AP News: లోకేశ్ వాహనాలు తనిఖీ.. పోలీసులపై అచ్చెన్నాయుడు ఫైర్
ABN, Publish Date - Mar 24 , 2024 | 07:30 PM
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పట్ల ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) పట్ల ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయడు (Kinjarapu Atchannaidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం అమరావతిలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. మూడు రోజుల్లో నాలుగు సార్లు లోకేశ్ కాన్వాయ్‌ను ఆపి తనిఖీ చేయడం టార్గెట్ చేయడం కాక మరేమిటని ప్రశ్నించారు. మార్చి 20వ తేదీ ఉదయం 8 గంటలకు, 23వ తేదీ ఉదయం 8 గంటలకు.. అలాగే ఈ రోజు (ఆదివారం) ఉదయం 8.10 నిమిషాలకు, సాయంత్రం 5 గంటలకు లోకేశ్ కాన్వాయ్ ఆపి మరీ తనిఖీలు నిర్వహించారని మండిపడ్డారు.
దీనిపై లోకేశ్ ప్రశ్నిస్తే.. కోడ్ అమలులో భాగంగా తనిఖీ చేస్తున్నామంటూ పోలీసులు చెబుతున్నారని.. అయితే కేవలం లోకేష్ వాహనాలు మాత్రమే ఆపాలని పోలీసులకు ఏమైనా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు. మరోవైపు అధికార వైసీపీ ముఖ్య నాయకుల కాన్వాయ్‌లు ఎందుకు తనిఖీలు చేయడం లేదని పోలీసులను ఆయన సూటిగా ప్రశ్నించారు. మంగళగిరిలో ఇప్పటి జగన్ రెడ్డి బొమ్మలున్న ఫ్లెక్సీలు.. ఎన్నికల నియమావళికి విరుద్దంగా ఉన్నాయని... వాటిని సైతం ఎందుకు తొలగించడం లేదంటూ పోలీసులను నిలదీశారు. తాడేపల్లి ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవడం మానుకోవాలని మంగళగిరి పోలీసులకు అచెన్నాయుడు సూచించారు.
Updated Date - Mar 24 , 2024 | 07:37 PM