ఏటీఎ్‌సలకు రైట్ రైట్..!
ABN, Publish Date - Dec 20 , 2024 | 05:02 AM
రవాణా శాఖలో ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ల (ఏటీఎస్) ఏర్పాటులో నెలకొన్న గందరగోళానికి శుభం కార్డు పడనుంది.
వాహన ఫిట్‌నె్‌సలో బ్రేక్ ఇన్‌స్పెక్టర్ సంతకం తప్పనిసరి
ఏకపక్షంగా ప్రైవేటు వ్యవస్థకు అప్పగించబోమన్న ఆర్టీఏ
సమస్యను ప్రభుత్వం దృష్టికి
తీసుకెళ్లిన ఏటీఎస్ కాంట్రాక్టర్లు
రెండేళ్లపాటు ఫీజు వసూలుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి
ఫిట్‌నెస్ సర్టిఫికెట్లపై ఎంవీఐల సంతకం ఉండాలని సూచన
కొత్త ఏడాదిలో ప్రతి జిల్లాలోనూ ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
రవాణా శాఖలో ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ల (ఏటీఎస్) ఏర్పాటులో నెలకొన్న గందరగోళానికి శుభం కార్డు పడనుంది. ముఖ్యమంత్రి వద్దకు చేరిన ఫైలు ముందుకు కదలడంతో ఇక రాష్ట్రవ్యాప్తంగా ఏటీఎ్‌సలు ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. మొత్తం వ్యవస్థను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పెట్టేందుకు ససేమిరా అన్న రవాణా శాఖ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్థించడం.. డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లకు వసూలు చేసే ఫీజులను రెండేళ్లపాటు ఏటీఎస్ కాంట్రాక్టర్లే తీసుకునేందుకు అనుమతించడంతో... రవాణా శాఖ, కాంట్రాక్టర్ల మధ్య నెలకొన్న గందరగోళానికి తెరపడింది. అలాగే మోటారు వాహన ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ)లు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లపై తప్పనిసరిగా సంతకం చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా అనంతపురం, నంద్యాలలో ఏర్పాటైన ఏటీఎ్‌సలు కొత్త ఏడాది నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ప్రారంభం కానున్నాయి.
వైసీపీ హయాంలో కోట్లు నొక్కేసే ప్రయత్నాలు..
దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలకు కారణాలపై సుదీర్ఘంగా సమీక్షించిన కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ డ్రైవర్ల తప్పిదంతోపాటు వాహన ఫిట్‌నెస్ కూడా ప్రధాన కారణంగా గుర్తించింది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు.. డ్రైవింగ్ లైసెన్స్ జారీ, వాహన ఫిట్‌నెస్ పరీక్షలను ఆటోమేటిక్ పద్ధతిలో చేపట్టాలని నిర్ణయించింది. అన్ని రాష్ట్రాలూ తప్పనిసరిగా ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు (ఏటీఎస్) ఏర్పాటు చేసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్రం సూచన మేరకు గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు కుమ్మక్కై ప్రభుత్వ సొమ్ము దోచుకోవడానికి టెండర్లు వేసి ఏటీఎ్‌సలు దక్కించుకునే ప్రయత్నం చేశారు. చిత్తూరులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కర్నూలులో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బంధువులు ఏటీఎస్ కేంద్రాలను దక్కించుకుని కొన్నాళ్లపాటు డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్), వాహన ఫిట్‌నెస్ సర్టిఫికెట్ (ఎఫ్‌సీ) ఫీజులు కోట్లాది రూపాయలు నొక్కేసే ప్రయత్నాలు చేశారు. అయితే ఈలోగా ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియ వాయిదా పడింది. అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో వైసీపీ నేతలు తెరవెనుక నుంచి అక్రమమార్గాల ద్వారా ఏటీఎ్‌సలు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని రవాణాశాఖ మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డికి ఫిర్యాదులు అందాయి. దీంతో మంత్రి సూచన మేరకు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి.. ఆ శాఖ అధికారులతో సమీక్షించారు. కేంద్ర రహదారులు, రవాణా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు భిన్నంగా టెండరు నిబంధనలు ఉన్నాయని, ఎంవీఐల పాత్రను పూర్తిగా తొలగిస్తే భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.
ఎంవీఐల పర్యవేక్షణ
ఉండాల్సిందే..
ఇదే విషయమై అధికారులతో మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి సమీక్షించగా.. మొత్తం వ్యవస్థ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళితే అది మరింత ప్రమాదానికి దారితీస్తుందని ఎంవీఐలు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఎంవీఐ ప్రతిదీ తనిఖీ చేసిన తర్వాతే ఫిట్‌నె్‌సకు అనుమతిస్తారని, దీన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే తప్పులు ఎక్కువ జరుగుతాయని అన్నారు. గుజరాత్‌లో 5 వేల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు నకిలీవని తేలాయని గుర్తుచేశారు. తెలంగాణ, కేరళల్లో సొంతంగా ప్రభుత్వాలే ఏర్పాటు చేస్తున్నాయని, ఏపీలోనూ అదే పద్ధతి కొనసాగిస్తే మేలని చెప్పారు. సమ్మతించిన మంత్రి నాన్ ఆటోమేటిక్ పరిశీలనకు ఎంవీఐలను ఏటీసీ కేంద్రాల్లో నియమించాలని, పూర్తిగా ప్రైవేటు పెత్తనాన్ని ఒప్పుకోవద్దని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శికి చెప్పారు. ఫలితంగా రాష్ట్రంలో ఏర్పాటు కావాల్సిన ఏటీఎ్‌సలు ఆగిపోయాయి. పలు మార్గాల్లో ప్రయత్నాలు చేసిన ఏటీఎస్ కాంట్రాక్టర్లు... ఎంవీఐల పరిశీలనలో జరిగినా తమకు అభ్యంతరం లేదని, కానీ.. ఫీజు రెండేళ్లు తీసుకోకపోతే ఒక్కో కేంద్రానికి నాలుగైదు కోట్లు పెట్టుబడి పెట్టిన తాము తీవ్రంగా నష్టపోతామని ప్రభుత్వానికి విన్నవించారు. ఈ గందరగోళంపై సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రెండేళ్లపాటు ఫీజు ఏటీఎ్‌సలు తీసుకునేందుకు.. వాహన ఫిట్‌నెస్ సర్టిఫికెట్లపై ఎంవీఐలు సంతకం పెట్టేందుకు అనుమతి ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది.
Updated Date - Dec 20 , 2024 | 05:02 AM