ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ భేటీల మర్మమేమి?

ABN, Publish Date - Nov 25 , 2024 | 02:51 AM

సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందంలో అక్రమాలు జరిగాయని ఆంధ్రప్రదేశ్‌ నుంచి అమెరికా వరకు చెబుతుంటే జగన్‌ మాత్రం బుకాయిస్తున్నారు. సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ)తో ఒప్పందం చేసుకుంటే అదానీకి ఏం సంబంధం అంటూ జగన్‌, ఆయన పార్టీ నేతలు అడ్డగోలుగా వాదిస్తున్నారు.

ఒప్పందంతో సంబంధం లేకుంటే 3సార్లు కలిసిందెందుకు?

2021 డిసెంబరు 1వ తేదీన 7000 మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం జరిగింది. అంతకుముందు... 2021 ఆగస్టు 7వ తేదీన, సెప్టెంబరు 12వ తేదీన, నవంబరు 20వ తేదీన అప్పటి సీఎం జగన్‌తో తాడేపల్లిలో అదానీ ప్రత్యేకంగా మూడుసార్లు భేటీ అయ్యారు. ఈ ఒప్పందంతో అదానీకి సంబంధం లేకుంటే.. మరి ఎందుకు కలిశారు?

నాడు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది సెకీతోనే అయినా విద్యుత్తు సరఫరా చేస్తామన్నది అదానీ, అజూర్‌ సంస్థలు. ఆ తర్వాత అజూర్‌ వైదొలిగితే.. ఆ సంస్థ సరఫరా చేయాల్సిన విద్యుత్తు కూడా తానే చేస్తానని అదానీ ముందుకొచ్చింది. దీంతో సెకీతో జగన్‌ సర్కారు అనుబంధ ఒప్పందం చేసుకుంది. ఈఆర్‌సీ ఈ విషయాన్ని స్పష్టంగా వెల్లడించింది. ఒప్పందం కోసం జగన్‌కు అదానీ 1,750 కోట్లు ముడుపులు ఇచ్చినట్టు అమెరికా దర్యాప్తు సంస్థలు కూడా తేల్చాయి.

జగన్‌కు ముడుపులు ఇచ్చేందుకు అదానీ జరిపిన సంప్రదింపుల ప్రక్రియ అజూర్‌కు నచ్చలేదని, అందుకే విద్యుత్తు సరఫరా ఒప్పందం నుంచి వైదొలిగిందని అమెరికా దర్యాప్తు సంస్థల అభియోగం. నాడు చోటు చేసుకున్న పరిణామాలన్నీ పూసగుచ్చినట్లుగా అజూర్‌ చెప్పిందని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. అజూర్‌ ఉప్పందించడంతోనే అసలు విషయం బయటకు వచ్చిందని అభియోగ పత్రంలో పేర్కొన్నాయి.

  • 2021 డిసెంబరు 1న ‘విద్యుత్‌’ ఒప్పందం

  • అంతకు ముందు ఆగస్టు, సెప్టెంబరు,నవంబరులో జగన్‌తో అదానీ భేటీ

  • లంచాల లింకు లేకుంటే భేటీలెందుకో?

  • సెకీతో అనుబంధ ఒప్పందం మాటేంటి?

  • అదానీ గురించి ఈఆర్‌సీ సైతం ప్రస్తావన

  • ‘ముడుపుల’ బాగోతం నచ్చకే అజూర్‌ వైదొలిగిందన్న అమెరికా దర్యాప్తు సంస్థలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందంలో అక్రమాలు జరిగాయని ఆంధ్రప్రదేశ్‌ నుంచి అమెరికా వరకు చెబుతుంటే జగన్‌ మాత్రం బుకాయిస్తున్నారు. సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ)తో ఒప్పందం చేసుకుంటే అదానీకి ఏం సంబంధం అంటూ జగన్‌, ఆయన పార్టీ నేతలు అడ్డగోలుగా వాదిస్తున్నారు. నిజాలు దాచేందుకు ఎంత ప్రయత్నించినా... పక్కా ప్లాన్‌ ప్రకారమే అదానీకి మేలు చేయడానికి ‘డీల్‌’ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో జగన్‌-అదానీ పాత్రపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


