CM Chandrababu: పారిశ్రామిక పాలసీ రూపకల్పనపై చంద్రబాబు సమీక్ష..
ABN, Publish Date - Aug 12 , 2024 | 08:31 PM
వైసీపీ(YSRCP) పాలనలో పారిశ్రామికంగా రాష్ట్రం ఎంతో వెనకబడిందని సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఆక్షేపించారు. గత ప్రభుత్వ విధానాలన్ని మార్చి.. పరిశ్రమలకు ఏపీని కేరాఫ్‌గా చేయడమే తమ సంకల్పమని బాబు స్పష్టం చేశారు.
అమరావతి: వైసీపీ(YSRCP) పాలనలో పారిశ్రామికంగా రాష్ట్రం ఎంతో వెనకబడిందని సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఆక్షేపించారు. గత ప్రభుత్వ విధానాలన్ని మార్చి.. పరిశ్రమలకు ఏపీని కేరాఫ్‌గా చేయడమే తమ సంకల్పమని బాబు స్పష్టం చేశారు. సోమవారం ఆయన సచివాలయంలో పారిశ్రామిక పాలసీ రూపకల్పనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో టాప్ 5 రాష్ట్రాలతో పోటీపడేలా కొత్త పారిశ్రామికాభివృద్ధి విధానం ఉండాలని పేర్కొన్నారు. పాలసీ రూపకల్పనలో నీతి ఆయోగ్ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు. 15 శాతం ఓవర్ ఆల్ గ్రోత్ రేట్ సాధన లక్ష్యంగా నూతన పాలసీని తయారు చేయాలని దిశా నిర్దేశం చేశారు.
బ్రాండ్ ఇమేజ్ పెంచాలి..
"వైసీపీ పాలనలో ఏపీలో పరిశ్రమలు కునారిల్లే స్థితికి దిగజారాయి. జగన్(Jagan) సర్కార్ వైఫల్యంతో పరిశ్రమల స్థాపనలో ఏపీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది. దాన్ని తిరిగి తీసుకురావాలి. 100 రోజుల్లోగా పారిశ్రామికాభివృద్ధి కోసం ముఖ్య పాలసీలు అమలు చేయాలి. ఈ నెల16న పారిశ్రామిక వేత్తలతో సమావేశం నిర్వహిస్తాం. 2014-19 మధ్య కాలంలో పరిశ్రమల స్థాపనలో ఏపీ ముందంజలో ఉండేది. ప్రభుత్వం కల్పించే వివిధ రాయితీలు, మౌలిక సదుపాయాల కల్పన, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాల్లో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉండేది. మళ్ళీ అలాంటి పరిస్థితులు కల్పించి పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వంపై నమ్మకం కలిగే రీతిలో నూతన పారిశ్రామిక విధానాన్ని రూపకల్పన చేయాలి. పీపీపీ, పి-4 విధానాలను నూతన విధానంలో పొందుపర్చాలి. పరిశ్రమల ఏర్పాటుకు అవసమైన అనుమతులు వేగంగా ఇవ్వాలి. అలాంటప్పుడే పరిశ్రమలు త్వరగా ఏర్పాటు అవుతాయి. దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా10 ఓడరేవులు,10 విమానాశ్రయాలు, మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యాలు, లాజిస్టిక్ సౌకర్యాలు పూర్తి స్థాయిలో ఏపీలో అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటినీ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే పారిశ్రామికాభివృద్ధిలో దేశంలోనే ఏపీ నంబర్ 1 స్థానంలో నిలుస్తుంది" అని చంద్రబాబు పేర్కొన్నారు.
Updated Date - Aug 12 , 2024 | 08:31 PM