అర్జీలను రెండు వారాల్లోపు పరిష్కరించాలి
ABN, Publish Date - Dec 20 , 2024 | 11:46 PM
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలకు రెండు వారాల్లోపు సాధ్యమైనంత వరకు పరిష్కారం చూపాలని కలెక్టర్ పి.రంజిత బాషా తహసీల్దార్లను ఆదేశించారు.
కలెక్టర్ పి.రంజిత బాషా
కర్నూలు కలెక్టరేట్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలకు రెండు వారాల్లోపు సాధ్యమైనంత వరకు పరిష్కారం చూపాలని కలెక్టర్ పి.రంజిత బాషా తహసీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి రెవెన్యూ సదస్సులు, హౌసింగ్, పంచాయతీ రాజ్, సీసీ రోడ్లు, పీఆర్ ఓన యాప్, తదితర అంశాలపై స్పెషల్ ఆఫీసర్లు డివిజన మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జనవరి 7వ తేదీన రెవెన్యూ మంత్రి, సీసీఎల్‌ఏ, ప్రిన్సిపల్ సెక్రటరీలు రెవెన్యూ సదస్సులకు సంబంధించి తిరుపతిలో రీజినల్ కాన్పరెన్స నిర్వహిస్తారని, అంతలోపు అర్జీలను పరిష్కరించాలన్నారు. రీజనల్ కాన్ఫరెన్సలో పెండింగ్‌లో ఉన్న అర్జీలను కారణాలు చెప్పాల్సి ఉంటుందన్నారు. ఇళ్ల నిర్మాణ ప్రగతిలో వెనుకబడి ఉన్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రగతి చూపని నందివరం, హాలహర్వి, ఆలూరు, వెల్దుర్తి, కోసిగి, ఆస్పరి, దేవనకొండ, పెద్దకడుబూరు మండలాలల ఎంపీడీవోలు, హౌసింగ్ ఏఈలకు మెమోలు జారీ చేయాలని హౌసింగ్ పీడీనీ ఆదేశించారు. 1, 2 ఇళ్లను పూర్తి చేస్తే లక్ష్యాలను ఎలా సాధిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే వారం ఇదే విధంగా ప్రగతి ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే మంత్రాలయం డీఈకి షోకాజ్ నోటీసు జారీ చేయాలన్నారు. జనవరి మొదటి వారంలో ముఖ్యమంత్రిచే లక్ష ఇళ్లను ప్రారంభించే కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ సీసీ రోడ్ల పనులకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఇంజనీర్లను ఆదేశించారు. రానున్న వేసవి కాలం దృష్ట్యా డిసెంబరు 31లోపు తాగునీటికి సంబంధించిన ప్రణాళిక పంపించాలని ఆదోని సబ్ కలెక్టర్, కర్నూలు పత్తికొం ఆర్డీవోలను ఆదేశించారు. ఆలూరు, హొళగుంద, ఈవోఆర్‌డీల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 శాతం కంటే తక్కువ పురోగతి సాధించిన మండలాల ఈవోఆర్‌డీలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీపీవోను ఆదేశించారు. ఈ కాన్ఫరెన్సలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో వెంకటనారాయణమ్మ, పంచాయతీరాజ్ ఎస్‌ఈ రామచంద్రారెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ నాగేశ్వరరావు, జడ్పీ సీఈవో నాసరరెడ్డి పాల్గొన్నారు.
జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష
కర్నూలు కలెక్టరేట్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని హొళగుంద, మద్దికెర, చిప్పగిరి (యాస్పిరేషనల్ బ్లాక్స్) మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై కలెక్టర్ పి.రంజిత బాషా సంబంధిత జిల్లా అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జల్‌జీవన మిషన ద్వారా ఇంటింటికి కొళాయిల ఏర్పాటుకు ప్రత్యేక టెండరు పిలిచి పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈని ఆదేశించారు. స్వచ్ఛభారత మిషన కింద వ్యక్తిగత మరుగుదొడ్లు త్వరగా పూర్తి చేయాలని, అంగనవాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. భారత సంచార నిఘం లిమిటెడ్ ద్వారా గ్రామ పంచాయతీ కార్యాలయాలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించాలని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహాలను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. భూమి సారవంత పరీక్షలు, పీఎం కిసాన లబ్ధిదారుల వివరాలను పీఎం కిసాన డాష్ బోర్డులో పొందుపరచాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, టాయిలెట్ల ఏర్పాటు వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌లో పొందుపరచాలని విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. గర్భిణులు, ప్రజలకు షుగర్ వ్యాధి, టీబీ, రక్త పరీక్షలు పరీక్షలు నిర్వహించి వివరాలు ఎనసీడీ పోర్టల్‌లో పొందుపరచాలని సంబంధిత వైద్య అధికారులను ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, ఇనచార్జి సీపీవో భారతి, ఎస్‌ఈ ఆర్‌డబ్లూఎస్ నాగేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి బాస్కర్, డీఈవో శామ్యూల్ పాల్, లీడ్ డిస్ర్టిక్ట్ మేనేజర్ రామచంద్రరావు, రాషీ్ట్రయ స్వాస్థ్య కోఆర్డినేటర్ హేమలత, యాస్పిరేషనల్ బ్లాక్ కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు.
Updated Date - Dec 20 , 2024 | 11:46 PM