AP News: బుర్రలేని సర్కార్.. డేటా చోర్!
ABN, Publish Date - May 02 , 2024 | 05:26 AM
వ్యక్తిగత సమాచారానికి రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంది. ప్రభుత్వం కూడా దాన్ని తీసుకోవడానికి లేదు’’.
ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం సేకరణ
సైబర్ నేరగాళ్లకు ఏపీ సర్కారు ‘సమాచార విందు’
ప్రభుత్వ వెబ్‌సైట్లలో అందరికీ అందుబాటులో
ఒక్క క్లిక్‌తో కీలక సమాచారమంతా లభ్యం
ఇంటి అడ్రస్ నుంచి బ్యాంకు ఖాతా వరకు..
పెళ్లి ఫొటోల నుంచి పాస్‌పోర్టు, పాన్ వరకు..
ఆధార్, రేషన్ కార్డులు, ఫోన్ నంబర్లు అన్నీ ఓపెన్
ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. ఎలాగైనా వాడొచ్చు
ఐదేళ్లుగా ఇదే తంతు.. పట్టించుకున్న వాళ్లు ఉంటే ఒట్టు
‘క్రిటికల్ రివర్’ కంపెనీకి రిజిస్ర్టేషన్ వివరాలు, వేలిముద్రలు
ఇతర సమాచారమూ ఆ సంస్థకే వెళుతోందా?
రాజ్యాంగంలోని 21వ అధికరణ పౌరులకు ‘గోప్యత హక్కు’ను ప్రసాదిస్తోంది. దీని ప్రకారం... ప్రజల నుంచి వారి వ్యక్తిగత, రహస్య సమాచారం సేకరిస్తే... ఏ అవసరం కోసం తీసుకుంటే ఆ అవసరానికి మాత్రమే వాడాలి. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని అత్యంత భద్రంగా ఉంచాలి.
కానీ, జగన్ సర్కార్ అంగట్లో ఉచిత సరుకులాగా అందుబాటులో ఉంచింది.
కేవలం ఒక ఫోన్ నంబర్ తెలుసుకుని బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్న రోజులివి! కానీ... ఫోన్ నంబరు, మెయిల్ ఐడీ, ఆధార్, పాస్‌పోర్టు, పాన్ వంటి సమగ్ర సమాచారాన్ని వెబ్‌సైట్లలో పెడితే పరిస్థితి ఏమిటి?
సైబర్ చోరులు పండగ చేసుకోరా?
అనంతపురం అరవింద్‌నగర్‌కు చెందిన యువకుడు.. సికింద్రాబాద్ సైనిక్‌పురికి చెందిన యువతిని అనంతపురంలోని జీఆర్ ఫంక్షన్ హాల్‌లో పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరి ఫోన్ నంబర్లు ఇవే! ఆధార్ నంబర్లూ రెడీ! టెన్త్ మార్క్స్ లిస్టు కాపీ కావాలంటే చూడండి! మెయిల్ ఐడీలూ చూసుకోండి! పాస్‌పోర్టులు కూడా చూసుకోవచ్చు. వాళ్ల అమ్మా నాన్నల ఫోన్ నంబర్లు, పెళ్లి రిజిస్ట్రేషన్‌కు సాక్షి సంతకాలు చేసేందుకు వచ్చిన వారి ఫోన్ నంబర్లూ కూడా ఉన్నాయి! కావాలంటే చూసుకోవచ్చు!
...ఏమిటిదంతా అనుకుంటున్నారా? ఇవన్నీ మాకెలా తెలుసునని అనుకుంటున్నారా? మీరూ, మేమే కాదు! ఇంటర్నెట్ ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవచ్చు! ప్రతి ఒక్కరి వివరాలూ తెలుసుకోవచ్చు! వాళ్ల ఆధార్, టెన్త్ మార్క్‌లిస్టుల వంటి డాక్యుమెంట్లూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు! దేనికోసమైనా వాడుకోవచ్చు! ఇది... జగన్ సర్కారు నిర్వాకం.
గత ఎన్నికల సమయంలో ‘డేటా చోరీ’ అంటూ నానా బీభత్సం సృష్టించిన జగన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటాను గుప్పిట పట్టేశారు. ‘చోరుల’ చేతిలోనూ పెట్టేశారు!
