KANAKADASA JAYANTHI: వివక్షకు వ్యతిరేకంగా కనకదాస పోరాటం
ABN, Publish Date - Nov 18 , 2024 | 11:42 PM
బీసీల అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవనకల్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేశ కంకణం కట్టుకున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో రాష్ట్రంలో స్వర్ణయుగం మొదలైందని అన్నారు.
కూటమి ప్రభుత్వంతో రాష్ట్రంలో స్వర్ణయుగం ఆరంభం
కురుబలకు సీఎం చంద్రబాబు అత్యంత ప్రాధాన్యం
బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత
ఘనంగా భక్త కనకదాస రాష్ట్రస్థాయి జయంత్యుత్సవాలు
అనంతపురం ప్రెస్‌క్లబ్, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): బీసీల అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవనకల్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేశ కంకణం కట్టుకున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో రాష్ట్రంలో స్వర్ణయుగం మొదలైందని అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో భక్త కనకదాస రాష్ట్రస్థాయి జయంత్యుత్సవాలను నగరంలో సోమవారం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కురుబలు ముందుగా ఆర్ అండ్ బీ అతిథి గృహం నుంచి గుత్తి రోడ్డులోని భక్త కనకదాస విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కనకసదా విగ్రహానికి మంత్రి, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగరంలోని ఓ ఫంక్షన హాల్‌లో రాష్ట్ర స్థాయి వేడుకలను మంత్రి ప్రారంభించారు. కనకదాస చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. బీసీలను గుర్తించి, వారు అన్ని రంగాల్లో ముందుండాలని కోరుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం అని అన్నారు. జిల్లాలో రెండు వివక్షకు వ్యతిరేకంగా.. ఎంపీ స్థానాలను బీసీలకు కేటాయించారని అన్నారు. తనకు మంత్రిగా అవకాశం కల్పించారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కనకదాస జయంత్యుత్సవాలు నిర్వహించాలని, ప్రతి జిల్లా కేంద్రంలో వేడుకలకు రూ.12.50 లక్షలు చొప్పున నిధులను ముఖ్యమంత్రి కేటాయించారని అన్నారు. భక్త కనకదాస ఊరూరా తిరుగుతూ తన కీర్తనల చేత ప్రజలను చైతన్యపరిచారని అన్నారు. సంఘటితగా ఉంటే ఏదైనా సాధించవచ్చునని చాటారని అన్నారు. కనకదాస కురుబ కులంలో జన్మించడం గర్వకారణమని అన్నారు. బీసీలు టీడీపీ పార్టీ బ్యాక్‌బోన అని సీఎం చెప్పారని, ప్రతి బీసీ వ్యాపారవేత్త కావాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని సూచించారు. కురుబలు షీప్ ఫామ్ పెట్టుకుని వ్యాపారాలు చేస్తున్నారని, వారికి రూ.50 లక్షల వరకూ రుణాలు ప్రతి యూనిట్‌కి ఇస్తామని తెలిపారు. యూనిట్‌కి రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకూ రుణం బీసీ సంక్షేమశాఖ తరుఫున ఇచ్చే అవకాశం ఉందని అన్నారు. అందులో 10 శాతం లబ్ధిదారుని వాటా, 40 శాతం సబ్సిడీ, 50 శాతం బ్యాంకు రుణం వస్తుందని అన్నారు. గతంలో ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు నిధులు లేకుండా ఉత్సవ విగ్రహాలుగా మారయని అన్నారు. ప్రస్తుతం కార్పొరేషన్లకు రూ.1000 కోట్ల వరకూ నిధులు ఇచ్చామని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక డీఎస్సీని విడుదల చేశామని, అభ్యర్థులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. టీటీడీలో బోర్డు మెంబర్‌గా కురుబలకు వచ్చే దశలో అవకాశం ఇస్తామని అన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
కనకదాస జయంత్యుత్సవాలలో విద్యార్థినుల నృత్య ప్రదర్శనలు, గొరవయ్యల సంప్రదాయ వేషధారణ, విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వేడుకలను విజయవంతం చేసిన కలెక్టర్‌కు మంత్రి శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి సత్కరించారు. కురుబ సంఘాల నాయకులు, టీడీపీ, బీసీ సంఘాల నాయకులను మంత్రి, ఎమ్మెల్యేలు ఘనంగా సత్కరించారు. వేడుకలలో బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పోలా భాస్కర్, కురబ కార్పొరేషన చైర్మన దేవేంద్రప్ప, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, డైరెక్టర్ మల్లికార్జున, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న, బీసీ సంక్షేమశాఖ డీడీ కుష్బూకొఠారీ, ఆర్డీఓ కేశవనాయుడు, డీటీడబ్ల్యూఓ రామాంజనేయులు, డీఆర్‌డీఏ పీడీ ఈశ్వరయ్య, అనంతపురం తహసీల్దారు హరికుమార్, జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ దక్షిణాది రాషా్ట్రల గౌరవ అధ్యక్షులు బాసినేని వెంగమేష్ చౌదరి, సీపీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్, టీడీపీ నాయకులు గంజే నాగరాజు, ఆవుల కృష్ణయ్య, కురబ నారాయణస్వామి, కురబ సంఘాల నాయకులు తుప్పటి ఈశ్వరయ్య, తగరకుంట కృష్ణమూర్తి, ఆంజనేయులు, గంగులకుంట రమణ, శీనయ్య, విఠల్‌గౌడ్, బాలాజీ, మల్లికార్జున, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం: అంబికా
సామాన్య కుటుంబంలో జన్మించి, కుల వివక్షకు వ్యతిరేకంగా భక్త కనకదాస పోరాడారని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. సమాజంలో అందరూ సమానమని, అందరూ మంచి మిత్రులుగా మెలగాలని సూచించారు. కురుబలకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిందని అన్నారు. ఇంతకు ముందు ఎవరూ అంతటి ప్రాధాన్యం కల్పించలేదని అన్నారు. కురుబ కనకదాస కళ్యాణ మండపం కోసం ఎంపీ నిధుల నుంచి రూ.20 లక్షలు కేటాయిస్తామని అన్నారు.
