Autobiography గల్లా అరుణకుమారి సాహస రచన స్వీయచరిత్ర
ABN, Publish Date - Aug 31 , 2024 | 01:31 AM
గల్లా అరుణకుమారిని రాజకీయ నాయకురాలిగా కాక ఆమెలోని పోరాట పటిమను, స్త్రీవాద కోణాన్ని ‘గల్లా అరుణకుమారి స్వీయచరిత్ర’ పుస్తకం వెల్లడించిందని ఈ పుస్తకం ఆవిష్కరణ సభలో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.
తిరుపతి(కల్చరల్), ఆగస్టు 30: గల్లా అరుణకుమారిని రాజకీయ నాయకురాలిగా కాక ఆమెలోని పోరాట పటిమను, స్త్రీవాద కోణాన్ని ‘గల్లా అరుణకుమారి స్వీయచరిత్ర’ పుస్తకం వెల్లడించిందని ఈ పుస్తకం ఆవిష్కరణ సభలో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తిరుపతి సమీపంలోని కరకంబాడిలో వున్న అమరరాజ కర్మాగారం ఆడిటోరియంలో శుక్రవారం గల్లా అరుణకుమారి స్వీయచరిత్ర పుస్తకం ఆవిష్కరణ జరిగింది. నలభై ఏళ్ల రాజకీయాల్లోని పలు సందర్భాలను, నాయకులను నిర్మొహమాటంగా ఆమె రాసిన తీరు ఒక సాహసమే అని వక్తలు వ్యాఖ్యానించారు. పుస్తకాన్ని ప్రసిద్ధ స్త్రీవాద రచయిత్రి ఓల్గా ఆవిష్కరించి ప్రసంగించారు. సభకు అధ్యక్షత వహించిన ద్రావిడ విశ్వవిద్యాలయం మాజీ వీసీ కొలకలూరి మధుజ్యోతి మాట్లాడుతూ, తండ్రి పాటూరి రాజగోపాల నాయుడు నుంచి నేర్చుకున్న విలువలను అరుణకుమారి ఆదర్శవంతంగా, ఆచరణాత్మకంగా జీవితాంతం పాటించారన్నారు. కొత్తగా రాజకీయాలలోకి వచ్చే వారికి ఇదొక పాఠ్య పుస్తకమన్నారు. ఈనాడు ఏపీ సంపాదకుడు మానికొండ నాగేశ్వరరావు మాట్లాడుతూ... గల్లా కుటుంబంలోని రాజకీయ నేపఽథ్యం, గాంధేయవాదం స్వీయచరిత్రలో ఉన్నాయన్నారు. వెయ్యి పేజీల పుస్తకం ఆసక్తిగా చదివిస్తుందంటూ, విశ్వనాథ సత్యనారాయణగారి వేయిపడగలతో పోలికను వివరించారు.ఆంధ్రజ్యోతి అసిస్టెంట్ ఎడిటర్ ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ... గల్లా అరుణ కుమారికి తండ్రి ఆదర్శం అయినా, నానమ్మ విస్పష్ట స్వభావం ఆమెలో కనిపిస్తుందన్నారు. స్వతంత్య్రపోరాట నాయకురాలిగా తల్లి అమరావతి కథను అరుణకుమారి రాయాలని ఆకాంక్షించారు. ఈ పుస్తకాన్ని ప్రచురించిన ఎమెస్కో సంస్థ ఎడిటర్ డి. చంద్రశేఖరరెడ్డి అరుణకుమారి స్వీయచరిత్ర పుస్తకాన్ని సమీక్షిస్తూ ప్రసంగించారు. ఈ పుస్తకానికి కథాకాయిక కంటే కథానాయకుడు అరుణకుమారి అని తెలిపారు. రచయితలోని నిజాయితీ ప్రతి పేజీలోనూ కనిపిస్తుందని, పాఠకుని చదివించే గుణం దండిగా ఉందన్నారు.
గల్లా జయదేవ్, డాక్టర్ రమాదేవిలు అమ్మ స్వీయచరిత్ర నేపథ్యాన్ని వివరించగా, గ్రంథస్తమైన ప్రతి సన్నివేశానికీ తాను సాక్షినని గల్లా రామచంద్రనాయుడు చెప్పారు. రచయితగా అరుణకుమారి స్పం దిస్తూ, కుమార్తె రమాదేవి వెంటబడడంతోనే స్వీయచరిత్ర రాసేందుకు పూనుకున్నాని తెలిపారు.తాను రాసిన మూడువేల పేజీల రాతప్రతులను ఆమె సభ ముందుంచారు. రచయిత నామిని సుబ్రమణ్యం నాయుడు, పుస్తకప్రియుడు సాకం నాగరాజ, సురే్‌షలకు స్వీయచరిత్ర ప్రతులను సభావేదికపై అందించారు.గత నాలుగు దశాబ్ధాలుగా గల్లా అరుణ కుమారి రాజకీయ జీవితంతో సంబంధం ఉన్న నాయకులు, కార్యకర్తలు, గల్లా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సాహితీవేత్తలు, భాషాభిమానులు పలువురు ఈ సభలో పాల్గొని అరుణకుమారికి అభినందనలు తెలిపారు.
ఓల్గా మాటల్లో..
అరుణకుమారిలోని నిబద్దత, సాహసం, నిజాయితీ ఈ గ్రంథంలో అడుగడుగునా కనిపిస్తోంది. ఇదొక చరిత్ర గ్రంథం. అధికార రాజకీయాలు, ముఖ్యంగా రాజకీయాలలో స్ర్తీ పరిస్థితి ఎలా ఉంటుందో ఈ పుస్తకంలో వివరంగా ఉంది. స్ర్తీ దృష్టికోణంలో ఒక రాజకీయ నాయకురాలు రాసిన అరుదైన ఆత్మకథ ఇది. -
గల్లా అరుణకుమారి మాటల్లో..
ఎవరినో బాధపెట్టాలని గానీ, కించపరచాలని గానీ నేను ఈ పుస్తకం రాయలేదు. నా అనుభవంలో జరిగిన సంఘటనలను యథాతథంగా రాశాను.ఎవరి మనసుకైనా నొప్పి కలిగితే మన్నించండి.నా స్వీయచరిత్రకు స్పందనగా ఏది వచ్చినా ఎదుర్కొనేందుకు నేను సిద్ధమే.
Updated Date - Aug 31 , 2024 | 01:31 AM