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘’వ్యక్తిగత సమాచారానికి రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంది. ప్రభుత్వం కూడా దాన్ని తీసుకోవడానికి లేదు’’... ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి! ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన, 2019 ఎన్నికల ముందు విపక్ష నేతగా ‘డేటా చోరీ’ పేరుతో నానా రచ్చ చేశారు. ‘అమ్మో.. మీ ఆధార్ నంబర్లు చంద్రబాబు దగ్గరున్నాయి. అయ్యో... మీ బ్యాంకు ఖాతా వివరాలు చంద్రబాబు దగ్గరున్నాయి ’ అంటూ ఊరూరా ఊదరగొట్టారు! అప్పట్లో తెలంగాణలో ఉన్న అనుకూల సర్కారు ద్వారా హైదరాబాద్ కేంద్రంగా హైడ్రామా నడిపించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల పేర్లతో వలంటీర్ల ద్వారా ప్రజల సమస్త సమాచారాన్ని సేకరించేశారు. దానిని ఒక ప్రైవేటు కన్సల్టెన్సీకి అప్పగించి... రాజకీయ అవసరాల కోసమూ వాడుకుంటున్నారు. అదంతా ఒక ఎత్తు! ప్రజలకు సంబంధించి అవసరమున్న, అవసరం లేని కీలక సమాచారాన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లలో పెట్టేయడం మరొక ఎత్తు! కుటుంబ సభ్యులకు, బంధువులకు, చివరికి భార్యకు కూడా తెలియని/చెప్పని వివరాలూ జగన్ గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. ప్రభుత్వం స్వయంగా కోట్ల రూపాయలు వెచ్చించి డెవలప్ చేయించుకున్న వెబ్‌సైట్లలో ఈ సమగ్ర సమాచారం పెట్టేశారు. ఆ సర్టిఫికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీటిని ఎవరైనా చూడొచ్చు. ఎలాగైనా వాడుకోవచ్చు.
ఇప్పుడైనా చూడొచ్చు..
ఏదైనా దరఖాస్తు చేసుకుంటే, దాని సంగతి ఎక్కడిదాకా వచ్చిందో తెలుసుకోవాలంటే... అప్లికేషన్ నంబరు, ఫోన్ నంబర్ టైప్ చేస్తాం. ఓటీపీ లేదా ఇతర సెక్యూరిటీ దాటిన తర్వాతే ఆ వివరాలు తెలుస్తాయి. మనకు సంబంధించిన సమాచారం మనం మాత్రమే చూసుకునే ఏర్పాటిది. జగన్ సర్కారుకు ఇదేం పట్టలేదు. ‘సెర్చ్’ అనే బటన్ నొక్కితే చాలు! అందరి సమాచారం అందుబాటులోకి వస్తుంది. ఉదాహరణకు... మునిసిపల్ శాఖకు సంబంధించిన సీడీఎంఏ వెబ్‌సైటులోకి వెళ్లి... ‘ఆన్‌లైన్ సర్వీసెస్’ అనే ఆప్షన్ మీద మౌస్ కర్సర్ పెడితే ఒక పాపప్ వస్తుంది. అందులో... మొట్టమొదట ‘ప్రాపర్టీ ట్యాక్స్’ కనిపిస్తుంది. దానిమీద కర్సర్ పెట్టగానే... సబ్ పాప్‌పలో చివర్లో ‘నో యువర్ అప్లికేషన్ స్టేటస్’ మీద క్లిక్ చేస్తే... జిల్లా, ఆ జిల్లాలోని పట్టణాల వివరాలు సెలెక్ట్ చేసుకుంటే చాలు! ఆ తర్వాత... పెళ్లి రిజిస్ర్టేషన్లు, ప్రాపర్టీ నమోదులు, ట్రేడ్ లైసెన్సులు, వాటర్ చార్జెస్, అడ్వర్టైజ్‌మెంట్ ట్యాక్స్ వంటివి డిస్‌ప్లే అవుతాయి. అందులో పెళ్లి రిజిస్ట్రేషన్ చెక్ చేసుకుని... ‘సెర్చ్’ కొడితే చాలు. ఆ జిల్లాలో, సదరు పట్టణంలో రిజిస్టర్ అయిన అన్ని వివాహాలకు సంబంధించిన వివరాలు ప్రత్యక్షమవుతాయి. ఇది అంతటితో ఆగదు! వధూవరుల ఫొటోలు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, మెయిల్ ఐడీ, ఆధార్ కార్డులు, టెన్త్ క్లాస్ మార్కుల లిస్టులు మొత్తం కనిపిస్తాయి. ఆయా డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. అప్లికేషన్ నంబర్ టైప్ చేయాల్సిన అవసరంలేదు. ఓటీపీ కోసం ఫోన్ నంబరు ఇవ్వక్కర్లేదు. పాస్ వర్డు లేదు. కేవలం... మనకు కావాల్సిన సమాచారాన్ని ఎంచుకుని ‘సెర్చ్’ కొడితే చాలు. మొత్తం సమాచారం తెరపైన ప్రత్యక్షం!
