AP News : ఇసుక కోసం కృత్రిమ మేధ
ABN, Publish Date - Aug 26 , 2024 | 03:39 AM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగిన ఇసుక అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానాన్ని ఆపేసింది. బినామీలను రంగంలోకి దించింది. ఆన్‌లైన్ చెల్లింపులు నిలిపేసి.. నదీ తీరాన్ని తోడేసింది..!
అక్రమ నిల్వలు, రవాణా నియంత్రణకు చెక్
ఇసుక పాలసీలో ఏఐ వినియోగానికి నిర్ణయం
లైవ్ శాటిలైట్ డేటాకు అనుసంధానం
ఉచిత ఇసుక కోసం వెబ్‌సైట్
రూపుదిద్దుకుంటున్న పాలసీ
28న మంత్రి వర్గం ముందుకు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగిన ఇసుక అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానాన్ని ఆపేసింది. బినామీలను రంగంలోకి దించింది. ఆన్‌లైన్ చెల్లింపులు నిలిపేసి.. నదీ తీరాన్ని తోడేసింది..!
ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న ఉచిత ఇసుక పాలసీతో ఈ అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. అయితే ఈ విధానంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని కూటమి సర్కారు భావిస్తోంది.
ఉచిత ఇసుక ప్రయోజనాలు, లక్ష్యాలను దెబ్బతీసే చర్యలను గుర్తించి ఎక్కడిక్కడ అడ్డుకునేందుకు లైవ్ శాటిలైట్ డేటాతోపాటు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను వినియోగించాలని నిర్ణయించింది. త్వరలో తీసుకురానున్న ఇసుక సమగ్ర పాలసీలో దీన్నో ప్రాధాన్యతా అంశంగా చేర్చబోతోంది.
ఇసుక వాహనాలకు బ్యానర్లు..!
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో భాగంగా ఇప్పటికే లైవ్ శాటిలైట్ డేటాను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలోనూ అనేక ఆధునిక మార్పులొచ్చాయి. వీటిని కూడా జోడించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత టాస్క్‌లు నిర్వహించాలని సర్కారు కార్యాచరణ ప్రణాళిక రచిస్తోంది.
ఇసుక అక్రమ నిల్వలను గుర్తించేందుకు, వాటి అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా వాస్తవిక ప్రాంతాన్ని జియో సెన్సింగ్ చేసేందుకు ఈ సాంకేతికను ఉపయోగిస్తారు. ప్రస్తుతం ప్రభుత్వ నియంత్రణలో 84 ఇసుక స్టాక్ యార్డ్‌లున్నాయి.
వర్షాకాలం తర్వాత మరికొన్ని పెరిగే అవకాశం ఉంది. ఇలా ప్రతీ స్టాక్‌యార్డ్‌ను జీపీఎస్ డేటా పరిధిలోకి తీసుకొచ్చి మ్యాపింగ్ చేస్తారు. ఇవి కాకుండా.. మరెక్కడైనా భారీగా ఇసుక నిల్వలు ఉంటే శాటిలైట్ లైవ్ డేటాకు ఏఐ టెక్నాలజీని జోడించి వాటిని కనిపెట్టనున్నారు.
తద్వారా తక్షణమే ఆ ప్రాంతాన్ని గుర్తించి గనుల శాఖ విజిలెన్స్, పోలీసు బృందాలను అక్కడికి పంపించి తనిఖీలు నిర్వహించేందుకు వీలుంటుంది. అది అక్రమ నిల్వే అని గుర్తిస్తే దాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకునేలా సమగ్ర ఇసుక పాలసీలో విధివిధానాలు పొందుపరుస్తున్నారు. ఉచిత ఇసుక తరలించే వాహనాలను ముందుగా ఏపీ గనులశాఖ డేటాలో రిజిస్టర్ చేయబోతున్నారు.
వాటికి ఇసుక రవాణా పర్మిట్లు ఇస్తారు. సగటున ఒక కిలోమీటరుకు ఎంత మేర చార్జీ ఉండాలో ప్రభుత్వమే నిర్దేశించనుంది. ఆ తర్వాత వినియోగదారుడు ఇసుకను బుక్ చేసుకున్నాక ఈ వాహనాలను స్టాక్‌యార్డ్‌కు అనుమతిస్తారు. ఆ వాహనాలకు ‘ఉచిత ఇసుక రవాణా వాహనం’ అనే బ్యానర్ కడతారు.
దాని కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా జీపీఎస్ పరికరాన్ని అమరుస్తారు. ఇలా రహదారులపై వెళ్లే ఇసుక వాహనాలకు జీపీఎస్ ట్రాకర్ ఉందా..? ఉచిత ఇసుక రవాణా వాహనం బ్యానర్ ఉందా..? అది పర్మిట్ ఉన్న వాహనమేనా..? అని లైవ్ శాటిలైట్ డేటా ద్వారా గుర్తించేందుకు కృత్రిమ మేధను ఉపయోగిస్తారు.
అంటే.. ఈ డేటాను విశ్లేషించడం ద్వారా ఏదైనా వాహనం అక్రమంగా ఇసుకను తరలిస్తుంటే వెంటనే గుర్తించి రెగ్యులర్ పోలీసులు, గనుల విజిలెన్స్ విభాగాలను అప్రమత్తం చేయడం సాధ్యమవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఉచిత ఇసుక కోసం ప్రత్యేక వెబ్‌సైట్
ఉచిత ఇసుక పంపిణీ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందిస్తోంది. సమగ్ర ఇసుక పాలసీ ఆమోదం తర్వాత ఈ వెబ్‌సైట్ సెప్టెంబరు 11న అందుబాటులోకి రానుంది.
ఇందులో రీచ్‌ల వారీగా బుకింగ్‌లు, ఇసుక లభ్యత, పెండింగ్‌లో ఉన్నవి, డిస్పాచ్ అయినవి వంటి కీలకమైన వివరాలు ఉంటాయి.
రవాణా చార్జీల వివరాలను కూడా అందులో పొందుపరచనున్నారు. ఇవన్నీ కూడా సమగ్ర పాలసీలో పొందురచనున్నారు. ఇప్పటికే మార్గదర్శకాలను అధికారులు సిద్ధం చేశారు.
అటవీ, పర్యావరణ శాఖల అనుమతులు తీసుకున్నాక ఫైలును ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపించనున్నారు. ఈ నెల 28న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఇది కేబినెట్ ముందుకు చర్చకు రానుంది.
Updated Date - Aug 26 , 2024 | 03:39 AM