Budget 2024: కేంద్రం సాయంపై సీఎం చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్
ABN , Publish Date - Jul 23 , 2024 | 03:03 PM
కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు వరాలు ప్రకటించడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
అమరావతి, జులై 23: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు వరాలు ప్రకటించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ‘మన రాష్ట్ర అవసరాలను గుర్తించి 2024-2025 ఆర్థిక సంవత్సరానికిగాను సాధారణ బడ్జెట్‌లో రాజధాని, పోలవరం, పారిశ్రామిక రంగాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించినందుకు గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ, గౌరవనీయులు కేంద్ర ఆర్థిక మంత్రి ఎన్ సీతారామన్‌జీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ధన్యవాదాలు. కేంద్రం అందించిన ఈ తొడ్పాటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పునర్నిర్మాణానికి దొహదం చేస్తుంది. ఈ ప్రగతిశీల, విశ్వాసాన్ని పెంచే ఈ బడ్జెట్ సమర్పించినందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను’ అని ట్విట్టర్‌లో చంద్రబాబు రాసుకొచ్చారు.
Budget 2024: బిహార్‌కు ప్రత్యేక హోదా లేదు కానీ..
సాధారణ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వరాల జల్లు కురిపించారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌కు సరైన కేటాయింపులు లేవన్న సంగతి అందరికి తెలిసిందే. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి విజయకేతనం ఎగురవేసింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. ఆ క్రమంలో రాజధాని అమరావతితోపాటు పోలవరం ప్రాజెక్ట్‌పై సీఎం చంద్రబాబు తరచు సమీక్షలు నిర్వహిస్తున్నారు.
అలాగే బడ్జెట్ రూపకల్పన జరుగుతున్న వేళ.. సీఎం చంద్రబాబు ఒకటికి రెండు సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతోపాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఆ క్రమంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వారికి వివరించిన సంగతి తెలిసిందే. దీంతో తాజా బడ్జెట్‌లో ఏపీకి కేంద్రం కేటాయింపులు భారీగా పెంచింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి, నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News