STUDENTS HOSTEL: ఉండలేకున్నాం..!
ABN, Publish Date - Sep 04 , 2024 | 11:44 PM
బాలికల వసతి గృహంలో ఉండలేకున్నాం. వరండాల్లో ఫ్లోర్ బండలు కుంగిపోయాయి. నిత్యం అందులోంచి జెర్రిలు వస్తున్నాయి. బాతరూంకు తలుపులు లేవు. కొన్నివాటికి గొళ్లాలు లేవు. వసతి గృహానికి మూడువైపులా ప్రహరీ ఉన్నా, ఓ వైపు లేదు. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని బాలికలు ఆందోళనలు చెంతుతున్నారు.
గదుల్లో కుంగిన బండలు
ఆవరణలో ఏపుగా పెరిగిన ముళ్లకంపలు
భయాందోళనలో బాలికలు
రాప్తాడు, సెప్టెంబరు 4: బాలికల వసతి గృహంలో ఉండలేకున్నాం. వరండాల్లో ఫ్లోర్ బండలు కుంగిపోయాయి. నిత్యం అందులోంచి జెర్రిలు వస్తున్నాయి. బాతరూంకు తలుపులు లేవు. కొన్నివాటికి గొళ్లాలు లేవు. వసతి గృహానికి మూడువైపులా ప్రహరీ ఉన్నా, ఓ వైపు లేదు. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని బాలికలు ఆందోళనలు చెంతుతున్నారు. వసతి గృహంలోకకి విష సర్పాలు రావడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాం. వసతిగృహం ఆవరణలో ముళ్ల కంపలు ఏపుగా పెరిగాయి. ఇన్ని సమస్యలున్నా అధికారులు పట్టించుకోలేదని బాలికలు, వారి తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాప్తాడు సమీపంలోని పంగల్‌రోడ్డు వద్ద ఆదర్శ పాఠశాల పక్కనే ప్రభుత్వ బాలికల వసతి గృహం ఉంది. 9, 10వ తరగతి, ఇంటర్ మెదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం బాలికలు దాదాపు 100 మంది ఉంటున్నారు. రెండు ఫ్లోర్లలో గదులు ఉన్నాయి. కింద ఫ్లోర్లో బాలికలు ఉండే గదుల్లో బండలు కుంగిపోయి మట్టి కనబడుతోంది. వంట గదిలో కూడా బండలు కుంగిపోయాయి. వసతి గృహానికి ఒక వైపు ప్రహరీ లేదు. ఆవరణలో ముళ్ల కంపలు విపరీతంగా పెరిగిపోయాయి. ముళ్ల కంపల్లో విష సర్పాలు, జెర్రిలు రంధ్రాల్లో నుంచి కుంగిన బండల సందుల్లో గదుల్లోకి వస్తున్నాయని బాలికలు చెబుతున్నారు. రెండు, మూడు సార్లు విష సర్పాలు వసతి గృహంలోకి వచ్చాయని బాలికలు వాపోతున్నారు. ఒక గదిలో నిర్మించిన బాతరూం శిథిలావస్థకు చేరుకుంది.
ఏపుగా పెరిగిన ముళ్ల కంపలు
ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహానికి మూడు వైపులా ప్రహరీ ఉంది. ఒక వైపు లేదు. దీంతో బయట నుంచి పురుగులు, విషసర్పాలు లోపలికి వస్తున్నాయి. ప్రహరీ ఆవరణలో ముళ్ల కంపలు ఏపుగా పెరిగాయి. ము రుగు నీరు కూడా నిల్వ ఉండటంతో అపరిశుభ్రతకు నిలయంగా మా రిం ది. సకాలంలో ముళ్ల కంపలు తొలగించకపోవడంతోనే సమస్య అధికమైం ది. మరుగుదొడ్ల గదులకు కొన్నింటికి డోర్‌లు, గెడెలు సక్రమంగా లేవు.
బండలు కుంగిపోయాయి
వసతి గృహంలో బండలు కుంగిపోయి రంధ్రాలు ఏర్పడ్డాయి. గదుల బయట నుంచి ఎలుకలు, కొక్కులు తోడటంతో రంద్రాల్లో నుంచి జెర్రిలు వస్తున్నాయి.
- అరుణ ఇంటర్ ద్వితీయ సంవత్సరం
భయపడుతున్నాం
గదుల్లో బండలు కుంగిపోవడంతో రంధ్రాల్లో నుంచి ఏం వస్తాయో ఏమో అని అందరూ బయపడుతున్నారు. అధికారులు పరిశీలించి సమస్య పరిష్కరించాలి.
- కుసుమ ఇంటర్ ద్వితీయ సంవత్సరం
ఉన్నతాధికారులకు వివరిస్తాం: మల్లికార్జున ఎంఈఓ రాప్తాడు
బాలికల వసతి గృహంలోని సమస్యలను ఉన్నతాధికారులకు వివరించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం.
Updated Date - Sep 04 , 2024 | 11:44 PM