ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu : తప్పు చేయలేదు!

ABN, Publish Date - Nov 17 , 2024 | 05:20 AM

ఎలాంటి కేసూ లేకున్నా, ఏ తప్పూ చేయకున్నా గత వైసీపీ ప్రభుత్వంలో తనను అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

అందుకే ధైర్యంగా నిలబడ్డాను అభివృద్ధి.. సంక్షేమం!

1995లో నేను తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాను. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఇంటర్నెట్‌ విప్లవం జరిగింది. వీటిని ప్రజల కోసం ఉపయోగించాలనుకున్నాను. ప్రజలతో నా ఆలోచనలను పంచుకుని వేర్వేరు కార్యక్రమాలను చేపట్టాను. 1999లో కూడా విజయం సాధించాను. అయితే ప్రజల ఆలోచనలను దాటి ముందుకు నడిచినందుకు రెండుసార్లు ఓడిపోయాను. దానివల్ల అభివృద్ధి ఆగిపోయింది. నరేంద్ర మోదీ అలా కాదు. ప్రజలను తనతో పాటు వెంట తీసుకుని ముందుకు వెళుతున్నారు. ఇప్పుడు నాకు ఒక స్పష్టత వచ్చింది. అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజలను నాతో పాటు ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాను.

మాకు కొత్త కాదు..

కేంద్రంలో మేం కీలక పాత్ర పోషించడం ఇదే తొలిసారి కాదు. వాజపేయి ప్రభుత్వానికి ఎలాంటి షరతులూ లేకుండా, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆరున్నరేళ్లు మద్దతు ఇచ్చాం. గతంలో పార్లమెంట్‌లో ప్రతిపక్ష పాత్ర పోషించాం. ఆ సమయలో బీజేపీకి రెండు సీట్లే వస్తే టీడీపీకి 35 సీట్లు వచ్చాయి. వాజపేయి బీజేపీని నిర్మిస్తే మోదీ పటిష్ఠం చేసి సుస్థిరం చేశారు. ఒకప్పుడు 2 సీట్లు ఉన్న బీజేపీ ఇప్పుడు పదకొండేళ్లుగా పరిపాలిస్తోంది. భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం కొనసాగుతుంది.

ఏ కేసూ లేకున్నా గత సర్కారు అరెస్టు చేసింది

ప్రజలు నాకు అండగా నిలిచారు

ఏపీలో మేం గెలుస్తామని ముందే ఊహించా

దేశం కోసం మోదీతో కలిసి పనిచేస్తున్నాం

అభివృద్ధి, సంక్షేమం.. ప్రజలతో కలిసి ముందుకు!

సోషల్‌ సైకోలకు అడ్డుకట్ట వేయాల్సిందే

లేదంటే భవిష్యత్తులో చాలా నష్టం

సంకీర్ణంలో చిన్నచిన్న సమస్యలు మామూలే

కలిసి మాట్లాడుకుంటే అన్నిటికీ పరిష్కారం

హిందూస్థాన్‌ టైమ్స్‌ సదస్సులో చంద్రబాబు

ఇదీ మోదీ బలం..

మహోన్నత దేశం కోసం మేం బీజేపీతో కలిసి పనిచేస్తున్నాం. మోదీ బలమైన నాయకుడు. ఆయనది ఆధునిక ప్రగతి శీల దృక్పథం. సంస్కరణలు, ఇంటర్నెట్‌ విప్లవం, టెక్నాలజీలను ఉపయోగించి తర్వాతి స్థాయి విప్లవాన్ని నరేంద్రమోదీ సృష్టించారు. ప్రపంచంలో 7.5-8 శాతం జీడీపీ వృద్ధి రేటు ఉన్న దేశం భారత్‌ మాత్రమే. ఇది మోదీ నాయకత్వంలో భారత దేశం పుంజుకున్న శక్తి. కలిసికట్టుగా కృషి చేస్తే 10 శాతం మించి జీడీపీ వృద్ధి సాధించే అవకాశాలున్నాయి.

