రూ.32.69 కోట్లతో పీపీపీ రోడ్లపై అధ్యయనం
ABN, Publish Date - Oct 25 , 2024 | 05:10 AM
రాష్ట్ర రహదారులను పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో అభివృద్ధి చేయడానికి కన్సల్టెన్సీలతో అధ్యయనం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కన్సల్టెంట్లతో చేయించాలని నిర్ణయించిన ప్రభుత్వం
ఏడు ప్యాకేజీలుగా రహదారి పనులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర రహదారులను పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో అభివృద్ధి చేయడానికి కన్సల్టెన్సీలతో అధ్యయనం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టెండర్ల ద్వారా అర్హత కలిగిన కన్సల్టెన్సీలను ఎంపిక చేయాలని ఏపీఆర్‌డీసీ చీఫ్ ఇంజనీర్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు (జీవో 318) జారీ చేసింది. ఈ అధ్యయనానికి అయ్యే ఖర్చు రూ.32.69 కోట్లుగా ఖరారు చేశారు. రాష్ట్రంలో ప్రధాన రహదారులను పీపీపీ విధానంలో విస్తరించి, అభివృద్ధి చేయాలని ఆర్‌అండ్‌బీని సీఎం చంద్రబాబు రెండు నెలల క్రితం ఆదేశించారు. దీనిలో భాగంగా ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి నేతృత్వంలోని బృందం గుజరాత్, అసోం సహా పలు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి పీపీపీ రహదారులపై అధ్యయనం చేసి వచ్చింది.
ఇప్పుడు కన్సల్టెన్సీలను ఎంపిక చేసి వాటితో పీపీపీ రహదారుల సాధ్యాసాధ్యాలు, ఇతర సాంకేతిక అంశాలపై అధ్యయనం చేయించాలని సర్కారు నిర్ణయించింది. ఐఐపీడీఎఫ్ స్కీమ్ కింద ఏడు ప్యాకేజీల్లో 1,307 కి.మీ. మేర రహదారులను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ ఏడు ప్యాకేజీల్లో పేర్కొన్న రహదారుల అభివృద్ధికి సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల పరిశీలనతో పాటు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ల తయారీపై కన్సల్టెన్సీలను ఎంపిక చేసేందుకు టెండర్లు పిలవనున్నారు.
Updated Date - Oct 25 , 2024 | 05:10 AM