DEMOLITION: ప్రభుత్వ స్థలంలో ఆక్రమణ తొలగింపు
ABN, Publish Date - Oct 10 , 2024 | 11:54 PM
స్థానిక మండల కాంప్లెక్స్ సమీపాన ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న పునాదిని గురువారం తొలగించారు. తహసీల్దార్ మారుతి.. వీఆర్వో మన్సూర్, వీఆర్‌ఏ వినోద్ తదితర సిబ్బందితో కలిసి ఎక్స్‌కవేటర్‌తో నిర్మాణాన్ని తొలగించి, చదును చేయించారు.
గోరంట్ల, అక్టోబరు 10: స్థానిక మండల కాంప్లెక్స్ సమీపాన ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న పునాదిని గురువారం తొలగించారు. తహసీల్దార్ మారుతి.. వీఆర్వో మన్సూర్, వీఆర్‌ఏ వినోద్ తదితర సిబ్బందితో కలిసి ఎక్స్‌కవేటర్‌తో నిర్మాణాన్ని తొలగించి, చదును చేయించారు. సర్వే నంబరు 271లోని ప్రభుత్వ స్థలంలో 151 ప్లాట్లతో 2007లో లేఔట్ వేశారు. 2011లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ లేఔట్‌లోని ప్లాటు నంబరు 101కి సంబంధించి రెండు సెంట్ల ఇంటి స్థలం పట్టా సుశీలమ్మ పేరుమీద 2003లోనే అధికారులు ఇచ్చినట్లు లబ్ధిదారురాలు తెలిపారు. ఇది అక్రమమని తేల్చి, తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నోటీసు కూడా ఇవ్వకుండా పునాదులను ఎలా తొలగిస్తారని సుశీలమ్మ భర్త భాస్కర్.. తహసీల్దార్‌ను నిలదీశారు. హైకోర్టులో విచారణ కొనసాగుతుండగా పనులు ఎలా చేపడతామని తహసీల్దార్ మండిపడ్డారు. గత వైసీపీ పాలనలో వందకుపైగా అక్రమ నిర్మాణాలు ఒకేసారి చేపట్టడంతో అప్పటి తహసీల్దార్ రంగనాయకులు, సీఐ సుబ్బరాయుడు వాటిని తొలగించి, నిర్మాణ సామగ్రిని స్వాఽధీనం చేసుకున్నారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా కొంతమంది తమకు పట్టా ఉందంటూ కోర్టును ఆశ్రయించి, ఇష్టారాజ్యంగా భవనాలు నిర్మించుకుని, నివాసాముంటున్నారు. సెలవు రోజుల్లో రాత్రిపూట నిర్మిస్తుండడంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారు. ప్రస్తుతం వాటిని తొలగిస్తున్నారు. భూవివాదం కోర్టులో ఉండగానే నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు జారీ చేసి, బైండోవర్ చేస్తామని తహసీల్దార్ తెలిపారు.
Updated Date - Oct 10 , 2024 | 11:54 PM