‘మన్యం’లో కంటైనర్ ఆస్పత్రి
ABN, Publish Date - Nov 26 , 2024 | 03:27 AM
గిరిశిఖర గ్రామాల్లో గిరిజనులకు స్థానికంగా మెరుగైన వైద్య సేవలు అందించి.. డోలీ మోతలను తప్పించే లక్ష్యంతో కూటమి సర్కారు రాష్ట్రంలో తొలిసారిగా కంటైనర్ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొచ్చింది.
గిరిజనుల కోసం రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు
ప్రారంభించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి
గిరిశిఖర గ్రామాల్లోనూ స్థానికంగా వైద్య సేవలు
సాలూరు/సాలూరు రూరల్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): గిరిశిఖర గ్రామాల్లో గిరిజనులకు స్థానికంగా మెరుగైన వైద్య సేవలు అందించి.. డోలీ మోతలను తప్పించే లక్ష్యంతో కూటమి సర్కారు రాష్ట్రంలో తొలిసారిగా కంటైనర్ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొచ్చింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కరడవలస గిరిశిఖర గ్రామంలో కంటైనర్ ఆస్పత్రి (గిరి ఆరోగ్య కేంద్రం)ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గిరిజనులకు స్థానికంగా మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో రాష్ట్రంలో మొదటిసారిగా గిరి ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. ఇకపై ప్రాథమిక వైద్యసేవల కోసం గిరిజనులు కొండలు ఎక్కి దిగాల్సిన అవసరం లేదన్నారు. ఈ కంటైనర్ ఆస్పత్రిలో వారానికి రెండు సార్లు ఓ వైద్యాధికారి ఓపీ సేవలు అందిస్తారని తెలిపారు. నెలలోని నాలుగు బుధవారాల్లో 104 మొబైల్ మెడికల్ యూనిట్ ఇక్కడకు వస్తుందని, ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీ తదితరులు వారానికి మూడు సార్లు ఇక్కడ ఓపీ సేవలు నిర్వహిస్తారని వెల్లడించారు.
షుగర్, బీపీతో పాటు సుమారు 105 రకాల రోగాలకు ఇక్కడ మందులు అందుబాటులో ఉంటాయన్నారు. గర్భిణులకు కూడా వైద్య సేవలు అందించనున్నారని తెలిపారు. మలేరియా, డెంగ్యూ, హెపటైటీస్, హెచ్‌ఐవీ, టీబీ-కెల్ల, ఓడిన్, యూరిన్, కంటి చూపు మొదలైన 14 రకాల పరీక్షలు చేస్తారని తెలిపారు. చిన్నపిల్లలకు టీకాలు కూడా వేస్తారని చెప్పారు.
ఆలస్యంగా వచ్చిన ఐసీడీఎస్ పీడీపై మంత్రి అసహనం
గిరిశిఖర గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి అలస్యంగా హాజరైన ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణిపై మంత్రి సంధ్యారాణి అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు జిల్లా అధికారులు మంత్రి కంటే ఆలస్యంగా హాజరైతే ఎలా అని ప్రశ్నించారు.
Updated Date - Nov 26 , 2024 | 03:28 AM