ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హెల్మెట్‌ నిబంధన అమలేదీ?

ABN, Publish Date - Dec 12 , 2024 | 03:55 AM

రాష్ట్రంలో హెల్మెట్‌ ధరించని ద్విచక్ర వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

చలానాలు కట్టనివారి ఇళ్లకు విద్యుత్‌, నీళ్లు నిలిపివేయాలి

హెల్మెట్‌ లేక 3 నెలల్లో 667 మంది చనిపోవడం చిన్నవిషయం కాదు

అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.. పోలీసులు, ఎంవీఐ

అధికారుల పనితీరుపై అసంతృప్తిగా ఉన్నాం: హైకోర్టు

విచారణ 18కి వాయిదా.. హాజరు కావాలని ట్రాఫిక్‌ ఐజీకి ఆదేశం

అమరావతి, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో హెల్మెట్‌ ధరించని ద్విచక్ర వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. చలానాలు కట్టనివారి ఇళ్లకు విద్యుత్‌, నీటి సరఫరా నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటిరవితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. కేంద్ర మోటార్‌ వాహన సవరణ చట్టం నిబంధనలు అమలు చేయకపోవడంతో పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, నిబంధనలు ఉల్లంఘించినవారికి జరిమానా విధించడం లేదని పేర్కొంటూ న్యాయవాది తాండవ యోగేష్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్‌ బుధవారం విచారణకు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల 3 నెలల్లోనే 667 మంది చనిపోవడంపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసులు చట్టనిబంధనలు కఠినంగా అమలు చేస్తే ఇలాంటి పరిస్థితి రాదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించింది. హెల్మెట్‌ తప్పనిసరి చేయాలని తాము ఉత్తర్వులు జారీ చేసిన జూన్‌ 26 నుంచి సెప్టెంబరు 4 మధ్య అంతమంది చనిపోవడం చిన్నవిషయమేమీ కాదని పేర్కొంది.

చలానాలు చెల్లించకుంటే వాహనాలను సీజ్‌ చేసేందుకు చట్టనిబంధనలు వెసులుబాటు కల్పిస్తున్నాయని, అలా చేయకుండా మిమ్మల్ని ఎవరు ఆపారని పోలీసులు, ఆర్టీఏ అధికారులను న్యాయస్థానం ప్రశ్నించింది. అధిక జరిమానాలు విధించడం వల్ల సమస్యకు పరిష్కారం దొరక్కపోగా సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ప్రస్తుతం విధిస్తున్న జరిమానాలనే కఠినంగా వసూలు చేస్తే సరిపోతుందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 8,770 మంది ట్రాఫిక్‌ పోలీసులు ఉండాల్సి ఉండగా, 1994 మంది మాత్రమే ఉన్నారని, ఖాళీల భర్తీకి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణించేవారు ఎక్కువమంది మధ్యతరగతి, పేద ప్రజలే ఉంటారని, కుటుంబాన్ని పోషించే వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం మొత్తంపై ప్రభావం పడుతుందని గుర్తు చేసింది. మోటార్‌ వెహికల్‌ చట్టం నిబంధనలు అమలు చేయడంలో పోలీసులు, ఆర్టీఏ అధికారుల పనితీరుపై తాము అసంతృప్తిగా ఉన్నామని పేర్కొంది. తదుపరి విచారణకు కోర్టు ముందు హాజరుకావాలని ట్రాఫిక్‌ ఐజీని ఆదేశించింది. ఐజీని అడిగి తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని తెలిపింది. రవాణా కమిషనర్‌ను వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చింది. రాష్ట్రవ్యాప్తంగా మోటార్‌ వెహికల్‌ చట్టం నిబంధనలపై ఇప్పటివరకు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు? ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించడం, చట్టనిబంధనలు అమలు చేసేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.


ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు

న్యాయవాది తాండవ యోగేష్‌ వాదనలు వినిపిస్తూ.. ద్విచక్రవాహనం నడిపేవారికి హెల్మెట్‌ తప్పనిసరి చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) ఎస్‌.ప్రణతి స్పందిస్తూ.. మోటార్‌ వెహికల్‌ చట్టనిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. హెల్మెట్‌ ధరించనివారిని గుర్తించి పోలీసులు చలానాలు విధిస్తున్నారన్నారు. ఈ ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు రాష్ట్రవ్యాప్తంగా 5,62,492 చలాన్లు విధించామన్నారు. కృష్ణా జిల్లాలో 20,824 చలాన్లు విధించి రూ.4.63 లక్షల జరిమానా వసూలు చేశామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ... సీసీ కెమెరాల ఆధారంగా చలానాలు విధించడమే కాకుండా భౌతికంగా కూడా తనిఖీలు చేయాలని స్పష్టం చేసింది. తాండవ యోగేష్‌ స్పందిస్తూ.. ఇతర రాష్ట్రాల్లో హెల్మెట్‌ ధరిస్తేనే వాహనాల్లో పెట్రోల్‌ పోస్తున్నారన్నారు. హెల్మెట్‌ లేకుంటే ద్విచక్ర వాహనదారులను ప్రభుత్వ కార్యాలయాల్లోకి, కాలేజీల్లోకి అనుమతించడం లేదన్నారు. వివరాలను తదుపరి విచారణలో కోర్టు ముందు ఉంచుతామన్నారు. ఎస్‌జీపీ స్పందిస్తూ.. మొత్తం బాధ్యతను అధికారులపైనే మోపడం సరికాదని, ప్రజలు కూడా బాధ్యతగా మెలగాల్సిన అవసరం ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ప్రజలకు చట్టనిబంధనల గురించి అవగాహన కల్పించాల్సిన బాధ్యత పోలీసులు, ఆర్టీఏ అధికారులదేనని స్పష్టం చేసింది.


ఏపీ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనాల డ్రైవర్లు తెలంగాణ సరిహద్దుకు వెళ్లగానే సీట్‌ బెల్టు పెట్టుకుంటున్నారు. అద్దాలకు నల్ల ఫిలిమ్‌ ఉన్న కార్లు హైదరాబాద్‌లో కనిపించవు. చట్టనిబంధనలు కఠినంగా అమలు చేయడమే ఇందుకు కారణం. ఏపీలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. కార్ల అద్దాలకు నల్ల ఫిలిమ్‌లు ఉంటున్నాయి. ఎవరూ సీటు బెల్టులు పెట్టుకోవడం లేదు. పోలీసులు కఠినంగా వ్యవహరించకపోవడమే కారణం.

హెల్మెట్‌ ధరించని కారణంగా మరింత మంది ప్రాణాలు కోల్పోవడానికి వీల్లేదు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటారనే భయం ప్రజల్లో కలగాలి. చలానాలు వేసి చేతులు దులుపుకోకుండా, వసూలుకు చర్యలు తీసుకోవాలి.

- హైకోర్టు

Updated Date - Dec 12 , 2024 | 07:59 AM