మాట నిలబెట్టుకున్న చంద్రబాబు: బీకే
భక్త కనకదాస జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ఎన్నికలకు ముందు చంద్రబాబుని అడిగామని, అందుకు అంగీకరించారని హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి అన్నారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ మేరకు అధికారికంగా కనకదాస జయంతిని నిర్వహిస్తున్నారని అన్నారు. కురుబలు 20 సంవత్సరాల నుంచి ఆర్థికంగా, రాజకీయంగా ఎదుగుతున్నారని అన్నారు. వారికి చదువు, సంస్కారం, పాలనలో భాగస్వామ్యం ఉందని అన్నారు. కనకదాసను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని సూచించారు.
ఫ కురుబలకు అండ: పరిటాల సునీత
పరిటాల కుటుంబం మొదటి నుంచి కురుబలకు అండగా ఉంటోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. కష్టకాలంలో కూడా కురుబలు తమ వెన్నంటే నడిచారని అన్నారు. ఒకప్పుడు పార్థసారథిని జడ్పీ చైర్మనని చేయడంతో పాటు ఎంతో మంది కురుబలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించిన వ్యక్తి పరిటాల రవి అని గుర్తు చేశారు. ఆ రోజుల్లో రామచంద్రారెడ్డి లాంటి వారిని ఎన్టీఆర్ మంత్రిని చేశారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కురుబలకు ప్రాధాన్యమిస్తూ, వారికి అండగా నిలిచారని అన్నారు. కురబలకు ప్రధానమైన వృత్తి గొర్రెల పెంపకమని, ఇటీవల గొర్రెలు వ్యాధుల బారిన పడి చనిపోతుండటంతో వారు నష్టపోతున్నారని అన్నారు. వారిలో అవగాహన పెంచి.. బీమా చేయించేలా చూడాలని కలెక్టర్‌ను కోరారు. రాప్తాడు నియోజకవర్గంలో కురుబలకు గొర్రెలు, మేకల యూనిట్లు, రుణాలు ఎక్కువగా ఇవ్వాలని కోరారు.
కురుబలకు ప్రాధాన్యం: దగ్గుపాటి
ముఖ్యమంత్రి చంద్రబాబు కురుబలకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించారని అనంతపురం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అన్నారు. పెనుకొండకు ప్రాతినిధ్యం వహించిన సవితమ్మకు మంత్రి పదవి ఇచ్చారని, హిందూపురం ఎంపీగా పార్థసారథికి అవకాశం కల్పించారని అన్నారు. భక్త కనకదాస సామాన్యులకు అర్థమయ్యేలా రచనలు చేశారని అన్నారు. కృష్ణ భక్తుడిగా తన జీవితాన్ని దైవానికి అంకితం చేశారని అన్నారు. సమాజంలో వివక్షకు వ్యతిరేకంగా పోరాడారని అన్నారు. కురబలకు ఆరాధ్యదైవంగా ఆయన నిలిచారని కొనియాడారు.
కురుబల పండుగ: అమిలినేని
కనకదాస రాష్ట్రస్థాయి జయంత్యుత్సవాలు కురుబలకు గొప్ప పండుగ అని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. జిల్లాలో కురుబలు చాలా మంది ఉన్నారని, వారికి చాలా సమస్యలు ఉన్నాయని అన్నారు. కేంద్రంలో కావాల్సినన్ని నిధులు ఉన్నాయని, ఉమ్మడి జిల్లాకు అవసరమైన నిధులను తీసుకురావాలని ఎంపీలను కోరారు. వచ్చే సంవత్సరం నిర్వహించే కనకదాస జయంతికి ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తామని అన్నారు. కళ్యాణదుర్గంలో కనకదాసు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. అన్ని రకాలుగా కురుబలకు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.
సంతోషకరం: కలెక్టర్
భక్త కనకదాస జయంతి రాష్ట్రస్థాయి ఉత్సవాలను జిల్లాలో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవనకల్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు. జిల్లా ఇనచార్జ్ మంత్రి టీజీ భరత, ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు.
Updated Date - Nov 18 , 2024 | 11:43 PM