సెకీతో ఒప్పందానికి ముందు పనిగట్టుకుని ప్రత్యేక విమానంలో తాడేపల్లికి మూడుసార్లు అదానీ ఎందుకు వచ్చారు? జగన్‌ను ఎందుకు కలిశారు? ఒకవేళ విద్యుత్తు ఒప్పందం కోసం కాదని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అదానీ ఆసక్తి చూపారని అనుకున్నా.. అప్పట్లో ఆ విషయాన్ని సీఎం హోదాలో జగన్‌ ఎందుకు బహిర్గతం చేయలేదు? ప్రపంచ కుబేరుల్లో ఒకరుగా పేరున్న అదానీ మూడునెలల్లో మూడుసార్లు రహస్యంగా కలవాల్సిన అవసరం ఏమిటి? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పంప్డ్‌ స్టోరేజీ, డేటా సెంటర్‌ను అదానీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆనాడు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించలేదు. ఈ భేటీల వెనుక ఏదో మర్మం దాగుందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. అమెరికా దర్యాప్తు సంస్థలు ఈ సందేహాలను పటాపంచలు చేశాయి. స్కాముల కోసం స్కీమ్‌కు స్కెచ్‌ వేసి రాష్ట్రంపై లక్షల కోట్ల రూపాయల సోలార్‌ ఒప్పందం భారాన్ని జగన్‌ వేశారంటూ న్యూయార్క్‌ కోర్టులో అభియోగం మోపాయి. జగన్‌-అదానీ ముడుపుల వ్యవహారం, ఇది నచ్చక విద్యుత్‌ సరఫరా ఒప్పందం నుంచి అజూర్‌ వైదొలగడం గురించి అభియోగపత్రంలో పేర్కొన్నాయి.


  • ఈఆర్‌సీ ఆదేశాలతో స్పష్టత

2021 డిసెంబరు 1న సెకీ, కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ... ఏపీ డిస్కమ్‌లు, ఏపీ ఇంధన శాఖ మధ్య జరిగిన ఒప్పందాన్ని యథాతథంగా కొనసాగించలేదు. 7,000 మెగావాట్ల సోలార్‌ విద్యుత్తులో అదానీ 4,667, అజూర్‌ 2,333 మెగావాట్లు సరఫరా చేసేలా మొదట సెకీతో ఆ సంస్థలు ఒప్పందాన్ని చేసుకున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వంతో సెకీ ఒప్పందం చేసుకున్నాక భాగస్వామ్య సంస్థలు అదానీ, అజూర్‌ మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. సెకీకి 2,333 మెగావాట్లను సరఫరా చేయబోమని ప్రకటించి, ఒప్పందం నుంచి అజూర్‌ వైదొలిగింది. దీంతో ఏపీతో సెకీ చేసుకున్న ఒప్పందాన్ని కొనసాగించేలా 7,000 మెగావాట్ల సోలార్‌ విద్యుత్తును తానే సరఫరా చేస్తానంటూ అదానీ ముందుకు వచ్చింది. సెకీ ఈ విషయాన్ని రాష్ట్రానికి తెలియజేసింది. తాడేపల్లి కార్యాలయం ఆదేశాల మేరకు 2024 ఏప్రిల్‌ 10న సెకీతో ఇంధన శాఖ అనుబంధ ఒప్పందం చేసుకుంది. ఏపీఈఆర్‌సీ ఇందుకు అభ్యంతరం చెప్పాలి. కానీ ఆమోదించింది.

మధ్యలో ఒప్పందం రద్దు చేసుకుంటే అపరాధంగా కొంత మొత్తాన్ని చెల్లించాలంటూ సహజంగా విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు షరతు విధించవు. తమ వద్ద విద్యుత్తును కొనుగోలు చేయాల్సిందేనన్న డిమాండ్‌ను పెడతాయి. కానీ సెకీతో ఒప్పందం చేసుకున్న సమయం లో.. మధ్యలో దీన్ని రద్దు చేసుకోవాలంటే రూ.2900 కోట్లు అపరాధ రుసుము కింద రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని అదానీ షరతు పెట్టింది. ముడుపుల వ్యవహారంలో అమెరికా దర్యాప్తు సంస్థలు అదానీని దోషిగా నిరూపిస్తే... దాని ఆధారంగా ఒప్పందాన్ని రద్దు చేసుకునే వీలుంటుంది.


  • మొత్తం భారం 1,61,920 కోట్లు

సెకీకి చెల్లించే మార్జిన్‌ను కూడా కలుపుకొని సౌర విద్యుత్తు కొనుగోలుకు యూనిట్‌కు రూ.2.49 ధరతో ఏపీ ఒప్పందం చేసుకుంది. రాజస్థాన్‌లో ఉత్పత్తి చేసే సౌర విద్యుత్తును రాష్ట్రానికి సరఫరా చేయడానికి అదనంగా ట్రాన్స్‌మిషన్‌ చార్జీలు ఉండవని జగన్‌ పలుమార్లు చెప్పారు. కానీ ఆ తర్వాత యూనిట్‌కు రూ.1.70 దాకా చార్జీలు ఉంటాయని సెకీ స్పష్టం చేసింది. అంటే.. యూనిట్‌ ధర రూ.4.19 అవుతుంది. ఈ లెక్కన 25ఏళ్లకి 7000 మెగావాట్ల ఒప్పందం విలువ రూ.95,429.25 కోట్లు. దీనికి ట్రాన్స్‌మిషన్‌ చార్జీలు రూ.66,500కోటు అదనం. ఈ మొత్తం 1,61,920.25 కోట్లు భారమంతా ప్రజలపైనే.

Updated Date - Nov 25 , 2024 | 02:51 AM