టీడీపీపీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు
ABN, Publish Date - Jun 23 , 2024 | 04:24 AM
టీడీపీ పార్లమెంటరీ నేతగా నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నియమితులయ్యారు. శనివారం రాత్రి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ విషయం ప్రకటించారు.
ఉప నేతలుగా ప్రసాదరావు, శబరి
రాష్ట్ర ప్రయోజనాలే ఎంపీల కర్తవ్యం
పోలవరం, అమరావతిని ప్రాధాన్యాలుగా ఎంచుకోండి: చంద్రబాబు
అమరావతి, జూన్ 22(ఆంధ్రజ్యోతి): టీడీపీ పార్లమెంటరీ నేతగా నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నియమితులయ్యారు. శనివారం రాత్రి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ విషయం ప్రకటించారు. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఎంపీల సమావేశాన్ని నిర్వహించారు. పార్లమెంటరీ పార్టీ ఉప నేతలుగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, కోశాధికారిగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విప్‌గా అమలాపురం ఎంపీ గంటి హరీశ్‌ను నియమించారు. కాగా, రాష్ట్రానికి ఎక్కువ నిధులు రాబట్టడం ప్రథమ ప్రాధాన్యంగా టీడీపీ ఎంపీలు పనిచేయాలని చంద్రబాబు వారికి సూచించారు. ‘పోలవరం, అమరావతిని ప్రాధాన్యాలుగా ఎంచుకొని పనిచేయాలి. అమరావతిని ఒక మంచి రాజధానిగా తీర్చిదిద్దాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు అక్కడకు తరలిరావడానికి ప్రయత్నం చేయాలి. పోలవరం కూడా జగన్ విధ్వంస పాలనకు బలైంది. దానిని కూడా పూర్తి చేయాలి. రాష్ట్రం నలుమూలలకూ నీరివ్వాలి. మీ శక్తిని అంతటిని వీటికి వాడండి’ అని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రం తరఫున ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి నియామకంపై చర్చ జరిగింది. మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు పేరును కొందరు ఎంపీలు ప్రతిపాదించారు. దానిపై తుది నిర్ణయం జరగలేదు.
Updated Date - Jun 23 , 2024 | 05:35 AM