ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirupati: విడవని వాన

ABN, Publish Date - Dec 01 , 2024 | 01:07 AM

‘ఫెంగల్‌’ ప్రభావంతో జిల్లా అంతటా శుక్రవారం రాత్రి నుంచీ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలకు తోడు ఈదురు గాలులతో చలి పెరిగింది. జన జీవనానికి తీవ్ర అంతరాయం కలిగింది.

చెన్నై-కోల్‌కత్తా జాతీయ రహదారిపై వర్షపు నీరు (ఇన్‌సెట్లో) తిరుపతి ఆర్టీసీ బస్టాండులో వర్షపు నీరు

తిరుపతి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ‘ఫెంగల్‌’ ప్రభావంతో జిల్లా అంతటా శుక్రవారం రాత్రి నుంచీ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలకు తోడు ఈదురు గాలులతో చలి పెరిగింది. జన జీవనానికి తీవ్ర అంతరాయం కలిగింది. ఆగకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకల్లో ప్రవాహాలు మొదలయ్యాయి. 30 చెరువులు నిండిపోయి కలుజులు పారుతున్నాయి. మల్లిమడుగు, కాళంగి రిజర్వాయర్లు, స్వర్ణముఖి బ్యారేజీలు నిండిపోయి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక, పిచ్చాటూరులోని అరణియార్‌ ప్రాజెక్టులోకి పాతిక అడుగుల మేరకు నీటి మట్టం పెరిగింది. ఆ ప్రాజెక్టు గేట్లను ఎస్పీ సుబ్బరాయుడు పరిశీలించారు. ఇలాగే వర్షం పడితే శనివారం అర్థరాత్రికి ప్రాజెక్టు నిండిపోయే అవకాశముంది. ఇక, జిల్లాలో 30 దాకా చెరువులు నిండిపోయి కలుజు పారుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

కాజ్‌వేపై నీటి ఉధ్రుతిలో ఆగిన బస్సు

వరదయ్యపాలెం మండలం గోవర్ధనపురం సమీపంలో మారేడు కాలువ పొంగి ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం తక్కువగా ఉందని భావించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ బస్సును ముందుకు తీసుకెళ్లగా.. కాజ్‌వేపై నీటి ఉధృతిలో ఆగిపోయింది. బస్సులోని 40 మంది ప్రయాణికులు భయాందోళన చెందారు. గ్రామస్తులు చేరుకుని వీరిని క్షేమంగా గట్టుకు చేర్చారు. ఇక, శ్రీకాళహస్తి- సూళ్లూరుపేట నడుమ కొన్నంబట్టు వద్ద నిర్మాణంలో ఉన్న కల్వర్టు వద్ద చెరువు నీరు ఉధృతికి రాకపోకలు ఆగిపోయాయి. ఏర్పేడు మండలం పాపానాయుడుపేట నుంచి గుడిమల్లం వెళ్ళే మార్గంలో సీత కాలువ ప్రవాహ ఉధృతి పెరగడంతో రాకపోకలు ఆగాయి. దీంతో తుపాను ప్రభావం తగ్గేవరకు గుడిమల్లం పరశురామేశ్వర ఆలయానికి భక్తులు రావద్దని సూచిస్తూ అధికారులు ప్రకటన విడుదల చేశారు. మోదుగులపాలెం వద్ద స్వర్ణముఖి నది లో లెవల్‌ కాజ్‌వేపై ఉధృతంగా ప్రవహిస్తోంది. రేణిగుంట మండలం గాజులమండ్యం వద్ద కల్లూరు వంక పొంగడంతో అధికారులు రోడ్డును మూసివేశారు.


