు రోడ్డు పనులు జరుగుతూనే ఉన్నాయి. మరో వైపు వేసిన రోడ్డు పాడై పోతోంది. దీన్ని చూసిన ప్రజలు అబ్బా ఎంత నాణ్యతగా రోడ్డు వేస్తున్నారో.. అంటూ నిట్టూరుస్తున్నారు. ఇదీ కూడేరు నుంచి మరుట్ల రెండో కాలనీ వరకు జరుగుతున్న రహదారి పనుల దుస్థితి. పంచాయతీరాజ్‌కు చెందిన ఈ రోడ్డు నిర్మాణ పనుల (14.1కి.మీ)ను రూ.6.4కోట్ల నాబార్డ్‌ నిధులతో చేపట్టారు. ఎన్నికలు వస్తున్నాయన్న హడావుడిలో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి మార్చి 18న పనులను ప్రారంభించారు. కూడేరు నుంచి అంతరగంగ, ఇప్పేరు, నాగిరెడ్డిపల్లి, కల్లగళ్ల,

ROAD : ఎన్నాళ్లుంటుందో?
Asphalt taken for patching

ఓవైపు వేస్తుండగానే మరోవైపు పాడైపోతున్న రోడ్డు

పలు ప్రాంతాల్లో కుంగిపోతున్న వైనం

రోలింగ్‌ సక్రమంగా చేయకపోవడమే కారణం

పాడైపోయిన రోడ్డుకు ప్యాచలు వేస్తున్న కాంట్రాక్టర్‌

పర్యవేక్షణలేక నాసిరకంగా పనులు

అభాసుపాలవుతున్న రూ.ఆరు కోట్ల రహదారి

ఓ వైపు రోడ్డు పనులు జరుగుతూనే ఉన్నాయి. మరో వైపు వేసిన రోడ్డు పాడై పోతోంది. దీన్ని చూసిన ప్రజలు అబ్బా ఎంత నాణ్యతగా రోడ్డు వేస్తున్నారో.. అంటూ నిట్టూరుస్తున్నారు. ఇదీ కూడేరు నుంచి మరుట్ల రెండో కాలనీ వరకు జరుగుతున్న రహదారి పనుల దుస్థితి. పంచాయతీరాజ్‌కు చెందిన ఈ రోడ్డు నిర్మాణ పనుల (14.1కి.మీ)ను రూ.6.4కోట్ల నాబార్డ్‌ నిధులతో చేపట్టారు. ఎన్నికలు వస్తున్నాయన్న హడావుడిలో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి మార్చి 18న పనులను ప్రారంభించారు. కూడేరు నుంచి అంతరగంగ, ఇప్పేరు, నాగిరెడ్డిపల్లి, కల్లగళ్ల, మరుట్ల. 1, 2, 3 కాలనీలతో పాటు పెనకచెర్ల డ్యాంకు వెళ్లేందుకు వీలుగా రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. ఎన్నికల సమయం కావడంతో రోడ్డు పనులు చేస్తే ఓట్లు పడుతాయని భావించిన వైసీపీ నాయకులు కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తెచ్చి హడావుడిగా పనులు చేయించారు. - కూడేరు


కుంగిపోతున్న రోడ్డు

రోడ్డు పనులు హడావుడిగా చేయడంతో నాణ్యత పూర్తిగా కొరవడింది. దీంతో తారు వేసిన వారానికే గుంతలు పడి దెబ్బతింది. మరి కొన్ని చోట్ల రోడ్డు కుంగి పోయింది. కూడేరు నుంచి నాగిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో వరకు జరిగిన పనుల్లో చాలా ప్రదేశాల్లో గుంతలు పడి రోడ్డు అధ్వానంగా మారింది. ఆయా గ్రామాల్లో ఉద్యాన పంటలతోపాటు కురగాయల సాగు అధికంగా ఉంది. ఈ రోడ్డుపై 20 టన్నుల పైబడి బరువుతో చీనీ కాయల లారీలతోపాటు, నిత్యం వందలాది వాహనాలు తిరుగుతున్నాయి. అలాంటి రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా పనులు చేయడం వల్లనే దెబ్బతిందని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా కూడేరు దాటిన తర్వాత గంపన్న తోట వద్ద రోడ్డు వేసిన ప్రదేశం మధ్యలోనే కుంగిపోయింది. కూడేరు, అంతరగంగ గ్రామాల మధ్య జరిగిన తారు రోడ్డు నిర్మాణం దాదాపు ఐదారు ప్రదేశాల్లో దెబ్బతింది. దీంతో దెబ్బతిన ప్రదేశాల్లో ప్యాచులు వేశారు. దీన్ని చూసిన వాహనదారులు రోడ్డు ఎన్ని సంవత్సరాలు ఉంటుందోనని పెదవి విరుస్తున్నారు. రోడ్డు నిర్మాణం చేసే సమయంలో కంకరతోపాటు రోడ్డుకు ఇరువైపులా మట్టిని వేసి రోలింగ్‌ సక్రమంగా చేయకపోవడంతో వర్షాలకు మట్టి కొట్టుకుపోయింది. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే పనులు నాసిరకంగా జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.

నెలకే ప్యాచలు

కూడేరు నుంచి మరుట్ల వరకు జరుగుతున్న రోడ్డు పనులు అధ్వానంగా చేశారు. తారు రోడ్డు వేసిన నెలకే తారు లేసిపోవడంతో గుంతలు పడ్డాయి. రోడ్డుపై వేసిన బ్రిడ్జిలు కూడా కుంగిపోతున్నాయి. అధ్వానంగా పనులు జరుగుతు న్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

- సతీష్‌ గౌడ్‌ (అంతరగంగ)

ఇంత అధ్వానంగానా?

నూతనంగా నిర్మిస్తున్న రోడ్డును రోలింగ్‌ సక్రమంగా చేయకపో వడంతో ఇరువైపులా దెబ్బతింది. దీంతో గుంతలు పడటంతో ఎన్ని రోజులు రోడ్డు ఉంటుందో తెలియడం లేదు. రోడ్డు వేసే సమయంలో అధికారులు ఉంటే కాంట్రాక్టర్‌ పనుల నాణ్యతగా చేస్తారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే పనులు సక్రమంగా జరగలేదు.

- హనుమంతు (కలగళ్ల)


మరిన్ని ఆనంతపురం వార్తల కోసం...

Updated Date - Jun 28 , 2024 | 12:18 AM