న్యూఢిల్లీ, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఎలాంటి కేసూ లేకున్నా, ఏ తప్పూ చేయకున్నా గత వైసీపీ ప్రభుత్వంలో తనను అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తప్పు చేయలేదన్న ధైర్యంతోనే బలంగా నిలబడ్డానన్నారు. గత ఎన్నికల్లో ఏపీలో కూటమి గెలుస్తుందని నూటికి నూరు శాతం ముందే ఊహించానని తెలిపారు. ఓట్లు చీలిపోకూడదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ముందుకు వచ్చారని, ఆ తర్వాత బీజేపీ కూడా కూటమిలో చేరిందని చెప్పారు. దేశ భవిష్యత్‌ కోసం ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పని చేస్తున్నామని వివరించారు. మోదీ హయాంలో భారతదేశం అగ్రరాజ్యంగా మారి తీరుతుందన్నారు. శనివారం ఢిల్లీలో హిందూస్థాన్‌ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సమ్మిట్‌లో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ తల్లి, చెల్లిపై ఆ పార్టీ నాయకులే సోషల్‌ మీడియాలో అత్యంత దారుణంగా, వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్‌లో తీరని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలో మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెడుతున్నవారిని నియంత్రించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. హిందూస్థాన్‌ టైమ్స్‌ నేషనల్‌ పొలిటికల్‌ ఎడిటర్‌ సునేత్రా చౌదరి అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు ఇచ్చిన సమాధానాలివి.


మీరు నెల రోజులకుపైగా జైలులో గడిపారు.

జైలు జీవితం మనల్ని మార్చేస్తుందని

చాలామంది అంటారు. మీరేమంటారు?

చంద్రబాబు: నా జీవిత కాలంలో మర్యాదల్ని, పద్ధతులను పాటించాను. చాలా క్రమశిక్షణతో ఉన్నాను. ఎన్నో ప్రభుత్వ విధానాలను నిర్ణయించాను. ఎవరూ నన్ను వేలె త్తి చూపలేదు. కొందరు కోర్టుకు కూడా వెళ్లాలనుకున్నా నాకు వ్యతిరేకంగా ఏమీ రుజువు చేయలేకపోయారు. కానీ... గత ప్రభుత్వంలో ఎలాంటి కేసు లేకుండా నన్ను అరెస్టు చేశారు. నోటీసు ఇచ్చారు. నా జీవితంలో ఇలాంటిది జరగకూడదని నేను అనుకున్నాను. నేనెంత జాగ్రత్తగా ఉన్నా అది జరిగింది. నేను తప్పు చేయలేదు. అందుకే పూర్తి విశ్వాసంతో నిలబడ్డాను. భయపడకూడదని, నైతికంగా కుంగిపోకూడదని అనుకున్నాను. 53 రోజుల జైలు జీవితాన్ని ధైర్యంతో, విశ్వాసంతో గడిపాను. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు 80 దేశాల్లో నాకు మద్దతుగా జనం రోడ్లపై నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రజలు అండగా నిలిచారు. దీంతో మరింత శక్తి పుంజుకున్నాను. మరింత పట్టుదలతో ప్రజల కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నాను.

ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో నిజంగా ఏమి జరిగింది?

