STUDENT DIED ISSUE: పరీక్షల్లో చూశారనే గొడవ..!
ABN, Publish Date - Nov 16 , 2024 | 11:55 PM
ఈనెల 13న కళాశాలలో నిర్వహించిన పరీక్షల్లో వెనుక ఉన్న విద్యార్థి ప్రేమ్‌సాయి పేపరులోకి తొంగి చూసినట్లు తెలుస్తోంది. తన పేపరులో ఎందుకు చూస్తున్నావని ప్రేమ్ సాయి ప్రశ్నించగా మాటామాటా పెరిగింది.
పోలీసుల అదుపులో ఇద్దరు విద్యార్థులు
పుట్టపర్తి, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): ఈనెల 13న కళాశాలలో నిర్వహించిన పరీక్షల్లో వెనుక ఉన్న విద్యార్థి ప్రేమ్‌సాయి పేపరులోకి తొంగి చూసినట్లు తెలుస్తోంది. తన పేపరులో ఎందుకు చూస్తున్నావని ప్రేమ్ సాయి ప్రశ్నించగా మాటామాటా పెరిగింది. దీంతో అతడు కళాశాల లెక్చరర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై ఆగ్రహించిన ఇద్దరు తోటి విద్యార్థులు మాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ కళాశాల క్యాంపస్‌లోనే ప్రేమ్‌సాయిపై దాడి చేశారు. ఈక్రమంలో అతడి చెవిపై దెబ్బలు పడినట్లు తెలిసింది. అనంతరం హాస్టల్‌కు వెళ్లిన ప్రేమసాయి తనకు చెవి నొప్పి తీవ్రంగా ఉందని చెప్పి హిందూపురానికి వెళ్లాడు. చెవినొప్పితో శుక్రవారం హిందూపురంలో ఈఎనటీ వైద్యుడి వద్దకు వెళ్లారు. ఈ సందర్భంలో తనపై దాడి జరిగిన తీరు ఆ విద్యార్థి తన తల్లిదండ్రులకు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రేమ్‌సాయిపై దాడి చేసిన ఇద్దరు విద్యారులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. చెవిపై గట్టిగా కొట్టడంతోనే రెండు రోజుల తరువాత విద్యార్థి మృతి చెందినట్లు ప్రాథమిక నిర్ధారణకు పోలీసులు వచ్చినట్లు తెలుస్తోంది.
పోలీసుల విచారణ
ఇంజనీరింగ్ కళాశాలలో తోటి విద్యార్థుల దాడిలో గాయపడి మృతి చెందిన బీటెక్ విద్యార్థి ప్రేమ్‌సాయి కేసును పోలీసులు విచారణ చేపట్టారు. పుట్టపర్తి సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలకు అర్బన సీఐ సునీత తన సిబ్బందితో శనివారం వెళ్లి ఘటనపై ఆరా తీశారు. ప్రేమ్‌సాయిని ఇంజనీరింగ్ కళాశాలలో చదివే తోటి విద్యార్థులు కొట్టడంతో చెవికి తీవ్రగాయం కావడం, ఆపై యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తన కుమారుడు మృతి చెందినట్లు ప్రేమ్‌సాయి తండ్రి శ్రీనివాసులు హిందూపురం టూటౌన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో కళాశాలకు వెళ్లి విద్యార్థి మృతిపై ప్రాథమిక విచారణ చేపట్టినట్లు పుట్టపర్తి అర్బన సీఐ సునీత వెల్లడించారు.
విద్యార్థి మృతిపై నిజాలు నిగ్గు తేల్చాలి: సీపీఎం
బీటెక్ విద్యార్థి ప్రేమ్‌సాయి అనుమానాస్పద మృతిపై నిజాలు నిగ్గు తేల్చాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెంకటేసులు డిమాండ్ చేశారు. శనివారం పుట్టపర్తిలో ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లి విద్యార్థి మృతిపై యాజమాన్యంతోపాటు పోలీసులతో ఆరా తీశారు. ఇంతియాజ్ మాట్లాడుతూ విద్యార్ధి మృతికి కళాశాల యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
పంటి నొప్పి కారణంగా ఇంటికి వెళ్తున్నానని, అనుమతి ఇవ్వాలని హాస్టల్ వార్డెనకు ప్రేమ్‌సాయి దరఖాస్తు చేశాడు. 13న సాయంత్రం అతడి తల్లిదండ్రులకు తాము విషయం చెప్పిన తరువాతే అనుమతి ఇచ్చి ఇంటికి పంపించాం. విద్యార్థి మృతిపై పోలీసు విచారణ సాగుతోంది. తోటి విద్యార్థులు దాడి చేసినట్లు ప్రేమ్‌సాయి ఎక్కడా ఫిర్యాదు చేయలేదు. విద్యార్థుల మధ్య గొడవ, దాడి జరిగినట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. - కళాశాల యాజమాన్యం
Updated Date - Nov 16 , 2024 | 11:55 PM