Chandrababu : బాధ్యతగా ఉందాం!
ABN, Publish Date - Nov 13 , 2024 | 05:52 AM
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం దెబ్బతిన్న వ్యవస్థలను పునర్నిర్మిస్తూ ముందుకెళుతోందని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
బూతులు తిడితే ప్రజలు స్వాగతించరు.. వైసీపీ ఎమ్మెల్యేల్లా చేయొద్దు: సీఎం
‘‘ప్రజలకు ఏం అవసరమో, వారికి ఏం చేశామో చెప్పడానికి అసెంబ్లీ ఒక వేదిక. అసెంబ్లీకి తాము పంపిన ప్రతినిధి తమ కోసం ఏం మాట్లాడుతున్నారని ప్రజలు ఎప్పుడూ గమనిస్తుంటారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా బూతులు తిడితే ప్రజలు స్వాగతించరు. మనతో పాటు వైసీపీ వాళ్లు కూడా గెలిచారు కాబట్టి అసెంబ్లీకి రావాలి. ప్రజా సమస్యలపై చర్చించాలి. కానీ రాలేదు. కూటమి ఎమ్మెల్యేలు కూడా వైసీపీ ఎమ్మెల్యేల్లా చేయవద్దు. అలా చేస్తే వాళ్లలాంటి పరిస్థితే మనకూ వస్తుంది’’
- కూటమి ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం మన విధి
వ్యవస్థలన్నీ పతనావస్థకు చేరాయి
150 రోజుల్లో గాడిన పెట్టాం
ఇసుక, మద్యం జోలికి ఎవరూ వెళ్లొద్దు
ప్రతి ఎమ్మెల్యే జాగ్రత్తగా ఉండాలి
నియోజకవర్గానికో ఇండస్ట్రియల్ పార్కు
ఎమ్మెల్యేలే వాటికి చైర్మన్లు
సచివాలయ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ
కూటమి సభ్యుల శిక్షణ కార్యక్రమం,
ప్రత్యేక సమావేశంలో చంద్రబాబు
అమరావతి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం దెబ్బతిన్న వ్యవస్థలను పునర్నిర్మిస్తూ ముందుకెళుతోందని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘నేను నాలుగో సారి సీఎం అయ్యా. కానీ ఎప్పుడూ ఇంతలా వ్యవస్థల విధ్వంసం చూడలేదు. వ్యవస్థలన్నీ పతనావస్థకు చేరాయి. లోతుకు వెళ్లే కొద్దీ భయంకర విషయాలు బయటపడుతున్నాయి. వాటన్నింటినీ 150 రోజుల్లో గాడిన పెట్టాం. ఇక వేగం పెంచాల్సిన అవసరం ఉంది’’ అని చంద్రబాబు స్పష్టంచేశారు. మంగళవారం మధ్యాహ్నం వెలగపూడిలోని అసెంబ్లీలో ఎన్డీయే ఎల్పీ సమావేశాన్ని ఆయన నిర్వహించారు. అంతకుముందు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో... బడ్జెట్‌పై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలోనూ చంద్రబాబు ప్రసంగించారు. ఇసుక, మద్యం జోలికి వెళ్లొద్దని ఎమ్మెల్యేలను ఆదేశించారు. ‘‘అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు కదా....అని అనుకోవద్దు. ప్రతిపక్ష పార్టీకి బాధ్యత లేదు. కానీ మనకు బాధ్యత ఉంది. మనం ప్రజలకు జవాబుదారీగా పని చేద్దాం’’ అని కూటమి ఎమ్మెల్యేలకు చంద్రబాబు హితవు పలికారు. ‘‘అధికారంలోకి రాగానే ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశాం. ఐదేళ్ల విధ్వంసాన్ని ప్రజలనకు ఆ శ్వేతపత్రాల ద్వారా తెలియజేశాం. ప్రజలు గెలవాలి... రాష్ట్రం నిలవాలి అని ఎన్నికల ముందు పిలుపునిచ్చాం. ప్రజలు మన పక్షాన నిలిచి గెలిపించారు.. ఇప్పుడు వారి ఆకాంక్షలను మనం నెరవేర్చాలి’’ అని నిర్దేశించారు. కేంద్రం సహకరించకుంటే చాలా ఇబ్బందులు పడేవాళ్లమని, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకపోయేవారమని తెలిపారు. ‘‘మనం అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లో అనేక హామీలు అమలు చేసి, పలు కార్యక్రమాలు చేపట్టాం. ఏ రాష్ట్రంలో ఇవ్వనిస్థాయిలో 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాం. అన్న క్యాంటీన్లతో పాటు దీపావళి నుంచి దీపం - 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా అందిస్తున్నాం. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతోపాటు అభివృద్ధిని కూడా జోడెద్దుల బండి మాదిరి ముందుకు తీసుకెళుతున్నాం. అభివృద్ధి చేస్తే సంపద పెరుగుతుంది. సంపద పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు మరిన్ని అమలు చేయవచ్చు. ఎస్సీ వర్గీకరణపైనా ఇప్పటికే ఎమ్మెల్యేలతో మాట్లాడాం. జిల్లా వారీగా ఏబీసీ కేటగిరీలు పెట్టి జిల్లా, జోన్, స్టేట్ వారీగా కమిటీలు వేసి అమలు చేస్తాం. ప్రతి ఒక్కరూ పేదలతో మమేకమవ్వాలి. వారి కనీస అవసరాలు తీర్చాలి’’ అని ముఖ్యమంత్రి కోరారు. ఇంకా చంద్రబాబు ఏమన్నారంటే..
ప్రజా సమస్యలపై...
‘‘ప్రతి ఎమ్మెల్యే జాగ్రత్తగా ఉండాలి. బిల్లులు, పాలసీలపై అధ్యయనం చేయాలి. పబ్లిక్ గవర్నెన్స్‌లో ఎమ్మెల్యేలనూ భాగస్వాములను చేస్తాను. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నాం. 20247 నాటికి 43 వేల డాలర్ల తలసరి ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే ఇసుక, భూ ఆక్రమణల నిరోధక చట్టం, మద్యం పాలసీలు ప్రవేశపెట్టాం. క్లీన్ ఎనర్జీ, డ్రోన్, ఎలకా్ట్రనిక్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్‌ఫ్రా లపై పాలసీలు తెచ్చాం. ఇలా 10 పాలసీల ఆధారంగా విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. మనం తెచ్చిన పాలసీలు దారిద్రాన్ని నిర్మూలించి... ఉద్యోగ కల్పనకు ఉపయోగపడతాయి. ఒక కుటుంబం.. ఒక పారిశ్రామికవేత్త అనే నినాదం తీసుకొచ్చాం. రతన్ టాటా పేరుతో ఇన్నోవేషన్ హబ్‌ను అమరావతిలో ఏర్పాటు చేస్తాం. విశాఖ, రాజమండ్రి, విజయవాడ,అనంతపురంలో కూడా హబ్‌లు ఉంటాయి. టాటా సంస్థ 10వేల ఉద్యోగాల కల్పనకు ముందుకొచ్చింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, సత్యం వంటి దాదాపు 10 పెద్ద కంపెనీలు రాష్ట్రానికి తీసుకొస్తాం’’.
సచివాలయాల పునర్‌వ్యవస్థీకరణ
‘‘ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్కు ఉంటుంది. ఎమ్మెల్యేలే దానికి చైర్మన్లుగా ఉంటారు. అక్కడ పరిశ్రమలు పెట్టించే బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకోవాలి. అమరావతికి కేంద్రం.... ఏడీజీ, ప్రపంచ బ్యాంకు ద్వారా రూ.15 వేల కోట్ల ఆర్థికసాయం అంది ంచేందుకు ముం దుకొచ్చింది. సచివాలయాలను రీ - ఆర్గనైజ్ చేయాల్సి ఉంది. జవాబుదారీతనాన్ని ఏర్పరిచి అన్ని సచివాలయాలను అంతర్భాగం చేస్తూ మరింతగా సేవలందించేలా చేస్తాం. పంచాయతీల్లో చేపట్టిన పనులు కూడా జనవరిలోపు పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పటికే ఆదేశాలిచ్చారు. రూ.860 కోట్లతో రాష్ట్రంలోని రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.’’
నేనూ నేర్చుకున్నా....