జాతీయ స్థాయిలో మోదీ నాయకత్వం వల్ల ఎన్డీయే విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో అదనంగా మాకు తోడ్పడింది. గత ప్రభుత్వం పట్ల ప్రజలు పూర్తిగా నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఓట్లు చీలిపోకూడదని ముందుకు వచ్చారు. ఆ తర్వాత బీజేపీ కూడా చేరింది. మూడు పార్టీలు చేరడం వల్ల ప్రజలకు విశ్వాసం పెరిగింది. 93 శాతం స్ర్టైక్‌ రేట్‌, 57శాతం ఓటు శాతంతో విజయం సాధించాం. ప్రతిపక్షానికి కేవలం 11 సీట్లే వచ్చాయి. కొన్ని స్థానాల్లో మాకు బలహీనమైన అభ్యర్థులు ఉండడం వల్ల వారికి ఆ మాత్రం దక్కాయి. ప్రజలు చాలా తెలివైనవారు. అన్నీ గమనిస్తారు. వారు బయటపడరు. సరైన సమయంలో బయటకు వచ్చి నిర్ణాయక తీర్పు ప్రకటిస్తారు. ఏపీలో అదే జరిగింది.

బీజేపీ 240 సీట్లకే పరిమితమవుతుందని ఊహించారా?

బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తుందని అనుకున్నాం. ఆంధ్రప్రదేశ్‌ గురించి మాకు పూర్తి స్పష్టత ఉన్నది. ఏకపక్ష ఎన్నికలు జరుగుతాయని అందరూ ఊహించారు. కొన్ని సర్వేలు వక్రీకరించి చూపాయి. హేతుబద్ధత అవసరం.

మీ మంత్రుల్లో ఒకరిపై, పరిస్థితులపై పవన్‌కల్యాణ్‌ కొంత విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నట్లుంది! సంకీర్ణ ధర్మం అంటే ఏమిటి?

ఒక కుటుంబంలో ఎప్పుడూ ఇలాంటివి ఉంటాయి. ఏకాభిప్రాయ సాధన ఎలా తేవడం అనేది ఎంతో ముఖ్యం. ఒకరు మరొకరిని ఎలా గౌరవించుకుంటారన్నది ముఖ్యం. రాజకీయాల్లో కూడా ఇవే సూత్రాలు వర్తిస్తాయి. కొన్నిసార్లు కొందరు వేరుగా స్పందిస్తారు. ఏదో ఒక సమాచారం ఆధారంగా మాట్లాడతారు. కానీ మాట్లాడుకుంటే అన్నీ పరిష్కారమవుతాయి. అదే మేము చేస్తున్నాం. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకున్నంత వరకూ మేము కలిసి ఉంటాం, కలిసి పనిచేస్తామన్న విశ్వాసం మాకుంది.

తమిళనాడు సీఎం స్టాలిన్‌లాగే మీరు కూడా మరింతమంది పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. దక్షిణాదిన ఎంత మంది పిల్లలుండాలి?

గతంలో నేను బ్రేక్‌ సైలెన్స్‌- టాక్‌ ఎబౌట్‌ ఎయిడ్స్‌ అనే నినాదాన్ని ఇచ్చాను. ఇప్పుడు బ్రేక్‌ సైలెన్స్‌-టాక్‌ ఎబౌట్‌ పాపులేషన్‌ మేనేజ్మెంట్‌ అని పిలుపునిస్తున్నాను. యూరప్‌, చైనా, జపాన్‌ సహా అనేక దేశాల్లో వయోధికులు ఎక్కువై పోయారు. ప్రస్తుతం దక్షిణాదిన ఈ సమస్య ప్రారంభమైంది. 1950లో ఫెర్టిలిటీ రేటు 5.6-6 ఉండేది. ఇప్పుడు 1.6 మాత్రమే. ఇది ఇంకా తగ్గితే సమస్య మొదలవుతుంది. అందుకే పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌ను ప్రమోట్‌ చేయాలనుకుంటున్నాను. అలా చేస్తే ప్రపంచంలో మనల్ని కొట్టేవారే ఉండరు. దేశంలో 145 కోట్ల జనాభా ఉంది. సరిగా ప్లాన్‌ చేేస్త 30-40 కోట్ల మంది భారతీయులు ప్రపంచంలో అన్ని మూలలకు వెళ్లి పనులు చేస్తారు. దేశానికి ఆదాయం తీసుకొస్తారు. బ్రిటీష్‌ వాళ్లు ఎలాగైతే మనదగ్గరికి వచ్చి పరిపాలించారో, మనం కూడా అలాగే ప్రపంచ దేశాలకు వెళ్లి ఆ దేశాలను ఏలవచ్చు.