ఏ ఒక్కరూ భద్రంగా లేరు
ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 5 కోట్ల 10 లక్షల మంది. రేషన్ కార్డులు కోటి 40లక్షలు. ఒక్కో కార్డులో సగటున ముగ్గురు కుటుంబ సభ్యులు ఉంటారనున్నా 4 కోట్ల 20 లక్షల మంది. మిగిలిన 90 లక్షల మందిలో 10 లక్షల కుటుంబాలు ప్రభుత్వ ఉద్యోగులవి. సగటున ముగ్గురు కుటుంబ సభ్యులు ఉంటారనుకుంటే 30 లక్షల మంది. మిగిలిన 60 లక్షల మంది ట్యాక్స్ పేయర్స్. వీరికి రేషన్ కార్డులు లేకపోయినా వీరందరి వివరాలు, వీరి కార్డులన్నీ ఫొటోలతో సహా మునిసిపల్ కార్యాలయాల్లో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. ఈ సమాచారం దుర్వినియోగమైతే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందనుకుంటున్నారేమో! కానే కాదు! తెలంగాణలోనూ ఇలా లేదు. ఆ రాష్ట్ర వెబ్‌సైట్ల నుంచి ప్రజల డేటా సేకరించడం కుదరదు. మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజల డేటా భద్రంగానే ఉంది. ఏపీలో మాత్రమే తలుపులు తెరిచేశారు. సాధారణంగా ఒక ప్రభుత్వ వెబ్‌సైట్ నుంచో, ఈ-మెయిల్ నుంచో డేటా బయటకు పోయిందంటే హ్యాకింగ్ చేసి తీసుకున్నారని చెబుతారు. కానీ, ఏపీలో హ్యాకింగ్‌లాంటి పెద్ద పనుల అవసరం కూడా లేదు. సింపుల్‌గా ప్రభుత్వ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ప్రజలందరి పాన్ కార్డులు, బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ కార్డులు, పాస్‌పోర్టులు, డ్రైవింగ్ లైసెన్సులు, పెళ్లిఫోటోలు, ఎవరి పేరుతో ఎన్ని ఇళ్లున్నాయి, అన్ని వివరాలు డాక్యుమెంట్లతో సహా తీసుకోవచ్చు.
జగన్‌కు, ప్రభుత్వానికీ తెలిసే..
ఐదేళ్ల నుంచి రాష్ట్ర ప్రజల అడ్రస్ ప్రూఫ్‌లు, ఆధార్, పాన్, పాస్‌పోర్టు, బ్యాంకు ఖాతాలు, ఫొటోలు చోరీకి గురవుతున్నా ఏ ఒక్క ఐఏఎస్ గుర్తించలేకపోయారా? ప్రభుత్వంలోని ఇన్ని వ్యవస్థల్లో ఏ ఒక్క వ్యవస్థ కూడా కనిపెట్టలేకపోయిందా? ఏ ఒక్కరూ కూడా దీన్ని గుర్తించలేదా? గత ఏడాది జూన్‌లో పవన్ కల్యాణ్ తన సభల్లో వలంటీర్ల ముసుగులో జగన్ ప్రభుత్వం ప్రజల డేటా చోరీ చేస్తోందని విమర్శించారు. అప్పుడు ప్రభుత్వం డేటా లీకేజీ లేదని... అదంతా పవన్, చంద్రబాబు కుట్ర అని తప్పించుకుంది. కానీ, డేటా లీకేజీపై ప్రభుత్వానికి, అంటే నేరుగా జగన్‌కే రాతపూర్వకంగా ఫిర్యాదులు అందాయి. కొందరు మేధావులు నేరుగా జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే వెళ్లి సీఎం సన్నిహితులకు సీల్డ్ కవర్లో ఈ వివరాలన్నీ అందజేశారు. స్పందన ద్వారా ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినా వారు తీసుకోలేదు. దాదాపు ఏడాది నుంచి ఈ భారీ డేటా చోరీపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నా స్పందనే లేదు. ఆ తర్వాతే పవన్ డేటా చోరీ అంటూ విమర్శలు చేశారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ డేటా చోరీపై ప్రభుత్వం విచారణ చేపట్టలేదంటే అర్థమేమిటి?.