‘‘ఎమ్మెల్యేల కోసం ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమం నుంచి నేనూ రెండు విషయాలు నేర్చుకున్నాను. గ్రీన్ బడ్జెట్‌తో పాటు సస్టైనబుల్ బడ్జెట్‌పైనా కొంత అవగాహన వచ్చింది. ప్రకృతి అవసరాల నిమిత్తం ఖర్చుచేసే నిధులతో పాటు సోలార్, విండ్, బయోగ్యాస్ వంటి ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా కలుపుకొని గ్రీన్ బడ్జెట్ ప్రవేశపెడితే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. వచ్చే ఏడాది నుంచి దీనిపై దృష్టి పెడదాం. అలానే సస్టైనబుల్ బడ్జెట్ కూడా రాష్ట్రానికి అవసరమే’’.
ఇసుక పాలసీ చదివారా?
ఇసుక పాలసీని అందరూ చదివి అర్థం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. చీరాల ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ...ఇసుక పాలసీ బాగోలేదన్నారు. చంద్రబాబు వెంటనే స్పందిం చి.. పాలసీ ఏ విధంగా బాగోలేదో చెప్పాలన్నారు. పాలసీ మీరు చదివారా అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఇసుక, మద్యం జోలికి ఎమ్మెల్యేలు వెళ్లొద్దని గట్టిగా హెచ్చరించారు. ఎమ్మెల్యేలకు టీటీడీ దర్శన కోటా పెంచాలని ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కోరారు. దీనిపై మంత్రి లోకేశ్ కల్పించుకుటూ.. ఈ నెల 18న జరిగే టీటీడీ బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం ఉంటుందన్నారు. భూసర్వేలో తలెత్తుతున్న సమస్యలను కొందరు ప్రస్తావించగా, గ్రామసభల్లో వాటిలో కొన్ని పరిష్కారం అవుతు న్నాయని రెవెన్యూమంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. గ్రామసభ నిర్ణయాలతోపాటు గతంలో టీడీపీ అనుసరించిన విధానాలపైనా దృష్టిపెట్టాలని మంత్రికి సీఎం సూచించారు.
బాబు భేష్
ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొనియాడారు. ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడానికి కూడా ఇదే కారణమన్నారు. కానీ ఇప్పుడు దగ్గర నుంచి చూస్తుంటే రాష్ట్రం కోసం బాగా కష్టపడుతున్నారని అన్నారు. ఆయన దగ్గర నుంచి ఎమ్మెల్యేలంతా నేర్చుకోవాలని సూచించారు. ఆయన ముందుచూపు రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడుతుందని అన్నారు. ఇదే సమయంలో సీఎం చంద్రబాబు కల్పించుకుని.... తాను, పవన్ కల్యాణ్ చెప్పింది ఎమ్మెల్యేలు ఆచరించాల్సిందేనని, 2029లోనూ మీరంతా ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీకి రావాలని తాము కోరుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు.
విద్యార్థులు, మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్
రాబోయే రోజుల్లో వర్చువల్ వర్కింగ్ ఉంటుందని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారనీ, వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని ఆయన అనగా, పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. చదువుకునే విద్యార్థులకు, మహిళలకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి పనులు కల్పించాలని సూచించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఈ అంశంపై వర్క్ అవుట్ చేస్తున్నామని తెలిపారు.
విధానాలతో మార్పు..
‘‘మనం (ఎమ్మెల్యేలను ఉద్దేశించి) సభలో పబ్లిక్ పాలసీలు రూపొందిస్తాం. ఈ పాలసీలు ప్రజా జీవితంలో మార్పులు తెస్తాయి. మనం తెచ్చే పాలసీలే రాష్ట్రంలోని సమస్యలకు శాశ్వత పరిష్కారాలను చూపిస్తాయి. గతంలో ఒక సబ్జెక్టుపై ఎంత సమయమైనా చర్చించేవాళ్లం. రానురాను ఎమ్మెల్యేలకు సబ్జెక్టు నేర్చుకోవాలనే ఆసక్తి తగ్గుతోంది. ఎమ్మెల్యేలు నిరంతరం నేర్చుకోవాలి. శాఖల్లో ఏం జరుగుతుందో మీకు అవగాహన లేకపోతే నియోజకవర్గానికి ఏం అవసరమో తెలియదు. బడ్జెట్ సమావేశాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం.’
Updated Date - Nov 13 , 2024 | 05:52 AM