గందరగోళంగా రుద్రాభిషేకం
ABN, Publish Date - Dec 27 , 2024 | 03:20 AM
శ్రీకాళహస్తీశ్వరాలయంలో రుద్రాభిషేకం క్రతువు గందరగోళంగా సాగుతోంది. పూజలకు హాజరయ్యే పలువురు భక్తులకు తీవ్ర అవస్థలు తప్పడం లేదు.
అవస్థలు పడుతున్న భక్తులు
శ్రీకాళహస్తి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయంలో రుద్రాభిషేకం క్రతువు గందరగోళంగా సాగుతోంది. పూజలకు హాజరయ్యే పలువురు భక్తులకు తీవ్ర అవస్థలు తప్పడం లేదు. సాధారణంగా ఎక్కడైనా రోజుకు ఒకసారి లేదా విశేష రోజుల్లో మూలమూర్తి అభిషేకాలను నిర్వహిస్తుంటారు. శ్రీకాళహస్తిలో మాత్రం ప్రతిరోజు నాలుగు కాలాల అభిషేకం జరగడం విశేషం. ఇందులో మూడు కాలాల్లో జరిగే అభిషేకానికి భక్తులను అనుమతిస్తారు. ఈక్షేత్రంలో మొదట అమ్మవారికి అభిషేకం నిర్వహించి ఆ తరువాత స్వామివారిని అభిషేకించడం ప్రత్యేకత. ఇంతటి ప్రాశస్త్య క్షేత్రం కావడంతో భక్తులు రుద్రాభిషేకాన్ని జరుపించుకునేందుకు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. అభిషేకానికి ముందుగా సహస్ర లింగం వద్ద తూర్పు దిశగా భక్తులను ఉంచి సంకల్పం స్వీకరిస్తారు. సుమారు గంట పాటు భక్తులు సంకల్పం పూజలో కూర్చోవాలి. సహస్ర లింగంవద్ద భక్తులు నేలమీదనే కుర్చోవాల్సి వస్తోంది. కీళ్ల సమస్య ఉన్నవారు, వృద్ధులు, దివ్యాంగులు అంత సమయం కింద కూర్చోలేక ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా చిన్న పీటలు వంటివి ఇవ్వాలని వీరిలో చాలామంది సిబ్బందిని అడుగుతుంటారు. సంకల్పం పూజలు తర్వాత అమ్మవారి సన్నిధికి చేరుకుని అక్కడ అభిషేకం వీక్షించాలి. ఆ తరువాత స్వామివారి సన్నిధికి చేరుకుని అభిషేకాన్ని జరిపించుకోవాలి. మొత్తం రుద్రాభిషేకం పూర్తయి భక్తులు ఆలయం వెలుపలకు వచ్చే సరికి మూడు గంటలు పడుతుంది. ముందుగా సంకల్పం వద్ద నిలబడే భక్తులకు మొత్తం అభిషేకాన్ని పూర్తిచేసే సరికి నీరసించిపోతున్నారు. ఇక, రుద్రాభిషేకం సంకల్ప పూజల్లో గోత్రనామాలను స్వీకరించిన తరువాత పండితులు వేదమంత్రాలు, రుద్రపారాయణం చేస్తారు. ఈ మంత్రోచ్ఛరణలను శ్రద్ధతో శ్రవణం చేస్తేనే అభిషేక ఫలితంప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. అయితే సహస్రలింగం వద్ద మూడు వైపులా రూ.5వేల రాహుకేతు పూజలను ఉదయం నుంచి సాయంత్రం వరకు నిత్యం నిర్వహిస్తుంటారు. సరిగ్గా అక్కడే రుద్రాభిషేకం సంకల్ప పూజలకూ స్థానం కేటాయించారు. సంకల్ప పూజల సమయంలో మూడు వైపులా రాహుకేతు పూజలమంత్రాలు గట్టిగా మైకులో చెబుతుంటారు. అక్కడే రుద్రపారాయణం కూడా కొనసాగుతోంది. దీంతో ఏ మంత్రాలో అర్థం కాక భక్తులు గందరగోళానికి గురవుతున్నారు. రూ.5వేల రాహుకేతుపూజలు అయినా, లేదా రుద్రాభిషేకం సంకల్పస్థానాన్ని అయినా సహస్ర లింగం వద్ద నంచి మార్చాలని భక్తులు కోరుతున్నారు.
Updated Date - Dec 27 , 2024 | 03:20 AM