AP News : జగన్ బేజారు!
ABN, Publish Date - Sep 20 , 2024 | 06:05 AM
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో అధికారం కోల్పోయిన మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. అత్యంత సన్నిహితులుగా మెలిగిన సీనియర్లే వైసీపీకి గుడ్‌బై చెప్పేస్తుండడం ఆయనకు మింగుడుపడడం లేదు.
తెగిపడుతున్న ఫ్యాను రెక్కలు
నిన్న బాలినేని.. నేడు ఉదయభాను
రేపు గ్రంధి శ్రీనివాస్, శ్రీరంగనాథరాజు?
ఒక్కొక్కరుగా వైసీపీకి గుడ్‌బై
అధికార కూటమిలోకి చేరే యత్నాలు!
వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధులదీ అదే బాట
వారిని ఆపలేక జగన్ విలవిల
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో అధికారం కోల్పోయిన మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. అత్యంత సన్నిహితులుగా మెలిగిన సీనియర్లే వైసీపీకి గుడ్‌బై చెప్పేస్తుండడం ఆయనకు మింగుడుపడడం లేదు. చివరకు ఆయన సమీప బంధువు, ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. ఇది జరిగి 24 గంటలు కాకముందే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా గుడ్‌బై చెప్పేశారు. ఇదేదారిలో రేపో మాపో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు కూడా పార్టీ వీడుతున్నారని వైసీపీలో జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇప్పటికే ఈ జిల్లాకు చెందిన, జగన్‌కు ఆత్మీయుడైన మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) పార్టీకే కాకుండా.. ఏకంగా రాజకీయాలకే గుడ్‌బై చెప్పారు. పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా టీడీపీ, జనసేనల్లో చేరిపోతున్నారు. ఇక మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్‌రావు వైసీపీకి టాటా చెప్పేశారు. రాజ్యసభ సభ్యత్వాలకు కూడా రాజీనామా చేశారు. బాలినేని జగన్నే కలిసి ఇక ఉండలేనని చెప్పి వచ్చేశారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కలిసి జనసేనలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. ఉదయభాను కూడా పవన్‌తో సమావేశమై 22న ఆ పార్టీలో చేరతానని ప్రకటించారు. కీలక నేతలు చేజారకుండా జగన్ బుజ్జగిస్తున్నా వినిపించుకోవడం లేదు. వైసీపీలో కొనసాగితే భవిష్యత్ ఉండదన్న ఆలోచనలతోనే ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు.
Updated Date - Sep 20 , 2024 | 07:33 AM