ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chandrababu : వ్యక్తిగత అవసరాలకు ఇసుక పూర్తి ఉచితం

ABN, Publish Date - Sep 20 , 2024 | 04:43 AM

ఉచిత ఇసుక హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వ్యక్తిగత అవసరాల కోసం వాగులు, వంకల నుంచి ఇసుకను పూర్తిగా ఉచితంగా తీసుకెళ్లవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

  • వాగులు, వంకల నుంచి సమీప గ్రామాల

  • ప్రజలు తీసుకెళ్లొచ్చు: ముఖ్యమంత్రి

  • వారిని అధికారులు ఇబ్బందిపెట్టకూడదు

  • ఇదే సమయంలో అక్రమ రవాణాకు చెక్‌

  • విజిలెన్స్‌ వ్యవస్థను పటిష్ఠం చేయాలి

  • ఇసుక పోర్టల్‌ను ఆవిష్కరించిన సీఎం

అమరావతి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఉచిత ఇసుక హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వ్యక్తిగత అవసరాల కోసం వాగులు, వంకల నుంచి ఇసుకను పూర్తిగా ఉచితంగా తీసుకెళ్లవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గురువారం ఆయన రాష్ట్ర సచివాలయంలో ఉచిత ఇసుక నూతన పోర్టల్‌ను ఆవిష్కరించారు. ఈ పోర్టల్‌ ద్వారా ప్రజలు 24 గంటలూ ఇసుక బుకింగ్‌ చేసుకునే అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా, ఎక్కడి నుంచైనా, ఏ సమయంలోనైనా ఇసుక బుకింగ్‌ చేసుకోగలిగే విధంగా పోర్టల్‌ విధానాన్ని నవీకరించాలన్నారు. అయితే తర్వాతి రోజుకు అందుబాటులో ఉన్న ఇసుక మాత్రమే బుక్‌ అవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజల సౌకర్యార్థం దానిని వారం రోజులకు పెంచాలని ఆయన ఆదేశించారు. దీనివల్ల 7 రోజుల్లో అందుబాటులో ఉండే ఇసుకను ఎవరైనా బుక్‌ చేసుకునే వెసులుబాటు లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఇసుకను పొందగలిగే విధంగా పారదర్శకతకు పెద్దపీట వేయాలన్నారు.

చిన్న చిన్న వాగులు, వంకల్లో ఉండే ఇసుకను సమీప గ్రామాల ప్రజలు ఉచితంగా తీసుకెళ్లే విషయంలో ఇబ్బందులు పెట్టవద్దని, వారు తమ వ్యక్తిగత అవసరాల కోసం ఎలాంటి రుసుం చెల్లించకుండా ఇసుక తీసుకెళ్లగలిగేలా నిబంధనలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అదే సమయంలో అక్రమ రవాణా, అక్రమ మైనింగ్‌కు అవకాశం లేకుండా అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. విజిలెన్స్‌ వ్యవస్థను పటిష్ఠం చేయాలని స్పష్టం చేశారు. గనులు, భూగర్భశాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. నూతన ఇసుక పోర్టల్‌ ద్వారా ఇసుక సరఫరాపై వివిధ దశల్లో అనుక్షణం నిఘా ఉంటుందని చెప్పారు. అధికారులు మొదలుకొని రవాణాదారుల వరకు ఎవరూ తప్పులు చేయలేని విధంగా పోర్టల్‌ను రూపొందించినట్లు వివరించారు. మరోవైపు.. ఇసుక సరఫరా విధానాన్ని థర్డ్‌ పార్టీ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ తనిఖీలు నిర్వహిస్తుందని చెప్పారు. ఉచిత ఇసుక విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా టోల్‌ఫ్రీ నంబరు 1800 599 4599కు లేదా ఈ-మెయిల్‌ dmgapsan-dcomplaints@yahoo.com ద్వారా ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు.

ఈ ఫిర్యాదులపై తగు చర్యలు తీసుకుని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల నుంచి తిరిగి సమాచారం అందిస్తారని సీఎంకు మంత్రి వివరించారు. గనులు, భూగర్భ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌కుమార్‌ మీనా మాట్లాడుతూ.. రాష్ట్రమంతా ఒకే విధంగా రవాణా చార్జీలు ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇసుక రవాణా లారీల యజమానులు ఎక్కువ మొత్తాలను వసూలు చేస్తే చర్యలు తీసుకునేలా నిబంధనలను రూపొందించామన్నారు. లారీలకు జీపీఎస్‌ విధానాన్ని అనుసంధానం చేయడం ద్వారా అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ఉచిత ఇసుక సరఫరాపై ఎప్పటికప్పుడు వినియోగదారుల స్పందన తెలుసుకుంటామని తెలిపారు.

Updated Date - Sep 20 , 2024 | 04:43 AM