Nara Bhuvaneswari: నేటి నుంచి కుప్పంలో భువనేశ్వరి పర్యటన
ABN, Publish Date - Jul 23 , 2024 | 07:41 AM
నేటి నుంచి చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పాటు భువనేశ్వరి పర్యటన కొనసాగనుంది.
చిత్తూరు: నేటి నుంచి చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పాటు భువనేశ్వరి పర్యటన కొనసాగనుంది. కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భువనేశ్వరి శ్రీకారం చుట్టనున్నారు. కుప్పం నియోజకవర్గంలోని రెండు గ్రామాలు పైపాళ్యం, కంచి బంధార్లపల్లిని ఆమె దత్తత తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గ మహిళలతో భువనేశ్వరి ముఖాముఖి సమావేశం కానున్నారు. మారుమూల తండాలకు కూడా వెళ్లి అక్కడి మహిళలతో భువనేశ్వరి మాట్లాడనున్నారు. నియోజకవర్గ మహిళలకు ఆమె కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు.
కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఓపెన్ చేయనున్నారు. భువనేశ్వరి కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్,కుప్పం నియోజకవర్గ టీడీపీ నేతలు పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం గుడుపల్లె మండలం కమ్మగుట్టపల్లె చేరుకుని మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కంచిబందార్లపల్లెలోనూ గ్రామీణ మహిళలతో సమావేశమై వారి సాదకబాధకాలు తెలుసుకుంటారు. గుట్టపల్లె, కోటపల్లె గ్రామాలలో మహిళలతో ముఖాముఖిలో పాల్గొంటారు. రాత్రికి పీఈఎస్ గెస్ట్‌హౌ్‌సలో బస చేస్తారు. 24న ఉదయం కుప్పంలో స్కిల్ డెవల్‌పమెంట్ సెంటర్‌ను ప్రారంభిస్తారు.
అనంతరం కుప్పం మండలం ఎన్.కొత్తపల్లె, నడిమూరు, పైపాళ్యం, ఉర్లవోబనపల్లె, గుడ్లనాయనిపల్లె గ్రామాలను సందర్శించి ఆయా గ్రామాలలో మహిళలతో ముఖాముఖి సమావేశమవుతారు. సాయంత్రం కుప్పం చేరుకుని టీడీపీ నాయకులు, కో-ఆర్డినేటింగ్ కమిటీతో సమావేశమవుతారు. 25వ తేది ఉదయం శాంతిపురం మండలం సోమాపురం, కర్లగట్ట, బడుగుమాకులపల్లె, రామకుప్పం మండలం ఆవులకుప్పం, నారాయణపురం తాండా, ఆరిమానుపెంట, వీర్నమల గ్రామాలను సందర్శించి అక్కడి మహిళలతో ముఖాముఖి నిర్వహిస్తారు. 26వ తేదీన శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద తమ సొంతింటి నిర్మాణాన్ని పరిశీలిస్తారు. అనంతరం పీఈఎస్ ఆడిటోరియంలో 10.30 గంటలకు మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు తిరుగు ప్రయాణమవుతారు.
Read more AP News and Telugu News
Updated Date - Jul 23 , 2024 | 07:41 AM