వచ్చేవారం మరో తుఫాన్?
ABN, Publish Date - Oct 20 , 2024 | 07:31 AM
మధ్య అండమాన్ సముద్రం పరిసరాల్లో శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
వాతావరణ శాఖ ప్రకటన
విశాఖపట్నం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): మధ్య అండమాన్ సముద్రం పరిసరాల్లో శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఈనెల 21 లేదా 22వ తేదీన తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి తరువాత పశ్చిమ వాయవ్యంగా పయనించి 23వ తేదీకల్లా వాయుగుండంగా బలపడనున్నదని భారత వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో ఈనెల 21 నుంచి మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కాగా ఉత్తర తమిళనాడుకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. కోనసీమ జిల్లా ముక్కామలలో 74.5 మిల్లీ మీటర్లు, కొండేపూడివారిపేటలో 68 మి.మీ. వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 24వ తేదీ నుంచి రెండు రోజులపాటు ఉత్తరకోస్తాలో భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది.
Updated Date - Oct 20 , 2024 | 08:22 AM