CM Chandrababu: దేవరపల్లి రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి..
ABN, Publish Date - Sep 11 , 2024 | 10:03 AM
దేవరపల్లి రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా, దేవరపల్లి మండలం, చిలకావారిపాకలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
అమరావతి: దేవరపల్లి రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా, దేవరపల్లి మండలం, చిలకావారిపాకలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లారీ బోల్తా కొట్టడంతో ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. లారీలో ప్రయాణిస్తున్న కూలీలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందని చంద్రబాబు అన్నారు. గాయపడిన వారికి అందుతున్న వైద్యంపై సీఎం ఆరా తీశారు. మంచి వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జీడిపిక్కల లోడ్‍తో లారీ వెళుతుండగా అర్థరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు అన్నారు.
తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం వద్ద మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీడిగింజల లోడుతో ఓ డీసీఎం లారీ టీ నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి నిడదవోలు మండలం తాడిమల్ల వెళుతోంది. ఈ క్రమంలోనే లారీ చిన్నాయిగూడెం వద్దకు రాగానే బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏకంగా ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఒక వ్యక్తికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చిన్నయగూడెం శివారులో డీసీఎం వాహనం అదుపు తప్పి పంట కాలువలో బోల్తా పడింది. ప్రమాద సమయంలో వ్యాన్‌లో 10 మంది ఉన్నారు. జీడీ గింజల బస్తాల కింద చిక్కుకోవడంతో ఊపిరాడక ఏడుగురు మృతి చెందారు. కేబిన్‌లో ఉన్న వారు అందరూ సురక్షితంగా ఉన్నారు.
ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న స్థానికుల సహాయంతో మృతదేహాలను దేవరపల్లి పోలీసులు వెలికి తీశారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు అందరూ నిడదవోలు మండలం తాడిమల్ల గ్రామానికి చెందినవారు. ఈ ప్రమాదంలో తమ్మి రెడ్డి సత్యనారాయణ (45), 2.దేశాభత్తుల వెంకటరావు(40), 3.బొక్కా ప్రసాద్(32), 4.పెనుగుర్తి చిన్న ముసలయ్య(35), 5. కత్తివ కృష్ణ(40), 6.కత్తివ సత్తిపండు (40), 7. తాడి కృష్ణ(45)లు మరణించారు.
Updated Date - Sep 11 , 2024 | 10:03 AM