కర్నూలులో హైకోర్టు బెంచ్
ABN, Publish Date - Nov 22 , 2024 | 04:23 AM
రాయలసీమ ముఖద్వారమైన కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేయాలని శాసనసభ గురువారం ఏకగ్రీవంగా తీర్మానంచేసింది. ప్రాంతాలకు అతీతంగా శాసనసభ్యులు కర్నూలులో బెంచ్ ఏర్పాటును హర్షధ్వానాలతో ఆమోదం తెలిపారు.
శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం
తీర్మానం కాపీ హైకోర్టు, కేంద్రానికి పంపుతాం
త్వరలోనే బెంచ్ ఏర్పాటు: చంద్రబాబు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాయలసీమ ముఖద్వారమైన కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేయాలని శాసనసభ గురువారం ఏకగ్రీవంగా తీర్మానంచేసింది. ప్రాంతాలకు అతీతంగా శాసనసభ్యులు కర్నూలులో బెంచ్ ఏర్పాటును హర్షధ్వానాలతో ఆమోదం తెలిపారు. దీంతో తీర్మానం ఏకగ్రీవ ంగా ఆమోదం పొందిందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. అసెంబ్లీ తీర్మానం కాపీని త్వరలో హైకోర్టు, కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. వీలైనంత త్వరగా కర్నూలులో బె ంచ్ ఏర్పాటవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం భోజన విరామం తర్వాత సభలో న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎమ్‌డీ ఫరూఖ్ కర్నూలులో బెంచ్ ఏర్పాటుకోరుతూ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ జరిగింది. రాయలసీమ ప్రాంతానికి చెందిన సభ్యులు మాట్లాడారు. చివరగా చంద్రబాబు మాట్లాడుతూ.... ప్రతి ఒక్కరూ తీర్మానాన్ని బలపరచి ఆమోదించాలని కోరారు. స్పీకర్ జోక్యం చేసుకొని.... తీర్మానాన్ని సమర్థించేవారెవరు అనగా సభ్యులు ఏకగ్రీవంగా బలపరిచారు.
రెండు పార్కులూ సీమకే కేటాయించా...
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త కార్యాలయాలు కర్నూలులోనే ఉంటాయని సీఎం స్పష్టం చేశారు. వాటిని తరలించాలన్న ఆలోచన లేదని, ఆఫీసులు అక్కడే కొనసాగుతాయని ప్రకటించారు. రాయలసీమలో కర్నూలు, తిరుపతి; ఉత్తరాంధ్రలో విశాఖను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాయలసీమను ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామని తెలిపారు. పాదయాత్రలో ప్రకటించినవిధంగా మిషన్ రాయలసీమ హామీలు అమలుచేస్తామని చెప్పారు. కేంద్రం రెండు ఇండస్ట్రియల్ పార్కులు ఇస్తే, వాటిని కర్నూలు జిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తిలో ఏర్పాటు చేశామని, వీటి అభివృద్ధికి రూ.5 వేల కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. ఓర్వకల్లును డ్రోన్ హబ్‌గా మార్చేందుకు 300 ఎకరాలు కేటాయించామని చెప్పారు. కాగా, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేయడం తమ అదృష్టమని రాయలసీమ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. బెంచ్ ఏర్పాటయితే కర్నూలు ముఖచిత్రమే మారిపోతుందన్నారు. కాఆ, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని శాసనమండలిలో మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తీర్మానం ప్రవేశపెట్టారు. ద్రవ్య వినియోగ బిల్లు సహా మరో 3 బిల్లులకు శాసనమండలి ఆమోదం తెలిపింది.
Updated Date - Nov 22 , 2024 | 04:24 AM