నేడూ జిల్లాకు తుపాను ముప్పు

శనివారం రాత్రి ఫెంగల్‌ తుపాను తీరం దాటినా.. ఆదివారం కూడా జిల్లాకు భారీ వర్షాల ముప్పు పొంచి వుంది. తీవ్రత తక్కువైనా వర్షాలు ఆగకుండా ఇలాగే ఆదివారం కూడా పడితే మాత్రం వాగులు, వంకలు పూర్తిస్థాయిలో ప్రవహించే అవకాశముంది. చెరువులకు, కల్వర్టులకు గండ్లు పడే ప్రమాదముంది. పల్లపు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు పంటలు దెబ్బతినొచ్చు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

నారాయణవనంలో 150.6 మి.మీ

తిరుపతి (కలెక్టరేట్‌), ఆంధ్రజ్యోతి: శనివారం వేకువజాము నుంచి రాత్రి వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. అత్యధికంగా నారాయణవనం మండలంలో 150.6 మిల్లీమీటర్లు, అత్యల్పంగా పాకాలలో 27 మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది. సూళ్లూరుపేట 145, తడ 140.8, చిట్టమూరు 135.6, వాకాడు 134.2, పుత్తూరు 133.2, వరదయ్యపాళెం 130, పిచ్చాటూరు 123.8, వడమాలపేట 123.8, దొరవారిసత్రం 122.4, సత్యవేడు 109, కేవీబీపురం 107.6 చొప్పున వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటు వర్షపాతం 86 మిమీ.

11 విమానాల రద్దు.. ఒకటి దారి మళ్లింపు

రేణిగుంట, ఆంధ్రజ్యోతి: రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోవడంతో 12 విమాన సర్వీసులు రద్దయ్యాయి. శనివారం 16 సర్వీసులు నడవాల్సి వుండగా ఉదయం నాలుగు మాత్రం వచ్చి వెళ్ళాయి. ఆ తర్వాత హైదరాబాదు నుంచీ వచ్చిన ఇండిగో విమానం రేణిగుంటలో ల్యాండ్‌ కాలేకపోవడంతో 15 నిమిషాలపాటు చక్కర్లు కొట్టాక.. దాన్ని బెంగళూరుకు మళ్లించారు. దీంతో ఇండిగో, స్పైస్‌ జెట్‌, ఎయిర్‌ అలయెన్స్‌, స్టార్‌ ఎయిర్‌ లైన్స్‌ సంస్థలకు చెందిన 11 సర్వీసులను రద్దు చేశారు.

ఆలస్యంగా రైళ్ల రాకపోకలు

తిరుపతి(సెంట్రల్‌), ఆంధ్రజ్యోతి: చెన్నై నుంచి బయలు దేరవలసిన పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను తిరువళ్ళూరు నుంచి నడిపినట్లు అధికారులు తెలిపారు. తిరుపతి- చెన్నై మధ్య నడుస్తున్న సప్తగిరి, గరుడాద్రి ఎక్స్‌ప్రె్‌సలు శనివారం తిరువళ్ళూరు నుంచి తిరుపతికి రాకపోకలు సాగించాయి.

విపత్తును ఎదుర్కోవడానికి సన్నద్ధం

తిరుపతి (కలెక్టరేట్‌/వైద్యం), ఆంధ్రజ్యోతి: తుపాను నేపథ్యంలో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉందని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ శనివారం తెలిపారు. అవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయవద్దని సూచించారు. చెరువులు, వాగులు, వంకలు పొంగినీరు ప్రవహిస్తున్న దృష్ట్యా ఎవరూ దాటే ప్రయత్నం చేయొద్దన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కలెక్టరేట్లోని 0877-2236007కు ప్రజలు సమాచారం ఇవ్వవచ్చన్నారు. సుమారు 20 విద్యుత్‌ స్తంభాలు కూలగా.. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, తుపాను నేపథ్యంలో పోలీసు యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందించాలన్నారు. వాగులు, వంకలు, లోతట్లు ప్రాంతాల వద్ద భద్రతా చర్యలు చేపట్టి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. పాత భవనాల్లో ఉండే వారిని ఖాళీ చేయించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం 112, 80999 99977 నెంబర్లకు ఫోను చేయాలని సూచించారు.

Updated Date - Dec 01 , 2024 | 01:07 AM