ప్రభుత్వంతో ఎలాంటి లావాదేవీ జరిపినా, ఎలాంటి దరఖాస్తు సమర్పించినా... అంటే ఉపాధి హామీ పథకంలో కూలి నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడం వరకు వాటికి సంబంధించిన వివరాలు, జత చేసిన పత్రాలన్నీ వెబ్‌సైట్లలో పెట్టేశారు. అంటే... రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాలు, ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్, పాన్ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు ఐడీ కార్డులు, వారికున్న వ్యాధులు, బ్లడ్ గ్రూపులు, సాధారణ ఫొటోలు, పెళ్లి ఫొటోలు, మొబైల్ నంబర్లు, ఇంటి అడ్ర్‌సలు, ఇంట్లో కరెంటు మీటర్ నంబర్లు, పదో తరగతి సర్టిఫికెట్, సంతకాలు, వేలిముద్రలు... ఇలాంటివన్నీ ఓపెన్ చేసేశారు.
సైన్యంలో, రక్షణ రంగంలో పనిచేసే అటెండరు నుంచి అధికారుల వరకు అందరి సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి. కానీ... ఏపీలో మాత్రం వారికీ ‘ప్రైవసీ’ లేకుండా పోయింది.
రిజిస్ర్టేషన్ కార్యాలయాల్లో ప్రజల ఆస్తులకు సంబంధించిన వివరాలను, వేలిముద్రలను డిజిటల్ రూపంలో ‘క్రిటికల్ రివర్’ అనే ప్రైవేటు కంపెనీ చేతిలో పెట్టారు. అలాగే, ఇతర సమాచారాన్ని కూడా ఆ ప్రైవేటు కంపెనీకే మళ్లిస్తున్నారా? వేర్వేరు కంపెనీల్లో భద్రపరుస్తున్నారా... అనేది ప్రభుత్వమే చెప్పాలి.
మరికొన్ని ఉదాహరణలు...
వైఎస్సార్ చేయూత పథకం వెబ్‌సైట్‌లో 26 జిల్లాల్లో కలిపి 15.83 లక్షల మంది లబ్ధిదారులున్నారు. వీరందరి వివరాలు, వారి ఆధార్, రేషన్, ఫొటోలు, ఫోన్ నంబర్లను ఇట్టే తెలుసుకోవచ్చు. ఆ పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రభుత్వ వెబ్‌సైట్ లెక్కల ప్రకారం, వైఎస్సార్ బీమా అనే పథకం కింద వెబ్‌సైటులో ఒక కోటి 20 లక్షల మంది లబ్ధిదారులున్నాయి. వీరందరి బ్యాంకు ఖాతాలు, ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌లతో సహా ఆ వెబ్‌సైట్ నుంచే నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ వివరాల కోసం హ్యాకింగ్‌కు పాల్పడాల్సిన అవసరం లేకుండా దొంగలకు ద్వారాలు తెరిచిపెట్టారు.
గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల వివరాలు వారి సెక్రటేరియట్ కోడ్, క్లస్టర్ ఐడీతో పాటు మొబైల్ నంబర్లు, ఉద్యోగులకు జీతభత్యాలందే సీఎ్‌ఫఎంఎస్ ఐడీ సహా అన్ని వివరాలు ప్రభుత్వ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నాయి. ఈ సైట్ల నుంచి సమాచారం తీసి కొందరు ప్రైవేటు వెబ్‌సైట్లలో ఉంచుతున్నారు. సచివాలయం.ఇన్ అనే వెబ్‌సైటులో సచివాలయ ఉద్యోగుల పర్సనల్ వివరాలు మొత్తం ఉన్నాయి. గత ఏడాది వలంటీర్లను అడ్డం పెట్టుకుని జగన్ డేటా చోరీ చేస్తున్నాడంటూ పవన్ కల్యాణ్ విమర్శించిన తర్వాత ఈ వెబ్‌సైటు నిర్వాహకులు ఆ ఉద్యోగుల ఫోన్ నెంబర్ల స్థానంలో కొన్ని అంకెలు ఉంచి, మరికొన్ని అంకెలు కనపడకుండా స్టార్లు పెట్టారు.
Updated Date - May 02 , 2024 | 12:08 PM