85 వేల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
ABN, Publish Date - Nov 20 , 2024 | 03:56 AM
రాష్ట్రానికి పెట్టుబడుల వరద ప్రారంభమైంది. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆయా సంస్థల ఏర్పాటుతో రాష్ట్రానికి రూ.85 వేల కోట్లకు పైగా పెట్టుబడులు తరలిరానున్నాయి.
రాష్ట్రంలో 10 భారీ పరిశ్రమల ఏర్పాటు.. 34 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశం.. ఉద్యోగాల సంఖ్యను బట్టి ప్రోత్సాహకాలు
నక్కపల్లిలో ఆర్సెలర్ మిట్టల్-నిప్పాన్ స్టీల్స్.. జాయింట్ వెంచర్‌లో రూ.61,780 కోట్ల పెట్టుబడి.. ఎల్‌జీ ఎలకా్ట్రనిక్స్, డల్లాస్ టెక్నాలజీలు కూడా
వీటికి ల్యాండ్ పూలింగ్ విధానంలో భూములు.. ఎస్‌ఐపీబీ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం.. భూములు ఇచ్చేందుకు 3 విధానాల ప్రతిపాదన
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం బంగారయ్యపేట వద్ద ఆర్సెలర్ మిట్టల్-నిప్పాన్ స్టీల్స్ జాయింట్ వెంచర్ ప్రాజెక్టు ఏర్పాటుకానుంది. ఈ సంస్థ అతిపెద్ద మొత్తంలో రూ.61,780 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్(క్యాప్టివ్ పోర్టుతో కలిపి) తొలిదశ నిర్మాణ పనులను 2029 నాటికి పూర్తి చేస్తారు. ఈ ప్రాజెక్టుతో 21 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
అమరావతి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి పెట్టుబడుల వరద ప్రారంభమైంది. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆయా సంస్థల ఏర్పాటుతో రాష్ట్రానికి రూ.85 వేల కోట్లకు పైగా పెట్టుబడులు తరలిరానున్నాయి. దీంతో పెట్టుబడులను ఆకర్షించి.. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం గత ఐదు నెలలుగా చేస్తున్న ప్రయత్నాలు కార్యరూపం దాల్చినట్టయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతన పారిశ్రామిక విధానాలను ప్రకటించిన తర్వాత అనేక దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టి.. పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇలా వచ్చిన పది సంస్థలకు ల్యాండ్ ఫూలింగ్ విధానంలో భూములు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సాయంత్రం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎ్‌సఐపీబీ) తొలి సమావేశం నిర్వహించారు. గడచిన ఐదు నెలల్లో వచ్చిన పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు, పలు ఒప్పందాలు, వాటి పురోగతిపై చర్చించారు. మొత్తం రూ.85,083 కోట్ల భారీ పెట్టుబడులతో, 33,966 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చిన 10 పారిశ్రామిక సంస్థల ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ సమావేశం ఆమోదం తెలిపింది.
అన్ని రకాల సహకారం: చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎస్‌ఐపీబీ తొలి సమావేశంలో ఆయన పెట్టుబడులు, ఒప్పందాలపై సమీక్షించారు. పెట్టుబడులకు దేశంలోని రాష్ట్రాల మధ్య తీవ్రమైన పోటీ ఉందని, ఆ పోటీని తట్టుకుని రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేలా పనిచేయాలని అధికారులకు సూచించారు. గత వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల ఐదేళ్లపాటు పెట్టుబడులు రాలేదన్నారు. అంతకుముందు ఒప్పందాలు చేసుకున్నవారు కూడా గత ప్రభుత్వ వైఖరితో వెనక్కి వెళ్లిపోయారని చెప్పారు. ప్రభుత్వ టెర్రరిజంతో పారిశ్రామికవేత్తలు పారిపోయారని సీఎం గుర్తు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారికి తగిన గౌరవం ఇవ్వాలని, వారికి అన్ని విధాలుగా సహకరించాలని అధికారులను ఆదేశించారు. ఒక పెట్టుబడిపై చర్చ మొదలైతే దాన్ని సాధించేవరకు వదిలి పెట్టకూడదన్నారు. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినె్‌స’ను సాకారం చేసేలా ఒప్పందాలను నిత్యం ట్రాక్ చేయాలని సీఎం సూచించారు. ఈ సందర్భంగా అధికారులు పలు అంశాలను ముఖ్యమంత్రికి వివరించారు. గత ప్రభుత్వం పరిశ్రమలకు ప్రోత్సాహకాలను చెల్లించలేదని చెప్పారు.
మిట్టల్ కోసం పూలింగే!
ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భూములను ల్యాండ్ పూలింగ్ విధానంలో తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా 61 వేల మందికి, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు.
ప్రజాభీష్టం మేరకే భూములు
భారీ పరిశ్రమలకు భూములు అవసరమైనచోట 3 రకాలుగా భూసేకరణ చేపట్టాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజల ఇష్టానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇవీ మూడు విధానాలు..
1) రాజధాని అమరావతిలో చేపట్టినట్లుగా భూ సమీకరణ(ల్యాండ్ పూలింగ్).
2) ఏ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చారో వారికి దానిలోనే ఉద్యోగాలు, ఉపాధి కల్పించే విధానం.
3) ఉన్నంతలో మంచి ప్యాకేజీ ఇచ్చి భూసేకరణ చేపడతారు.
Updated Date - Nov 20 , 2024 | 03:56 AM