HINDUPUR: పురం దుర్గంధభరితం..!
ABN, Publish Date - May 21 , 2024 | 11:41 PM
జిల్లాలో ఏ1 మున్సిపాలిటీగా పేరుపొందిన హిందూపురంలో శానిటేషన వ్యవస్థ అస్తవ్యస్తంగా వరిఇంది. డ్రైనేజీలు చెత్తాచెదారంతో నిండిపోయి మురుగు ముందుకు కదలడం లేదు. కదిలిస్తే కంపు కొట్టేంతగా మారాయి. పట్టణ నలుమూలలా డ్రైనేజీలు ప్లాస్టిక్ వ్యర్థపదార్థాలతో నిండిపోయాయి. దీంతో మురుగునీరు కదలక ఉండిపోయింది.
డ్రైనేజీ అస్తవ్యస్తం
హిందూపురం అర్బన, మే 21: జిల్లాలో ఏ1 మున్సిపాలిటీగా పేరుపొందిన హిందూపురంలో శానిటేషన వ్యవస్థ అస్తవ్యస్తంగా వరిఇంది. డ్రైనేజీలు చెత్తాచెదారంతో నిండిపోయి మురుగు ముందుకు కదలడం లేదు. కదిలిస్తే కంపు కొట్టేంతగా మారాయి. పట్టణ నలుమూలలా డ్రైనేజీలు ప్లాస్టిక్ వ్యర్థపదార్థాలతో నిండిపోయాయి. దీంతో మురుగునీరు కదలక ఉండిపోయింది. ఎప్పటికప్పుడు శుభ్రపరిచి వ్యర్థపదార్థాలను తొలగిస్తే తప్ప మురుగు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ప్లాస్టిక్ వినియోగం ఎక్కువ కావడం, వ్యర్థాలను కాలువల్లో పడివేయడం ద్వారా డ్రైనేజీ వ్యవస్థకు అంతరాయం కలుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వర్షం కురిస్తే నీరు డ్రైనలపై నుంచి ప్రవహించి చెత్తా చెదారం అంతా రోడ్లపైకి చేరుతోంది. వాహనదారులు, పాదచారులు, ఆ మురుగు నీటిలోనే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆక్రమణలతోనే సమస్య: పట్టణంలో ఎడాపెడా కట్టడాలు నిర్మిస్తున్నారు. కాలువలు, వంకలు, డ్రైనేజీలపై అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారు. దీంతో కాలువల్లో నీరు వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నియంత్రించాల్సిన మున్సిపల్ సిబ్బంది పట్టించుకోకపోవడంతోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నియంత్రించాలని వెళ్తే కొన్ని చోట్ల రాజకీయనాయకుల ఒత్తిడి, కౌన్సిలర్ల పెత్తనంతో వ్యవస్థ నిర్వీర్యమైంది. అధికారులు ప్రజలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలి కానీ పాలకులకు వత్తాసుపలకడంతో పురంలో ఐదు సంవత్సరాలుగా ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. గడ్డమీద ప్రాంతం, రహమతపురం, నేతాజీనగర్ తదితర ప్రాంతాల్లో డ్రైనేజీపైనే ఇళ్ల నిర్మాణం చేపట్టారు. సంబంధిత శాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోలేదు. సోమవారం హిందూపురంలో కురిసిన వర్షానికి ఎగువ ప్రాంతాలైన గడ్డమీద, సూరప్పకుంట, కంసలపేట, బోయపేట, సత్యనారాయణపేట తదితర ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీరు, హస్నాబాద్, ప్రధాన రహదారి రైల్వే రోడ్డులో నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తెల్లారే వరకు వర్షం నీరు రోడ్లపైనే ఉంది. అనంతరం నీరు కాలువల్లో మెల్లగా వెళ్లిపోయినా చెత్తాచెదారం మాత్రం రోడ్లపైనే ఉండిపోయింది. దీంతో ప్రజలు దుర్గంధంతో అల్లాడిపోతున్నారు. అలాగే శ్రీకంఠపురం, లక్ష్మీపురం, తదితర ప్రాంతాల్లో డ్రైన్లు లేక మురుగునీటి కుంటను తలపిస్తోంది. మున్సిపాలిటీకి పున్నులు చెల్లిస్తున్నా డ్రైన్లు నిర్మించడంలో అధికారులు విఫలమయ్యారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వర్షాకాలంలోనైనా డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దాలని ప్రజలు కోరుతున్నారు.
చాలా ఇబ్బందులు పడుతున్నాం
డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. కాలువల్లో మురుగునీరు ముం దుకు కదలదు. కంపు వదలదు. దీనికి తోడు డ్రైనేజీలు లేవు. వర్షం వస్తే మురుగునీరు నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో దోమలు ఉత్పత్తి పెరిగి వ్యాధులబారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది.
- రామాంజనేయులు, శ్రీకంఠపురం
అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటాం
పట్టణంలో పలు చోట్ల అక్రమ కట్టడాలు నిర్మించిన విషయం మా దృష్టికి వచ్చింది. వాటిపైన సర్వే చేస్తున్నాం. కొన్ని చోట్ల కాలువలు శుభ్రం చేయడనిఇకి వీలు లేకుండా కట్టడాలు నిర్మించారు. త్వరలో వాటిని తొలగిస్తాం. అలాగే గ్యాంగ్ వర్క్ చేపట్టాం. కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నాం. ప్రజలు ప్లాస్టిక్ వాడకం ఎక్కువ కావడం, వాటిని కాలువల్లో పడివేయడంతో కాలువలు నిండిపోతున్నాయి. అలాకాకుండా ఇంటి వద్దకు చెత్త సేకరణకు వచ్చే సిబ్బంది తెచ్చే డస్ట్‌బినలలో చెత్తను వేస్తే కాలువల్లో మురుగు ఉండదు. ఇందుకు ప్రజలు సహకరించాలి.
- శ్రీకాంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్
Updated Date - May 21 , 2024 | 11:41 PM