Polavaram: పోలవరం గడువు.. తరచూ మార్చితే ఎలా
ABN, Publish Date - Dec 07 , 2024 | 05:54 AM
పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే గడువును తరచూ మార్చేస్తే ఎలాగని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో అతుల్ జైన్ అభ్యంతరం వ్యక్తంచేశారు.
పీపీఏ సీఈవో అభ్యంతరం
2026 మార్చికే ఈసీఆర్‌ఎఫ్ పూర్తి చేస్తామన్నారుగా!
ఇప్పుడేమో 2027 చివరికని అంటున్నారు
వచ్చే జనవరి 2న డయాఫ్రం వాల్ మొదలుపెట్టాల్సిందే
ప్రత్యేక ఖాతా నుంచే లావాదేవీలు చేయాలి
అడ్వాన్సులో 75% ఖర్చుపెడితేనే తదుపరి వాయిదా విడుదల
పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో అతుల్ జైన్
అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే గడువును తరచూ మార్చేస్తే ఎలాగని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో అతుల్ జైన్ అభ్యంతరం వ్యక్తంచేశారు. 2021 నుంచి వరుసగా తేదీలు మార్చుతూ వస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రాజెక్టును 2026 మార్చినాటికి పూర్తి చేస్తామని రాష్ట్రప్రభుత్వం హామీ ఇచ్చినందునే.. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి డెడ్‌లైన్‌ను అధికారికంగా ప్రకటించామని తెలిపారు. ఇప్పుడు కీలకమైన ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యాం (ఈసీఆర్‌ఎఫ్)ను 2027 డిసెంబరుకు పూర్తి చేస్తామంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. పోలవరం పనులపై శుక్రవారం ఢిల్లీ నుంచి అతుల్ జైన్ రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారు, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను జనవరి 2వ తేదీన ప్రారంభించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఈ పనుల బాధ్యత పూర్తిగా జర్మన్ సంస్థ బావర్‌దేనని స్పష్టం చేశారు. గతంలో ఆ సంస్థ, ఎల్ అండ్ టీ కలసి వాల్‌ను నిర్మించాయని.. ఇప్పుడు బావర్ ఒక్కటే కడుతోందని చెప్పారు. కాంక్రీట్ ప్లాస్టిక్ మిక్స్‌ను మేఘా ఇంజనీరింగ్ సిద్ధం చేసినప్పటికీ.. మిశ్రమం సరిగా ఉందో లేదో ధ్రువీకరించి.. నిర్మాణం చేపట్టాల్సింది బావర్ మాత్రమేనని వెల్లడించారు.
ప్రత్యేక ఖాతాపై సడలింపులు ఉండవ్..
కేంద్రం నుంచి పోలవరం నిధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాంకు ఖాతా ద్వారానే పనుల చెల్లింపులన్నీ జరగాలని అతుల్ జైన్ స్పష్టం చేశారు. ఈ షరతుపైనే రాష్ట్రానికి రూ.2,300 కోట్లు ముందస్తుగా ఇచ్చామన్నారు. ఈ నిబంధనపై ఎలాంటి సడలింపులూ ఉండవని చెప్పారు. ఈ ఖాతాలో ఇప్పటిదాకా రూ.300 కోట్లే జమ చేశారని.. మిగిలిన రూ.2,000 కోట్లు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. అడ్వాన్సుగా ఇచ్చిన రూ.2,300 కోట్లలో 75శాతం వ్యయం చేస్తేనే.. తదుపరి వాయిదా విడుదలవుతుందని తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.5,000 కోట్లు ముందస్తుగా మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తామన్నారు. కాంట్రాక్టు సంస్థ, జల వనరుల శాఖతో పాటు థర్డ్ పార్టీగా మరో ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అతుల్ పేర్కొన్నారు. ఇందుకోసం టెండర్లు పిలవాలన్నారు. పోలవరం డిజైన్లన్నీ ఆఫ్రీ ఏజెన్సీ ద్వారా మేఘా చేపడుతోందని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంపై ప్రతి 15 రోజులకోసారి కాంట్రాక్టు సంస్థలతో సమావేశం నిర్వహించాలన్నారు. నిర్మాణ సంస్థపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) స్థాయి అధికారికి నియంత్రణ ఉండాల్సిందేనని పీపీఏ సీఈవో స్పష్టం చేశారు.
Updated Date - Dec 07 , 2024 | 09:59 AM