సోషల్‌ మీడియాలో బ్రౌజింగ్‌ చేస్తారా?

చంద్రబాబు: సోషల్‌ మీడియాలో ఏం జరుగుతుందో చూసే సమయం నాకు ఉండదు. కానీ గవర్నెన్స్‌కు అవసరమయ్యే వాటిని ఉపయోగించుకుంటున్నాము. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో వాట్సాప్‌ గవర్నెన్స్‌ను తీసుకొస్తున్నాం. దీని ద్వారా అన్ని రకాల సమస్యలను పరిష్కరించేందుకు, పౌరసేవలను చివరి వ్యక్తి వరకు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ రోజుల్లో డేటా అంటే సంపద. క్వాలిటీ డేటాతో అద్భుతాలు సాధించవచ్చు. ఏఐ, డీప్‌ టెక్నాలజీతో వ్యవసాయం, పశువైద్యం, ఆరోగ్యం వంటి రంగాల్లో నిజమైన, కచ్చితమైన పరిష్కారాలను సాధించవచ్చు. ఏఐ, డీప్‌ టెక్నాలజీతో ప్రపంచంలో ఏ మూలన ఉన్నా స్మార్ట్‌ఫోన్‌తో ఏ పనులైనా చేసుకోవచ్చు.


ఎన్డీయే 3.0 ప్రత్యేకత ఏమిటి?

చంద్రబాబు: ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్టీయే హయాంలో భారతదేశానికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. గత పదేళ్లుగా ఆయన భారత్‌ ప్రాధాన్యం పెంచారు. ఇప్పుడు ప్రపంచంలో భారత్‌ ముద్ర బలంగా ఉన్నది. 2047 కల్లా వికసిత్‌ భారత్‌ ఏర్పడాలని మోదీ కృషి చేస్తున్నారు. ఆయన నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో మొదటి లేదా రెండో స్థానాన్ని సాధించగలదనే పూర్తి విశ్వాసం నాకుంది. ఇప్పటికే భారత్‌ మూడో స్థానాన్ని సాధించడం ఖాయమైంది.

దేశ ప్రగతికి ఇవీ సూచనలు...

దైనందిన జీవితంలో అన్ని పనులలో డీప్‌ టెక్నాలజీని ప్రవేశపెట్టాలని, అప్పుడే దేశం గొప్పగా ఎదుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఈ లక్ష్యాల సాధన దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు.

దేశ సమగ్రాభివృద్ధికి సూచనలివీ

‘జీరో పావర్టీ’ని సాధించాలి

ఉన్నతస్థాయి జనాభాలో మొదటి 10శాతం మంది అట్టడుగున ఉన్న 10-15 శాతం మందిని దత్తత తీసుకుని వారిని ముందుకు నడిపించాలి.

దేశంలో ఉద్యోగాల కల్పన జరగాలి. మానవ వనరుల అభివృద్ధితో పాటు నైపుణ్యాలను కాలానుగుణంగా పెంపొందించుకోవాలి.

రాబోయే 20 ఏళ్లలో దేశానికి అవసరమయ్యే మానవ వనరులు, నైపుణ్యాల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.

దేశంలో నీటి భద్రత కోసం నదులను అనుసంధానించాలి. వ్యవసాయంపై దృష్టి కేంద్రీకరించాలి.

లాజిస్టిక్స్‌ వ్యయం తగ్గించాలి. గ్రీన్‌ ఎనర్జీ, గ్రీన్‌ హైడ్రోజన్‌పై దృష్టిపెట్టాలి.

Updated Date - Nov 17 , 2024 | 05:20 AM